హమ్నా నసీర్

శుక్రవారం రోజున రాధిక వేముల,అబేదా,సలీమ్ తాడ్వి,ఫాతిమా నయీస్ CAA కి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు.

నాలుగేళ్ల క్రితం తన కొడుకుని కోల్పోయిన రోహిత్ వేముల తల్లి అతని ప్రతిమ చుట్టూ చేతులు వేసి తను బతికున్న రోజులు మళ్లీ ఓసారి గుర్తు తెచ్చుకుని విలపించారు. నాలుగేళ్ల క్రితం జనవరి 27 న రోహిత్ మరణంతో హైదరాబాద్ యూనివర్సిటీలో సామాజిక న్యాయం కోసం పోరాటాలు ఆరంభమయ్యాయి,

శుక్రవారం అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నిర్వహించిన రోహిత్ షహదత్ దిన్ ఈవెంటులో పాల్గొనడానికి వచ్చిన రోహిత్ వేముల తల్లినీ,డాక్టర్ పాయల్ తాడ్వీ తల్లిదండ్రులు అబేదా,సలీమ్ తాడ్వీలని సెక్యూరిటీ చెక్ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోకి అనుమతించారు.

2015లో హైదరాబాద్ యూనివర్సిటీ రోహిత్ తో పాటూ నలుగురు దళిత విద్యార్థులని హాస్టల్ నుంచి సస్పెండ్ చేయడంతో వారు వెలివాడ అనే చోటు నిర్మించుకుని అక్కడే ఉన్నారు. వెలివాడ కి దళితులు నివసించే చోటు అనే అర్థం వస్తుంది. యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన వెంటనే రోహిత్ అమ్మ గారు అక్కడికి వెళ్లి అతని ప్రతిమకి పూలమాల వేసారు. అక్కడ గుమిగూడిన జనాల మధ్య ఉన్నత విద్యా సంస్థల్లో పాతుకుపోయిన కులవివక్ష కారణంగా తమ పిల్లలు తమకెలా దూరమయ్యారో గుర్తు తెచ్చుకుని రాధిక వేముల,అబేదా విలపించారు.

ఆ తర్వాత నినాదాలు చేస్తూ విద్యార్థులు రాధిక వేముల తో కలిసి డీఎస్టీ ఆడిటోరియం వైపుకి ర్యాలీగా బయలుదేరారు. అక్కడ వారితో వక్తలు యోగేంద్ర యాదవ్,ప్రొఫెసర్ కె.లక్ష్మినారాయణ,అడ్వకేట్ భీం రావు వారితో కలిసారు.

మిగతా వారంతా ఇంకా మన సమాజంలో ఎన్నో అరాచకాలకి కారణమౌతున్న కులవివక్ష గురించి మాట్లాడగా రాధిక వేముల,అబేదా తమ పిల్లల మరణాలకి దారితీసిన సంఘటనల గురించి అందరికీ వివరించారు. “వారు మా ఆశల్ని నీరుగార్చారు,ఇంకా ఇతర విద్యార్థుల ఆశలపైనా నీళ్లు చల్లుతూనే ఉన్నారు. రోహిత్ వేములకి మల్లే వ్యవస్థ చేసే హత్యలు ఈ దేశంలో మరిన్ని జరుగుతూనే ఉంటాయి” అని రాధిక వేముల అన్నారు.

రాధిక వేముల తాను పాయల్ తాడ్వీ తల్లి అబేదా,జే ఎన్ యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ తల్లి ఫాతిమా నయీస్ తో కలిసి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మదర్స్ ఫర్ ది నేషన్ యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా క్యాంపైన్ నిర్వహించనున్నట్టుగా ప్రకటించింది.

పాయల్ తాడ్వీ ముంబైలోని బివైఎల్ నాయర్ హాస్పిటల్లో వైద్య విద్యార్థిని,గత సంవత్సరం మే నెలలో ఆత్మహత్యకి పాల్పడింది. తను రాసిన ఉత్తరంలో ఓ సీనియర్ తనపై వివక్షాపూరితంగా ప్రవర్తించాడని రాసింది. పాయల్ వెనుకబడిన భీమ్ ముస్లిం ఆదివాసీ తెగలకి చెందిన యువతి. జే ఎన్ యూ విద్యార్థి నజీబ్ అహ్మద్ 2016 అక్టోబర్ నుంచి కనిపించకుండా పోయాడు.

రాధిక వేముల CAA తీసుకురావడం ద్వారా నరేంద్ర మోడీ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలనే కుట్ర పన్నినట్టు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ది న్యూస్ మినట్ తో మాట్లాడుతూ “గత నాలుగేళ్లుగా ఎంతో క్షోభని అనుభవించాను,కుట్టు పని నేర్చుకుని జీవితాన్ని ఎంతో భారంగా కొనసాగిస్తున్నాను.జే ఎన్ యూ విద్యార్థుల నిరసనలు చూసి మళ్లీ నా రక్తం మరిగిపోతోంది. మోదీ,షా ఎక్కడనుంచి వచ్చారో మొదట నిరూపించుకోవాలి. ఇది మనం ఎంతమాత్రమూ సహించకూడదు” అన్నారు.

పోరాటాన్ని కొనసాగిస్తాం :- యూనివర్సిటీ విద్యార్థులు
రోహిత్ వేములతో పాటూ హాస్టల్ నుంచి సస్పెండ్ చేయబడిన పీహెచ్డీ స్కాలర్ దొంతా ప్రశాంత్ రోహిత్ వేములకి న్యాయం జరిగే దాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ నాలుగేళ్లలో తమ పోరాటాన్ని అణచివేయడానికి కుల శక్తులూ,ఆధిపత్య వర్గాలూ చాలా ప్రయత్నించినా అవేవీ మా ఉద్యమ స్ఫూర్తిని దెబ్బ తీయలేక పోయాయన్నారు.

అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్,పీహెచ్డీ స్కాలర్ ఇనియవన్ మాట్లాడుతూ ప్రతి ఏడాదీ రోహిత్ షహదత్ దిన్ రోజున ఆత్మగౌరవం,సమానత్వం,సామాజిక న్యాయం కోసం పాటుపడే విద్యార్థులంతా చేతులు కలుపుతారని అన్నారు. ప్రత్యేకించి దళిత,బహుజన విద్యార్థులు అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో ఈ పోరాటాల్లో పాల్గొనడానికి ఎంతో అంకితభావంతో ముందుకొస్తారు. సవర్ణులకి కూడా ఇదే టైంలో సమాజంలో కులప్రభావం ఇంకా ఉందనే వాస్తవాన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితిని తీసుకొస్తుంది.

యూనివర్సిటీ లో ఎం.ఏ ఫిలాసఫీ మొదటి సంవత్సరం చదువుతున్న అహ్మద్ అనే విద్యార్థి రోహిత్ చనిపోయినప్పుడు క్యాంపస్లో లేరు కానీ అప్పుడు జరిగిన చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు. “రోహిత్ ఉద్యమం ద్వారానే నాలో రాజకీయ చైతన్యం వచ్చింది. “హైదరాబాద్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పి.అప్పారావు,మానవ వనరుల మంత్రిత్వశాఖ దారుణమైన ప్రవర్తనని చూసి తట్టుకోలేకపోయాను. రాధికమ్మ కళ్లలో నీళ్లు తిరగడం చూసి బాధేసింది. కానీ ఆవిడే మళ్లీ ర్యాలీకి నాయకత్వం వహించి ఈ మా పోరాటాన్ని ఆపకూడదు అంటూ మాలో ధైర్యాన్ని రగిలించింది” అన్నారు.

రోహిత్ వేముల మరణం దేశవ్యాప్తంగా కులవివక్షకి వ్యతిరేకంగా అనేకమంది విద్యార్థుల పోరాటాలని ప్రారంభించింది. ఆ తర్వాత కూడా చాలా మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. యూనివర్సిటీ క్యాంపస్లలో ఇంకా కుల,మతపరమైన వివక్ష యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈమధ్యే ఐఐటి మద్రాస్ లో యువ ముస్లిం విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య చేసుకుంది. తన ప్రొఫెసర్ల నుంచి మత వివక్షని ఎదుర్కొన్నట్టుగా తెలిపింది.

యూనివర్సిటీలలో ఫీజుల పెంపుకి నిరసనగా,రిజర్వేషన్ల అమలులో పారదర్శకత,వెనుకబడిన కులాలకి చెందిన విద్యార్థుల కోసం సంక్షేమ పథకాలకై అనేక విద్యార్థి పోరాటాలు ప్రస్తుతం ఊపందుకుంటున్నాయి. ఈ ఉద్యమాలన్నింటికీ రోహిత్ వేముల ఓ చిహ్నంగా నిలుస్తున్నారు.