దేశంలో నేటి దారుణ పరిస్థితులకు ప్రధాన కారణం బాబ్రీ మసీదు విధ్వంసం, ఆనాటి మూలవిరాట్‌ పీవీనే… బీజేపీ ప్రాబల్యం పెరగడంలో అదో కీలక మలుపు. దేశం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా దెబ్బతినడంలో పీవీ పాత్ర చిన్నదేమీ కాదు. బీజేపీ సరే, కేసీఆర్‌ కూడా ఫలితాన్ని, పర్యవసానాన్ని అర్థం చేసుకునే పీవీని కౌగిలించు కుంటున్నారా? జరభద్రం సారో!

సర్వజ్ఞ సింగ భూపాలుడిని ధిక్కరించిన పోతనా కవే! అదే రాజు కొలువులో కవితా చాకిరీ చేసిన శ్రీనాథుడూ కవే! రాజుని రాచరికాన్ని వ్యతిరేకించిన కవులు ఆరోజుల్లో కొందరైనా ఉండేవారు. ఆ కొందరూ ప్రజాకవులు కాకున్నా నమ్మిన దైవం కోసం రాచరికాన్ని ధిక్కరించిన, ధిక్కరించి నిలిచిన కవులు. ఇదెలావున్నా, మన పీవీ నర్సింహారావు కూడా కవే! ఆయన ప్రత్యేకతేమంటే రాజకీయాల్నే వృత్తిగా మలుచుకున్నా ప్రవృత్తిని మరువలేదు. రాజకీయ పరమపదసోపాన పటంలో చివరినిచ్చెన మెట్లెక్కిన తర్వాత కూడా నిత్యకవితా హాలికుడిగానే ఉన్నారు. ఆయన ”వేయి పడగలు” హిందీ అనువాదానికి కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇది అంతా పీవీ జీవితంలో ఒక కవితా పార్శ్వమే. ఇతర పార్శ్వాల సంగతేమిటి? ఏ విశ్వనాథ సత్యనారాయణ గురించోనైతే ఆ కవిత్వం మంచిచెడ్డల గురించి ప్రజలో, కనీసం సాహిత్యకారులో చర్చించుకు నుండేవారు.

కానీ పీవీ గురించి, ముఖ్యంగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో అందునా పాలకపార్టీ రాజకీయాల్లో ‘మున గానాం, తేలానం’ చేసిన మనిషి యొక్క వ్యక్తిత్వం అంచనా వేయడానికి వారవలంబించిన విధానాలు ప్రజల్ని కడగండ్లపాలు చేసినాయా? ఆనంద డోలికల్లో ఊపినాయా? అన్నదే గీటురాయి. ఒక విషయంలో పి.వి. భజన చేస్తున్న వారందర్నీ అభినందించాల్సిందే. వెంకయ్యనాయుడు, కేసీఆర్‌ మొదలు అనేక మంది బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల దాకా మనదేశంలో ఆర్థిక సంస్కరణల ఆద్యుడనే మాట నిజాయితీగానే చెప్పారు. వీరంతా చెప్పినవి కొన్నే ఉన్నాయి. దాచినవి బోలెడన్ని ఉన్నాయి.

పీవీ బతికున్నప్పుడు కాంగ్రెస్‌లో సర్వోన్నతుడూ కాదు, కనీసం చనిపోయిన తర్వాతనైన సగౌరవంగా సాగనంపబడ్డ నేతాకాదు. పార్టీలో మద్దతు లేకున్నా అర్జున్‌సింగ్‌, ఎన్‌డి తివారీలు కత్తులు దూస్తున్నా ప్రభుత్వానికి సరిపడా మెజారిటీ లేకున్నా ఐదేండ్ల పాలన నెట్టుకొచ్చినందుకే ‘చాణుక్యుడ’నే బిరుదొచ్చింది. ఈ శతాబ్ది ఉత్సవాల పటాటోపం వెనకేముందనేది రాష్ట్ర మీడియానే గాక జాతీయ మీడియాలోనూ చర్చ జరిగింది. కేసీఆర్‌ గురిపెట్టింది కాంగ్రెస్‌కు కాదని బీజేపీకని కొందరు, ఒకే దెబ్బకి కాంగ్రెస్‌, బీజేపీలు రెంటికీ గురిపెట్టాడని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరి వ్యాఖ్యానాలు ఎలా ఉన్నా ఒకటి మాత్రం నిజం. ఏ గూటిపక్షులు ఆగూటికే చేరుతున్నాయి.

”సంస్కరణల” ప్రతిపాదకుడు పీవీ అయినా వాటి ఉధృతికి కారకులు మాత్రం ఇక్కడ టీఆర్‌ఎస్‌, అక్కడ బీజేపీ. అందుకే ఈ ఆనందోత్సవాలు. ఆలింగనాలు. ఎవరి పార్టీలో వారు తమ గతించిన నాయకుల గురించి గొప్పగా చెప్పుకోవడం కద్దు. పైగా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమీ నెంబర్‌ వన్‌గా పరిగణించే కాంగ్రెస్‌ పార్టీ నాయకుడికి తమ నాయకుడే అన్నట్టు కేసీఆర్‌ వీర నివాళులు ఎందుకు అర్పిస్తున్నట్టు? పైగా పీవీ సమైక్య వాది. తొలిదశ తెలంగాణ ఉద్యమ కారులంతా ”దేశానికి రాజైనా తల్లికి (తెలంగాణకు) కొడుకు కాలేకపోయాడ”ని విమర్శించిన వ్యక్తిపై ఇంత ప్రేమ ఒలికించడం వెనక రాజకీయమేంటనేది నేటి ‘హాట్‌ టాపిక్‌’! లాభం లేనిదే వ్యాపారి ఏటికి ఎదురు పోడన్నట్టు తాత్కాలికమో, దీర్ఘకాలికమో ఏదో ఒక ఎత్తుగడ కేసీఆర్‌కు ఉండి ఉండవచ్చు.

ఇటీవల ఈ శతాబ్ది ఉత్సవాల కోసం ఒక తెలుగు పత్రికకు మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మన దేశంలో అవలంబించిన ఆర్థిక సంస్కరణలు అకస్మాత్తుగా రాలేదనీ, ఆ ఆవశ్యకతను ముందు ఇందిరాగాంధీ గుర్తించినట్టూ, పీవీ దాన్ని ముందుకు తీసుకుపోయారని చెప్పాడు. ఆర్థిక సంస్కరణలకు తనకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చారని మన్మోహన్‌సింగ్‌ చెప్పుకున్నారు. మన్మోహన్‌ ఐఎంఎఫ్‌ నుంచి దిగుమతైన ఆర్థిక వేత్త. అమలు చేసిన సంస్కరణలన్నీ ఐఎంఎఫ్‌ గీసిన గీతలకనుగుణంగా నడిచినవే. ఇటువంటి సంస్కరణలు అమలైన దేశాలన్నింటిలో ఏమి జరిగిందో మనదేశంలోనూ అదే జరిగింది. అదే జరుగుతుతోంది.

ఏమైనా, ఆర్థిక సంస్కరణలు ఆయన ప్రధాన మంత్రిత్వంలో మొగ్గతొడిగాయనేది నిజం. ప్రభుత్వరంగ డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభమైంది ఆయన శకంలోనే. నర్సింహం కమిటీ, మల్హోత్ర కమిటీ, సౌందర్రాజన్‌ కమిటీ మొదలైన కమిటీల ద్వారా వివిధ రంగాల ప్రయివేటీకరణకు అంకురార్పణ జరిగింది పీవీ కాలంలోనే. వీటినే బీజేపీ, టీఆర్‌ఎస్‌లు తమవిగా చేసుకుంటూ జబ్బలు చరుచుకుంటున్నాయి. పీవీకీర్తిగానం చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లు, పక్క వాయిద్య గాళ్ళుగా మిగిలిన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఏ సంస్కరణల గురించి చేస్తున్నారు ఈ భజన? గత 45ఏండ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగాన్ని పెంచిన సంస్కరణలగురించా? ప్రజల కొనుగోలు శక్తి అడుగంటేలా చేసి పారిశ్రామిక మాంద్యం దాపుకి దేశాన్ని చేర్చుతున్న సంస్కరణలగురించా? రైతుల ఆత్మహత్యలకు కారణమైన ఆర్థిక సంస్కరణలగురించా? దేని గురించి వీరి రాగం, తానం, పల్లవి?

దేశంలో నేటి దారుణ పరిస్థితులకు ప్రధాన కారణం బాబ్రీ మసీదు విధ్వంసం, ఆనాటి మూలవిరాట్‌ పీవీనే… బీజేపీ ప్రాబల్యం పెరగడంలో అదో కీలక మలుపు. దేశం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా దెబ్బతినడంలో పీవీ పాత్ర చిన్నదేమీ కాదు. బీజేపీ సరే, కేసీఆర్‌ కూడా ఫలితాన్ని, పర్యవసానాన్ని అర్థం చేసుకునే పీవీని కౌగిలించుకుంటున్నారా? జరభద్రం సారో!

Courtesy Nava Telangana