-బెడ్ల కిందికి వరద
-ఉస్మానియా ఆస్పత్రిలో మురుగు వాసన
– ఓపీ బ్లాక్‌లో మోకాళ్ల లోతుకు నీరు
– బాత్‌రూంకు వెళ్లలేక రోగుల బాధ

హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రిలోకి వరద నీరు చేరి ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తున్నది. బుధవారం కురిసిన వర్షానికి ఓపీ బ్లాక్‌లో మోకాళ్ల లోతుకు నీరు చేరడంతో రోగులు సహా వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లు అడ్డం పెట్టి లోపలికి రాకుండా ప్రయత్నించినా నీరు ఆగడం లేదు. కనీసం బాత్‌రూంకు వెళ్దామన్నా కిందకు దిగలేని పరిస్థితి. డ్రెయినేజీ నీరు వర్షపు నీటిలో కలవడంతో మురుగు మొత్తం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. సోమవారం రాత్రి కూడా వర్షానికి ఆస్పత్రిలోకి వరద నీరు చేరి ఇబ్బందులు ఎదురైన విషయం తెలిసిందే. రెండ్రోజులు గడవక ముందే మళ్లీ అదే పరిస్థితి తలెత్తడం చూస్తే అధికారులు కనీస చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతున్నదని రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రిలోని కారిడార్లు, వార్డుల్లోకి భారీగా నీరు చేరడంతో బెడ్లు దిగలేక పడుకున్న చోటే ఎదురు చూస్తున్నారు. నీళ్లు లోపలికి రాకుండా బెడ్లు, ఇతర సామగ్రి అడ్డుపెట్టినా వరద ఉధృతి ఆగలేదు. ఆస్పత్రి డ్రెయినేజీలోని నీరు కూడా పైకి పొంగిపొర్లడంతో ఆ వాసన భరించలేక పోతున్నామని బాధితులు వాపోతున్నారు. ఆస్పత్రి పాతభవనం వద్ద కూడా భారీగా నీరు చేరింది. 2015లో సీఎం కేసీఆర్‌, మంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రిని సందర్శించి శిథిలావస్థకు చేరిందని గుర్తించారు. కొత్త బిల్డింగ్‌కు డిజైన్లు రూపొందిస్తున్నామని చెప్పినా అమలుకు నోచుకోలేదు. నెలరోజుల క్రితమే ఆస్పత్రిలోని రెండో ఫ్లోర్‌లో ఉన్న వార్డులను మొదటి ఫ్లోర్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి మార్చారు. దీంతో స్థలం సరిపోక పక్కపక్కనే బెడ్లు ఏర్పాటు చేయడంతో పేషంట్లు కిక్కిరిసిపోయారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో రెగ్యులర్‌ ఓపీ కంటేఐపీ చాలా ఎక్కువ పెరిగిపోయింది. దీనికితోడు కరోనా సమయం, వర్షాకాలం కావడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఈ బిల్డింగ్‌లో మెడికల్‌, సర్జికల్‌, ఆర్థోపెడిక్‌, సూపర్‌ స్పెషాలిటీ వార్డులున్నాయి. ఆస్పత్రిలోకి చేరిన వర్షపు నీటిని బయటికి పంపింగ్‌ చేయడానికీ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం గమనార్హం.

Courtesy Nava Telangana