ఇప్పుడు ప్రశ్నలకు బుల్లెట్లే సమాధానం చెపుతున్నాయి. ప్రధాని రక్షణకోసం 600కోట్లు ఖర్చు పెడుతున్న దేశంలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. జాతిపిత గాంధీజీకి నివాళులర్పించటానికి శాంతియుతంగా బయలుదేరిన విద్యార్థులపై పోలీసుల సాక్షిగా పేలిన తూటా.. ఇప్పుడు ‘షాహీన్‌బాగ్‌’కూ సమాధానమవుతోంది. ప్రశ్నించిన నేరానికి ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకున్నా దాహం తీరని తుపాకులు ఇప్పుడు వీధుల్లో వీరంగమాడుతున్నాయి. 50వ రోజుకు చేరిన షాహీన్‌బాగ్‌ ఉద్యమ కేంద్రంపై కాల్పులు జరపాలంటూ ఓ మూక శిబిరంపైకి దండెత్తగా, ‘జామియా మిలియా ఇస్లామియా’ విశ్వవిద్యాలయంపై మరోసారి దుండగులు కాల్పులకు తెగబడినట్టుగా వార్తలు వెలువడుతుండటం ఆందోళన కలిగిస్తున్నవి. ఏం చెబుతున్నాయి ఈ వైపరీత్యాలు? ఏం జరుగుతోంది ఈ దేశంలో? సాక్షాత్తూ ఎంపీలూ ఎమ్మెల్యేలూ మంత్రులూ ముఖ్యమంత్రులే రోజుకొకరు చొప్పున రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే.. జరుగుతున్న ఘటనలన్నీ యాదృచ్ఛికమని ఎలా అనుకోగలం?

”నీ అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు.. కానీ నీ అభిప్రాయం చెప్పే హక్కు కోసం నా ప్రాణమిస్తా” అంటాడు ప్రఖ్యాత ఫ్రెంచ్‌ తత్వవేత్త వోల్టేర్‌. భిన్నాభిప్రాయాలను సైతం సమున్నతంగా గౌరవించే ప్రజాస్వామ్యస్ఫూర్తికి ప్రతిబింబాలు ఈ వాక్కులు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఈ భిన్నాభిప్రాయాల పట్ల మున్నెన్నడూ లేని అసహనం పెల్లుబుకుతోంది. ప్రభుత్వ పెద్దలే ప్రజాస్వామ్య నియమాలకు పాతరేస్తుంటే, రాజ్యాధినేతలే రాజ్యాంఘోల్లంఘనకు పాల్పడుతుంటే ప్రజలేం చేయాలి..? ఏలినవారి పౌరచట్టాలను దేశమంతటా ప్రజాసమూహాలు ప్రశ్నిస్తుంటే.. వారిని తుకడే తుకడే గ్యాంగులంటూ తూలనాడుతారు కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌. ‘గోలీమారో సాలోంకో’ అంటూ రెచ్చగొడతారు మరో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌. ‘మోడీ యోగీలను విమర్శిస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం’ అని విద్యార్థులను బెదిరిస్తారు యూపీ మంత్రి రఘురాజ్‌ సింగ్‌. ‘సీఏఏను వ్యతిరేకించేవారంతా తమ తల్లిదండ్రులెవరో తెలియని పరాన్నజీవులు. వారిని నడిరోడ్డుపై కాల్చిపారేయాలి’ అని బహిరంగంగా ప్రకటిస్తాడు బీజేపీ బెంగాల్‌ చీఫ్‌ దిలీప్‌ఘోష్‌. ‘నిరసనలను రాజకీయపార్టీలకు వదిలేయండి.. మీరు తక్షణమే తరగతిగదులకు వెళ్లండి’ అని హెచ్చరిస్తాడు రాందేవ్‌బాబా. ప్రజాస్వామ్యంలో ”ప్రశ్న” ఓ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అన్న సంగతి కూడా విస్మరించి వ్యవహరిస్తున్న ఈ నేతలనేమనాలి?

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తాజా వ్యాఖ్యలు వీరి అప్రజాస్వామిక చర్యల్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. ఆందోళనకారులకు ఆప్‌ బిర్యానీలు సమకూరుస్తుంటే తాము బుల్లెట్లు దించుతున్నామని బహిరంగంగానే అంగీకరిస్తున్నారాయన. దీనినిబట్టే అర్థం చేసుకోవచ్చు దేశంలో ఏం జరుగుతుందో. నేతల వ్యాఖ్యలే కాదు, నేరాలకు పాల్పడుతున్నవారి నేపథ్యాలు చూసినా అర్థమవుతోంది జరుగుతున్న ఘటనలు యాదృచ్ఛికమో కాదో. ఇదంతా ఒకెత్తయితే మోడీ షాలది మరో ఎత్తు. సీఏఏను, తమ ప్రతిపాదిత పౌరచట్టాలను వ్యతిరేకించేవారంతా దేశద్రోహులూ లేదా పాకిస్థానీయులేనంటారు. తాము తలచుకుంటే పదినిమిషాల్లో పాకిస్థాన్‌ ఆట కట్టిస్తామంటారు. కానీ వారు తలచుకోరు సరికదా.. దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలున్నా వారికి పాకిస్థానే రక్షణమంత్రం కావడం విచిత్రం! ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలను గట్టెక్కడానికి కూడా అదే మంత్రం జపిస్తున్నారు. నిజానికిక్కడ వీరి విద్వేషపూరిత పౌరచట్టాలను వ్యతిరేకిస్తున్నది పాకిస్థానీయులు కాదు.. భారతీయులు. కేవలం ఏదో ఒక మతానికి చెందినవారు మాత్రమే కాదు.. కులమతాలకతీతంగా సమస్త ప్రజానీకం.

ఈ సహజమైన ప్రజాందోళనలను అర్థం చేసుకోవడం, గౌరవించడం మాట అటుంచి కనీసం అనుమతించడానికి కూడా వీరు సిద్ధంగా లేకపోవడం దేనికి సూచిక ప్రతిపక్షాలైనా, పౌరసమాజమైనా తమను అనుసరించాల్సిందే తప్ప ఆక్షేపించడానికి వీలులేదన్నట్టుగా వ్యవహరిస్తుంటే ఇక ప్రజాస్వామ్యానికి మనుగడేముంటుంది? ”ప్రతిపక్షమే ప్రజాస్వామ్యానికి రక్షణ దుర్గం” అని చెప్పిన మన సర్వోన్నత న్యాయస్థానానికి విలువేముంటుంది? పౌరహక్కులన్నీ దిక్కులేనివైనప్పుడు రాజ్యాంగానికి అర్థమేముంటుంది? మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదైనా, రాజ్యాంగం ఎంతటి ఉన్నతాశయాలతో రూపొందించుకున్నా… పాలకులకు వాటి అమలులో నిజాయితీ, ఆచరణలో నిబద్ధతా లేనప్పుడు అవి వృథాయే అవుతాయనడానికి మన ఏలికల తీరుతెన్నులే నిదర్శనాలు. ‘మా పక్షాన లేని వారందరూ మా శత్రువులే’ అన్న తాత్వికవైఖరి కలిగినవారు వాటిని గౌరవిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. అయినా పొరుగు దేశాల్లోని పొరపాట్లకు, సరిహద్దుల్లోని చొరబాట్లకు దేశమంతా చిచ్చుపెడతామంటే ఎలా? ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగులబెట్టుకుంటారా ఎవరైనా? మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నందుకు శతాబ్దాల అభివృద్ధిని కోల్పోయిన పొరుగు దేశాల అనుభవాలు తెలిసికూడా.. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజల జాతీయతను ప్రశ్నార్థకం చేస్తారా? కులమతాలకతీతమైన పూలవనాన్ని మరుభూమిగా మారుస్తారా? ప్రశ్నిస్తోంది ప్రజ. ఎందుకంటే.. ప్రజల నరాల సత్తువ ఈ దేశం. తరాల నెత్తురు ఈ దేశం.

Courtesy Nava Telangana