వెబ్‌సైట్లో కారణాలు వివరించాలి
నేరాల చిట్టా బయటపెట్టాల్సిందే
పార్టీలకు సుప్రీంకోర్టు ఆదేశం 
72 గంటల్లోగా వివరాలు ఈసీకివ్వాలి
లేదంటే కోర్టు ధిక్కారం కింద చర్య
గెలిచే సత్తా కాదు.. యోగ్యత ముఖ్యం
తీర్పులో ధర్మాసనం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: నేర రాజకీయాల అదుపు దిశగా సుప్రీంకోర్టు మరోసారి కొరడా ఝళిపించింది. అసలు నేర చరితులకు ఎందుకు టికెట్లిస్తున్నారో వెల్లడించాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఏ కారణాలతో వారిని ఎంపిక చేశారన్నది పార్టీల అధికారిక వెబ్‌సైట్లలో పెట్టాలని స్పష్టం చేసింది. ‘‘అభ్యర్థుల నేర చరిత్ర మొత్తం పార్టీలు తమ తమ వెబ్‌సైట్లలో వెంటనే అప్‌లోడ్‌ చేయాలి. ఏ నేరం చేశారు, ఏ అభియోగాలు ఎదుర్కొంటున్నారు, దర్యాప్తు సాగుతోందా, కేసు విచారణ ఏ దశలో ఉంది? వంటి సమగ్ర వివరాలను వెల్లడించాలి’’ అని తేల్చి చెప్పింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వారి నేరచరిత్రను(ఉంటే..) వారే వెల్లడించాలని 2018 సెప్టెంబరులో ఐదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు తమ నేరాల చిట్టాను రాజకీయ పార్టీలకు తెలియపర్చాలని, పార్టీలు ఆ వివరాలను వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయాలని, ఈసీ ఫారాల్లోనూ వాటిని నింపాలని ధర్మాసనం అప్పుడే సూచించింది. అయితే ఆ తీర్పు అమలు సరిగా జరగడం లేదని, పార్టీలేవీ పట్టించుకోలేదని, ఈసీ కూడా 1968 నాటి ఎన్నికల చిహ్నాల ఉత్తర్వులను, ప్రవర్తన నియమావళిని సవరించలేదని అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ అనే బీజేపీ నేత ఆరోపించారు. పార్టీలతో పాటు ఈసీపైనా కో ర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న తర్వాత జనవరి 31న కో ర్టు తన తీర్పును వాయిదా వేసి గురువారం వెలువరించింది.

24 గంటల్లోగా వెబ్‌సైట్లో ఉండాలి..!
అభ్యర్థులను ఎంపిక చేసిన 24 గంటల్లోగా లేదా నామినేషన్‌ వేసిన 2 వారాల్లోగా.. (ఈ రెండింటిలో ఏది ముందైతే అది) వివరాలు వెబ్‌సైట్లో ఉండాలి. హోం పేజీలోనే ఉంచాలి. బుక్‌మన్‌ ఓల్డ్‌ స్టైల్‌ అనే ఫాంట్‌లో పెట్టాలి. ఫాంట్‌ సైజు 15, లైన్‌ స్పేసింగ్‌ 1.5గా ఉండాలి’’ అని సుప్రీం స్పష్టం చేసింది. ‘‘పార్టీల సోషల్‌ మీడియా అకౌంట్లలోనూ పెట్టాలి. అంతేకాదు సమాచార, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలపాలి’’ అని పేర్కొంది. ఎవరికీ తెలియని, ఊరూ పేరూ లేని పత్రికలు, ఎక్కడా కనిపించని చానెళ్లలో పార్టీలు ఈ వివరాలు ఇలా పెట్టి, అలా తీసేస్తున్నాయన్న పిటిషనర్‌ వాదనను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ‘‘ప్రతి అభ్యర్థీ పేరొందిన చానెల్‌లో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో అంటే ప్రైమ్‌ టైమ్‌లో మూడుసార్లు తన నేరచరిత్ర గురించి ప్రకటనలు ఇవ్వాలి. భారీ సర్క్యులేషన్‌ ఉన్న దినపత్రికల్లో తాను నామినేషన్‌ వేసిన వారంలోగా నేరచరితను ప్రకటించాలి. లేటెస్ట్‌ టీఆర్‌పీ, సర్క్యులేషన్‌ వివరాల ఆధారంగా రాష్ట్ర సీఈవోనే స్వ యంగా చానెళ్లు, వార్తా పత్రికల జాబితాను రూపొందించి ఇస్తారు. వీటిలో ఒక స్థానిక, ఒక జాతీయ దినపత్రిక ఉండాలి. వాటిలో మాత్రమే అభ్యర్థులు ప్రకటనలు ఇవ్వాలి’’ అని జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారిమన్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. పార్టీలు ఈ ఆదేశాలను అంగీకరిస్తూ, నివేదికలను 72 గంటల్లోగా ఈసీకి అందజేయాలని స్పష్టం చేసింది.

Courtesy Andhrajyothi