అనుమతి రాగానే నడిపేలా ముందస్తు సన్నద్ధత
జోన్ల వారీగా సిద్ధమవుతున్న ప్రణాళికలు

దిల్లీ: లాక్‌డౌన్‌ వల్ల నిలిచిపోయిన రైళ్లను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే దశలవారీగా వాటిని పట్టాలెక్కించడానికి తగిన ప్రణాళికల్ని రైల్వేశాఖ సిద్ధం చేసుకొంటోంది. వేల రైళ్లను ఒకేసారి కాకుండా దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని అధికార యంత్రాంగం యోచిస్తోంది. రైళ్లను ఎలా పునరుద్ధరించాలనే విషయమై ఈ వారంలోనే కేంద్రం ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆదాయార్జనపై కంటే ప్రయాణికుల ఆరోగ్య భద్రతపైనే దృష్టి సారించామని, రైళ్ల రాకపోకల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా చూడడమే తమ లక్ష్యమని రైల్వే శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. దాదాపు 5000 వరకు రైలుపెట్టెల్ని కరోనా రోగుల చికిత్సకు తగ్గట్టుగా మార్చినందున నికరంగా అందుబాటులో ఉండే పెట్టెలెన్ని, వాటితో ఎన్ని రైళ్లను నడపవచ్చు అనేది తేల్చడానికి జోన్లవారీగా కసరత్తు కొనసాగుతోంది.

పునరుద్ధరణ ప్రతిపాదనల్లో కొన్ని…
ప్రయాణికుల్ని రైళ్లలోకి అనుమతించే ముందు ‘ఆరోగ్య సేతు’ యాప్‌ ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. శరీర ఉష్ణోగ్రతల్ని కొలిచేందుకు థర్మల్‌ స్క్రీనింగ్‌ సహా ఇతరత్రా మెరుగైన సాధనాలు ఉన్నాయా అనేది పరిశీలిస్తున్నారు. ఆరోగ్యవంతులనే ప్రయాణానికి అనుమతిస్తారు.
 ముఖాలకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని నిబంధన విధిస్తారు. ప్రయాణికుల మధ్య సామాజిక దూరం కొనసాగేలా చేస్తారు.
 వలస కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయినందువల్ల వారి అవసరాలు తీర్చే మార్గాల్లో ముందుగా రైళ్లను నడపాలనేది ఒక ప్రతిపాదన.
 కరోనా కేసులకు మూల కేంద్రాలుగా ఉన్న ప్రాంతాల మీదుగా వెళ్లని, ఆయా స్టేషన్లలో ఆగని రైళ్లను తొలుత పునఃప్రారంభించాలనేది మరో ఆలోచన.
 లాక్‌డౌన్‌ను దేశం మొత్తానికి ఒకేసారి ఎత్తివేస్తారా, కొన్ని రాష్ట్రాల్లోనా అనే నిర్ణయాన్ని బట్టి రైళ్ల పునరుద్ధరణ ఆధారపడుతుంది. కొన్ని ప్రాంతాల్లోనే లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే రైలు కూత ఈ ప్రాంతాలకే పరిమితమవుతుంది.
రైళ్లను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తే ఒక్కసారిగా రైల్వేస్టేషన్లలో పెరిగిపోయే తాకిడిని ఎలా ఎదుర్కోవాలనే ప్రణాళికను ముందుగానే సిద్ధం చేస్తున్నారు.

తొలిరోజు ద.మ.రైల్వే జోన్‌ పరిధిలోని రైళ్లే
హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత తమ పరిధి నుంచి ప్రారంభమయ్యే రైళ్ల పునరుద్ధరణపై దక్షిణ మధ్య రైల్వే కార్యాచరణను రూపొందించింది. ఆమోదం కోసం దీనిని రైల్వేబోర్డుకు పంపించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సేవలు పునరుద్ధరించిన తొలిరోజు ద.మ.రైల్వే పరిధిలో ప్యాసింజర్‌ రైళ్లు నడిపే అవకాశం లేదు. ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు, ద.మ.రైల్వే నిర్వహణ పరిధిలో ఉన్న ఎక్స్‌ప్రెస్‌/ సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో ఎంపిక చేసిన కొన్నే మొదటగా పట్టాలెక్కే అవకాశం ఉంది. తెలంగాణ పరిధిలో చూస్తే.. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, వికారాబాద్‌, మణుగూరు, కరీంనగర్‌ తదితర స్టేషన్ల నుంచి బయలుదేరే రైళ్లలో ఏ రోజు ఎన్ని నడపాలో అధికారులు ప్రతిపాదించారు.
 లింగంపల్లి నుంచి బయలుదేరే నారాయణాద్రి, గౌతమి రైళ్లు తొలిరోజు పట్టాలెక్కవు.
 ఇతర జోన్ల ఆధీనంలో ఉండే రైళ్లలో సికింద్రాబాద్‌-హావ్‌డా ఈస్ట్‌కోస్ట్‌, సికింద్రాబాద్‌-హజ్రత్‌ నిజాముద్దీన్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-తిరువనంతపురం శబరి, సికింద్రాబాద్‌-హుబ్బళ్లి ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు 2, 3 రోజుల తర్వాత పట్టాలెక్కనున్నాయి.
తెలంగాణ, హుస్సేన్‌సాగర్‌, తుంగభద్ర, సికింద్రాబాద్‌-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-హావ్‌డా ఫలక్‌నుమా తదితర రైళ్లను తొలిరోజు పట్టాలు ఎక్కించాలని భావిస్తున్నారు.

Courtesy Eenadu