సర్వే చేసిన టీఎస్‌ఎండీసీ, అటవీశాఖ
భారీగా క్వార్ట్జ్‌ ఖనిజం ఉన్నట్లు గుర్తింపు
నమూనాలను సేకరించిన టీఎస్‌ఎండీసీ
195
హెక్టార్లలో తవ్వకాలకు ప్రణాళిక
అనుమతుల కోసం ప్రభుత్వానికి లేఖ

జీవ వైవిధ్యానికి.. దట్టమైన అడవులకు నిలయం నల్లమల. ఓవైపు యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ, తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతుండగానే.. నల్లమల అడవుల్లో క్వార్ట్జ్‌ ఖనిజాన్ని వెలికి తీసేందుకూ రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) అటవీశాఖతో కలిసి ఇటీవల సర్వే చేసి.. భారీస్థాయిలో క్వార్ట్జ్‌తో పాటు ఫెల్డ్‌స్పార్‌ ఖనిజ నిక్షేపాలున్నాయని గుర్తించినట్లు సమాచారం. మార్కెట్లో వాటికి మంచి గిరాకీ ఉంది. దీంతో వీటి తవ్వకాలపై దృష్టిపెట్టిన టీఎస్‌ఎండీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. తవ్వకాల కోసం నల్లమలలో తీసుకునే అటవీ ప్రాంతానికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని కేటాయించాలని కోరింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గుండ్య, ఇబ్రహీంబాద్‌, రామనూతల్‌, చెరుకూరు, పాదకల్‌, సంతెపూర్‌, ముదివేను అటవీప్రాంతాల్లో దాదాపు 2,500 ఎకరాల్లో క్వార్ట్జ్‌, ఫెల్డ్‌స్పార్‌ ఖనిజాలు ఉన్నట్లు టీఎస్‌ఎండీసీ గుర్తించింది. తవ్వకాలకు 14 ఏళ్ల క్రితమే దరఖాస్తు చేసినప్పటికీ ముందుకు వెళ్లలేదు. తాజాగా ఆ ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. అటవీశాఖతో కలిసి జూన్‌, జులై నెలల్లో నల్లమల అడవుల్లో డీజీపీఎస్‌ సర్వే చేసింది. ఏడు ప్రాంతాల్లో 195 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఖనిజాలు పెద్దమొత్తంలో ఉన్నాయని.. ఇక్కడ తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది.

భూమి ఉపరితలంపైనే కాకుండా లోపల పెద్దమొత్తంలో క్వార్ట్జ్‌, ఫెల్డ్‌స్పార్‌ ఖనిజాలు ఉంటాయి. కోడిగుడ్డులో తెల్లసొన, పచ్చసొన మాదిరి క్వార్ట్జ్‌, ఫెల్డ్‌స్పార్‌ కలిసి ఉంటాయి. గాజు, సిరామిక్‌ పరిశ్రమల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు.
తవ్వకాలు ఎప్పుడు?… సర్వేలో భాగంగా అధికారులు ఈ ఖనిజాల నమూనాలు సేకరించారు. మేలి రకం, భారీ పరిమాణంలో వాటి నిల్వలు ఉన్నట్లు తేలడంతో తవ్వకాలకు సన్నద్ధమవుతున్నారు. అటవీ భూముల్ని బదలాయించేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉంది.

దీంతోపాటు కోల్పోయే అటవీప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ భూములను కేటాయించి, పరిహారం చెల్లించాల్సి ఉంది. అయితే 2015లోనే దరఖాస్తు చేసిన నేపథ్యంలో అటవీ అనుమతులు త్వరగానే వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

నల్లమలపై ప్రభావం! 
ఈ ఖనిజాల తవ్వకాలు చేపడితే నల్లమల అటవీప్రాంతంపైనా, అక్కడి పర్యావరణంపైనా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దట్టమైన అటవీప్రాంతంతో పాటు వన్యప్రాణులకు నిలయం నల్లమల. యురేనియం అన్వేషణపై స్థానికులు, పర్యవరణవేత్తలు, రాజకీయ నేతలు ఇప్పటికే అభ్యంతరం చెబుతున్నారు. ఇప్పుడు క్వార్ట్జ్‌ వెలికితీతకు కూడా ప్రయత్నాలు జరుగుతుండటం వారికి ఆందోళన కలిగిస్తోంది.

అవి దట్టమైన అడవులు కావు 
క్వార్ట్జ్‌ కోసం ఎంపిక చేసిన ప్రాంతాలు దట్టమైన అడవులు కావని.. క్షీణించిన అటవీప్రాంతాలని.. టైగర్‌ రిజర్వుకు వెలుపలే ఉన్నాయని టీఎస్‌ఎండీసీ వర్గాలు చెబుతున్నాయి.

 

(Courtacy Eenadu)