చదువు అయిపోగానే అందరికీ ఒక లక్ష్యం ఉంటుంది. మంచి ఉద్యోగం… లేదంటే నచ్చిన వ్యాపారం. కానీ సందీప్‌ కుమార్‌… డిగ్రీ పట్టా చేతికి రాగానే సామాజిక సేవను ఎంచుకున్నాడు. అట్టడుగు వర్గాల బాలల వికాసానికి శ్రీకారం చుట్టాడు. ఇల్లిల్లూ తిరిగి సగం వాడి పడేసిన పుస్తకాలు, పెన్నులు సేకరించి పేద విద్యార్థులకు అందిస్తున్నాడు. ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ నుంచి కూడా ప్రశంసలందుకున్న ఈ ‘బుక్‌ మ్యాన్‌ ఆఫ్‌ హరియానా’ స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది… 

మీ పెన్నులో రీఫిల్‌ ఎన్నిసార్లు మారుస్తారు? స్టేషనరీని పూర్తి స్థాయిలో ఎంతమంది వినియోగిస్తారు? ఆలోచిస్తే బహుకొద్దిమందే ఉంటారు. కానీ మీరు చివర వరకు ఉపయోగించకుండా వదిలేసిన పెన్నులు, సగం వాడి వదిలేసిన నోట్‌పుస్తకాలు, పెన్సిళ్లు, షార్పనర్స్‌, లంచ్‌బాక్స్‌లు… వీటితో మరొకరు తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయగలరని ఎప్పుడైనా ఊహించారా? మనకు తట్టని ఈ ఆలోచన చండీగఢ్‌కు చెందిన సందీప్‌ కుమార్‌కు తట్టింది. దానికి రూపమే ‘రద్దీ సే శిక్షా’ క్యాంపెయిన్‌. రెండేళ్ల కిందట ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించిన ఈ 29 ఏళ్ల యువకుడు… మురికివాడల్లోని పిల్లల విద్యాభ్యాసానికి పునాదులు వేస్తున్నాడు.

ఉపాధ్యాయుడిగా వెళ్లి…
పెన్ను, పెన్సిల్‌ మనకు చిన్న చిన్న వస్తువులే. కానీ అవి కొనుక్కొనే స్థోమత లేక అట్టడుగు వర్గాలకు చెందిన ఎంతోమంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. ఈ వాస్తవమే సందీప్‌కు నిద్ర పట్టనివ్వలేదు. అసలిదంతా అతనికి బోధపడింది ఎప్పుడో తెలుసా? ఉపాధ్యాయుడిగా ఓ పాఠశాలలో పాఠాలు చెప్పడానికి వెళ్లినప్పుడు! డిగ్రీ అవ్వగానే సందీప్‌ ‘జూనియర్‌ బేసిక్‌ ట్రైనింగ్‌ కోర్స్‌’ చేశాడు. ఈ సర్టిఫికెట్‌ ఉంటే అక్కడి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఐదో తరగతి వరకు బోధించవచ్చు. కోర్సులో భాగంగా చివరి సంవత్సరం భివాని ప్రభుత్వ పాఠశాలలో పనిచేశాడు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా వ్యవస్థలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయనిపించింది అతడికి.

ఏం చేయాలో అంతుపట్టలేదు…
‘‘విద్యార్థులు చాలా తెలివైనవారు. పాఠం ఇలా చెప్పగానే అలా పట్టేస్తున్నారు. ‘మరి నోట్స్‌లు రాస్తున్నారా’ అని అడిగితే… ‘మాకు పుస్తకాలే కాదు… పెన్నులు, పెన్సిళ్లు కూడా లేవ’ని బదులిచ్చారు’’ అంటూ చెప్పుకొచ్చాడు సందీప్‌. ఆరంభంలో తన సొంత డబ్బు ఖర్చు పెట్టి పిల్లలకు అవసరమైన పుస్తకాలు, స్టేషనరీ కొనిచ్చేవాడు. ఎప్పుడైతే ఈ విషయం అందరికీ తెలిసిందో… చాలామంది విద్యార్థులు వచ్చి అడగడం మొదలుపెట్టారు. దీంతో ఈ సమస్య చిన్నది కాదని అతడికి అర్థమైంది. ఎందుకిలా? అని ఆరా తీస్తే… ‘‘సర్వశిక్ష అభియాన్‌’ కింద ప్రభుత్వం ఇస్తున్న డబ్బు పిల్లల తల్లితండ్రుల ఖాతాకు వెళుతోంది. పేదరికం నేపథ్యంలో వారు అందులో కొంత వేరే అవసరాలకు వాడుకొంటున్నారని గ్రహించాను. కొంతమంది పిల్లల ఇంటికెళ్లి చూస్తే… కనీసం ఓ పూట కూడా కడుపు నిండా తినలేని దుస్థితి వారిది. ఆ దృశ్యాలు నన్ను బాగా కలవరపెట్టాయి. ఏం చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో కూడా ఆ సమయంలో నాకు అంతుపట్టలేదు’’ అంటూ భావోవ్వేగంగా చెప్పాడు సందీప్‌.

తిరిగొచ్చాకా అవే చిత్రాలు…
కోర్సు పూర్తయి సొంత నగరం చండీగఢ్‌కు తిరిగొచ్చాక కూడా అవే చిత్రాలు సందీప్‌కు కనిపించాయి. అక్కడి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితిలో ఏ మాత్రం తేడా లేదు. ఇక ఆ క్షణమే బోధపడింది అతడికి… తాను చేయాల్సిన కార్యం ఏమిటో! దాన్ని ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో! వివిధ విద్యా సంస్థలకు వెళ్లి, పేదరికంలో మగ్గుతున్న పిల్లలను వెతికి పట్టుకొంటే, వారికి సాయం చేయవచ్చనుకున్నాడు. దానికి అతడు ఎంచుకున్న మార్గం ఇంటింటికీ వెళ్లి పాత పుస్తకాలు, స్టేషనరీ సేకరణ. ఏదో తూతూ మంత్రంగా కాకుండా ‘ఓపెన్‌ ఐస్‌ ఫౌండేషన్‌’ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. 2016లో ఏర్పాటైన ఈ సంస్థలో ఇప్పుడు అతడిలా ఆలోచించే మరికొందరు సామాజిక కార్యకర్తలు తోడయ్యారు.

కుప్పలు కుప్పలు…
పుస్తకాల సేకరణ కోసం ఇళ్లకు వెళ్లినప్పుడు సందీప్‌ను ఓ అంశం ఆశ్చర్యానికి గురిచేసింది. అదేమిటంటే… ‘‘దాదాపు అన్ని ఇళ్లల్లో పాత పుస్తకాలు పేరుకుపోయి ఉన్నాయి. కొన్నాళ్ల తరువాత వాటిని తూకానికి అమ్మేస్తున్నారు. ఎక్కువమంది విద్యా సంవత్సరం అయిపోగానే పుస్తకాలే కాదు, స్టేషనరీ, లంచ్‌ బాక్స్‌లు, బ్యాగ్‌లు… ఇలా అన్నీ కొత్తవి కొనుక్కొంటున్నారు. పాతవాటిని పక్కన పడేస్తున్నారు. ఎక్కడో ఎందుకు? మా అన్నయ్యవాళ్ల ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. కనీసం పెన్ను, పుస్తకం కొనుక్కోలేక ఎంతోమంది పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. మన ఇళ్లల్లో పనికిరావనుకున్న అదే స్టేషనరీతో ఇలాంటి పిల్లల చదువు పూర్తవుతుంది. అందుకే సేకరణ మొదలుపెట్టాను. సగమే రాసిన నోట్స్‌లు, విసిరేసిన షార్పనర్లు తీసుకొంటున్నాం. రీఫిల్స్‌ అయిపోగానే పారేసే పెన్నులను రీఫిల్‌ చేసి ఇస్తున్నాం’’ అంటున్న సందీప్‌ తన సంస్థ ద్వారా ఇప్పటివరకు మురికివాడల్లోని పిల్లలకు పది వేలకు పైగా పుస్తకాలు పంపిణీ చేశాడు.

ప్రధాని ‘మన్‌ కీ బాత్‌’ అయ్యాడు…  
కరోనా మహమ్మారి వల్ల అన్ని రంగాలూ కుదేలయ్యాయి. ముఖ్యంగా బడులు లేక పిల్లలు నెలలకు నెలలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ పరిణామం వారిపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. దీన్ని గ్రహించిన సందీప్‌… అట్టడుగు వర్గాల పిల్లల వద్దకే పుస్తకాలు తీసుకువెళ్లాడు. అందుకోసం మొబైల్‌ లైబ్రరీ ఒకటి సిద్ధం చేశాడు. ఓ పాత కారు తీసుకుని, దాని వెనక భాగాన్ని పుస్తకాలు పెట్టుకొనేలా అరలు అరలుగా తీర్చిదిద్దాడు. ఆ వాహనంలో పొద్దున్నే బస్తీలకు వెళతాడు. ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్‌ కీ బాత్‌’లో ఈ రిమోట్‌ లైబ్రరీ గురించి, సందీప్‌ నిస్వార్థ సేవ గురించి ప్రస్తావించి, ప్రశంసించారు. ఆన్‌లైన్‌ తరగతుల సౌకర్యాలు లేని పిల్లలందరికీ నడిచొచ్చే విద్యాలయమై అలుపెరుగని సేవలు అందిస్తున్న సందీప్‌ యువతరానికి నిజమైన స్ఫూర్తి.

Courtesy Andhrajyothi