లక్ష్మణ్‌ గడ్డంImage may contain: 1 person, standing and text
రాష్ట్ర అధ్యక్షులు, పౌర హక్కుల సంఘం

ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించే వారు, మాట్లాడేవారు, రాసేవారు, విశ్లేషించే వారు, ప్రజలకు చైతన్యం కలిగించేవారు, పోరాటాల వైపు సంఘటితం చేసే చైతన్య వంతులు ఉండకూడదని ప్రభుత్వం కోరు కుంటున్నది. చరిత్ర పొడవునా ఇటువంటి ప్రయత్నాలు చేసిన ప్రభుత్వాలెన్నో ఉన్నాయి. అయితే ఏ ఒక్క ప్రభుత్వమూ ఇలాంటి ప్రయత్నంలో ఎల్లకాలం విజయవంతం కాలేదని చరిత్ర రికార్డు చేసింది.

రాష్ట్రంలో ప్రజలకు ఇంట్లో కుదుటగా కూర్చుంటామని గ్యారెంటీ లేదు. కంటినిండా కునుకు తీస్తామని భరోసా లేదు. తెలవారుతుండగా బయటికి వెళతామనే భద్రతా లేదు. ఎప్పుడు పోలీసులు గద్దల్లా వాలి తన్నుకుపోతారోననే భయాందోళనలు నెలకొని ఉన్నాయి. మునుపటి రోజుల్లో పోలీసులు దొంగతనాలు చేసేవాళ్లను, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవాళ్ళను ఖైదు చేసేవారు. ఇప్పుడు న్యాయం తప్పకుండా బతుకుతున్న ప్రజా సంఘాల నాయకులను ఖైదుల్లోకి పంపుతున్నారు.

ఈ నెల 18న తెల్లవారు జామున ఆరున్నర గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చొచ్చుకుపోయి క్వార్టర్‌లో నివసిస్తున్న తెలుగు డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌ కాసీంపై పోలీసులు దాడిచేసి ఎత్తుకు పోయారు. రాష్ట్రంలో మరొక వ్యక్తి ఖాళీ అయ్యాడు. పాప జాబిల్లి, బాబు వసందు తండ్రి కోసం గుండె పగిలి బిత్తరచూపులు చూస్తున్నారు. నాన్నను పోలీసులు ఎందుకు పట్టుకుపోయారో? అర్థంకాక ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏడవొద్దని పిల్లలకు స్నేహలత గట్టిగా నచ్చజెప్పింది. తన కన్నీళ్ళను, ఆక్రందనను అదిమి పట్టి బయట పడకుండా జాగ్రత్త పడింది. సాధ్యమైనంత తక్కువ మాట్లాడేందుకే నిశ్చయించుకుంది. తన నివాసం తలుపులు కొట్టిన పోలీసులతో అంతా కాసీమే సంభాషించాడు. ఈ సమయంలో తలుపులు తెరవనని తెగేసి చెప్పాడు. మీరు తెరవకపోతే తలుపులు బద్దలుకొడతామని భయపెట్టారు. మా వద్ద అరెస్టు వారెంటుందన్నారు. వైస్‌ ఛాన్స్‌లర్‌ దగ్గర పర్మిషన్‌ తెచ్చారా అని అడిగితే జవాబు చెప్పలేని పోలీసుల కోపం కపాలానికెక్కింది. వెనుకవైపు సర్వెంటు రూము లోంచి దూరి వచ్చి కిచెన్‌ డోర్‌ పగులగొట్టుకుని పోలీసులు 50‍మంది దాక ప్రవేశించారు. చుట్టూ అరకిలో మీటరు వరకు తమ ఆధీనంలోకి తెచ్చుకొని ఎవరూ లోపలికి వెళ్ళకుండా కాపలా కాసారు.

ఇంట్లోకి చొరబడ్డ పోలీసులు ఏదో దొరకబట్టాలనే ఆత్రుతతో కలియవెతికారు. ప్రొఫెసర్‌ ఇంట్లో పుస్తకాలు, విద్యార్థుల పి.హెచ్‌.డి. సిద్ధాంత గ్రంథాలు, తను పరిశోధన చేస్తున్న వ్యాసంగాలు, రచించిన పుస్తకాలు తప్ప ఇంకేమి ఉంటాయి? అవే దొరికాయి. పుస్తకాలనన్నింటిని లాగేసి ఆఫీసరు ఎదురుగా హాల్లో కుప్ప పోశారు. సాధారణంగా చదువుకున్న వాళ్ళం పుస్తకాలను చాలా భక్తిగా, గౌరవంగా, అపురూపంగా చూసుకుంటాము. కాని కాఠిన్యమైన పోలీసులు మాత్రం కాసీంమీద కోపాన్నంతటిని పుస్తకాల మీద ప్రదర్శించారు. తాను సంపాదకుడిగా వ్యవహరిస్తున్న ‘నడుస్తున్న తెలంగాణ’ సంపుటాలు, సంచికలు ఉన్నాయి. అంబేడ్కరు రచనలు, వ్యాసాలు, సంపుటాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏవీ కూడా చట్టం దృష్టిలో నేరపూరితమైనవి కావు. ఏ సెక్షన్‌ ప్రకారం ఏ పుస్తకం చదివితే నేరం? మార్క్సిజం, లెనినిజం, మావోయిజం గ్రంథాలు అనేక విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వున్నాయి. అనేక సిద్ధాంత గ్రంథాల అధ్యయనం, బోధన, సంఘర్షణ ఒక్క విశ్వవిద్యాలయాల్లో మాత్రమే కొనసాగుతుంది. విద్యాబుద్ధులు, సంస్కారం బోధించే అధ్యాపకులు పోలీసుల చేతిలోపడితే గౌరవప్రదంగా సునిశితంగా వ్యవహరించగలరా?

కుప్పగా పోసిన ఆ పుస్తకాల్లో తమకు కావల్సినవి లేవని గ్రహించారు. తాము తెచ్చినవి కొన్ని అక్కడ వుంచి, ఫొటోలు తీసి అక్కడే దొరికినట్లుగా డ్రామాలు ఆడారు. వాటిని గోనె సంచుల్లో నింపుకొని 11 గంటలకు వెళ్ళిపోయారు. ఈ లోగా కొంత మంది విద్యార్థులు తమ ప్రొఫెసర్‌ను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆందోళనకు దిగితే దాదాపుగా 20 మందిని అరెస్టు చేసి ఉస్మానియా పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు.

కాసీం నాగర్‌ కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కష్టపడి చదువుకొని ఇవాళ ఉస్మానియాలో ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగినాడు. నడుస్తున్న దోపిడి వ్యవస్ధను చూసి కళ్ళు మూసుకోలేదు. పైగా కన్నెర్ర చేసిండు, ప్రశ్నించాడు. చైతన్యవంతుడైనాడు. విద్యార్థి సంఘానికి నాయకుడయ్యాడు. గిట్టని వాళ్ళు హత్యాయత్నం చేశారు. దాడులు చేశారు. వాటితో రాటు దేలాడు. విప్లవీకరింపబడ్డాడు. విప్లవ కవి అయ్యాడు. విప్లవ రచయితల సంఘానికి నాయకుడయ్యాడు. ఇన్ని అయిన కాసీంను రాజ్యం ఎట్ల భరిస్తుంది? ముఖ్యమంత్రి కనుసైగ చేశారు. డిజిపి తలూపారు, ప్రత్యేక పోలీసు బృందం కదిలింది. కాసీం ఖాళీ అయ్యాడు. వృత్తికి లేడు, ఉద్యమాలకు లేడు, ఖైదీ లెక్కల్లో చేరిపోయిండు.

ప్రజా సంఘాలమీద, ప్రజాస్వామిక శక్తులమీద గత ఏడాది అక్టోబరు నుంచి దాడి పరాకాష్ఠకు చేరుకున్నది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న నెపంతో అంతకుముందే ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి భరత్‌ కుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఛత్తీస్‌గఢ్‌ జైల్లో నిర్భంధించారు. అక్టోబర్‌ 4న మహబూబ్‌నగర్‌లో ఒక ధర్నాలో పాల్గొని గద్వాలకు వస్తుండగా తెలంగాణ విద్యార్థి వేదిక గద్వాల జిల్లా కన్వీనర్‌ పులిగ నాగరాజును అరెస్టు చేశారు. అదే సంఘానికి చెందిన వైనమోని బలరాంను అక్టోబర్‌ 7న అరెస్టు చేశారు. ఇదే వరుసలో అక్టోబర్‌ 10న విరసం నాయకడు, స్టూడెంట్‌ మార్చ్‌ సంపాదకుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయ కాంట్రాక్టు అధ్యాపకుడైన కంతి జగన్‌ను అరెస్టు చేశారు. తిరిగి అక్టోబర్‌ 15న తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు బండారు మద్దిలేటి, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను గద్వాల పోలీసులు అరెస్టు చేశారు.

వీరందరి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్లు 18, 18బి, 20ల కింద కేసులు నమోదు చేశారు. అక్టోబర్‌ 20న కొత్తగూడెం జిల్లా చర్లలో ఐతా అనిల్‌ కుమార్‌, దాసారపు సురేష్‌లను అరెస్టు చేశారు. నవంబరు 12న అఖిల భారత హిందూత్వ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదిక కన్వీనర్‌ బి.అనురాధ, సహచరుడు ఎన్‌.రవిశర్మల ఇంటిపై దాడిచేసి నాగోలులో అరెస్టు చేశారు. డిసెంబర్‌ 17న గద్వాల పోలీసులు నాచారంలో టిపిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి మెంచు రమేష్‌ ఇంటిపై దాడిచేసి అరెస్టు చేశారు. నాగారంలో చైతన్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి చుక్కల శిల్ప ఇంటిపై దాడి చేసి గద్వాల పోలీసులే అరెస్టు చేశారు.

అదే సంఘం కార్యవర్గ సభ్యురాలు గుంత రేణుకను, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. డిసెంబర్‌ 18న నాగారంలో చైతన్య మహిళా సంఘం కార్యదర్శులు దేవంద్ర, స్వప్నలను కొత్త గూడెం పోలీసులు అరెస్టు చేశారు. మొదటి నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచన విధానం మీద ఆగ్రహంగానే ఉంది. తెలంగాణలో ఆటా మాటా బందు పెట్టే ఆలోచనతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయంపై 2016 డిసెంబర్‌లో దాడి చేసి ఆఫీసు అక్కడ లేకుండా చేశారు. ప్రభుత్వం మొదటి దఫా రెండేళ్ళ పనితీరుపై స్పందిస్తూ ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అమలుపరచడం చేతకాకపోతే దిగిపోవాలన్నందుకు తలుపులు బద్దలుకొట్టి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను అరెస్టు చేశారు.

తలుపులు బద్దలు కొట్టే సంస్కృతి, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన ఘోరమైన నిర్భంధ రూపం. ఇటువంటి భయభీతావాహ నిర్బంధ పరిస్థితిని కల్పించి ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించే వారు, మాట్లాడేవారు, రాసేవారు, విశ్లేషించేవారు, ప్రజలకు చైతన్యం కలిగించేవారు, పోరాటాల వైపు సంఘటితం చేసే చైతన్య వంతులు ఉండకూడదని ప్రభుత్వం కోరు కుంటున్నది. చరిత్ర పొడవునా ఇటువంటి ప్రయత్నాలు చేసిన ప్రభుత్వాలెన్నో ఉన్నాయి. అయితే ఏ ఒక్క ప్రభుత్వమూ ఇలాంటి ప్రయత్నంలో ఎల్లకాలం విజయవంతం కాలేదని చరిత్ర రికార్డు చేసింది. చరిత్ర నుండి గుణపాఠం నేర్వక పోవడమే పతనానికి నాంది.

(Courtesy Andhrajyothi)