ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
తర్వాత చర్చి, మసీదు కట్టేందుకు అవకాశం
మతపరమైన కట్టడాల పేరుతో భూఆక్రమణలు
అడ్డుకోవడంలో సర్కారు చర్యలు నామమాత్రం

హైదరాబాద్‌: ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, కుంటలు మతపర కట్టడాల పేరుతో ఆక్రమణలకు గురౌతుంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామమాత్రం గా ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి కట్టడాల్ని అడ్డుకునేందుకు 2010, మార్చి 31న సర్కార్‌ ఇచ్చిన జీవో నెంబర్‌ 262లోనే 6,707 అక్రమ కట్టడాలు ఉన్నాయని, అందులో మతపరమైన మందిరాలు 2,224 ఉన్నాయని చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. జీవో ఇచ్చి పదేండ్లయినా నేటికీ చర్యల్లేవనీ, ఈ కాలంలో అవి ఇంకెంతగా పుట్టుగొడగుల్లా పెరిగి ఉంటాయోననీ ఆందోళన వ్యక్తం చేసింది. పార్కు జాగాలో గుడి కట్టేస్తుంటే చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. ఇప్పుడు గుడి కడతారు. రేపు చర్చి, మసీదు మొదలైనవి కూడా కట్టేస్తారు. చూస్తూ ఉండగానే ప్రభుత్వ జాగాలన్నీ కనబడకుండాపోతాయని హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని మాధవపురి హిల్స్‌లో ఉన్న రాక్‌ గార్డెన్స్‌లో 9,888 చదరపు గజాల్లో గుడి కట్టడాన్ని అడ్డుకోవాలని హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ట్రస్ట్‌ రెండేండ్ల క్రితం పిల్‌ వేసింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, న్యాయ మూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ బుధవారం జరిపిన విచారణకు మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలు అరవింద్‌కుమార్‌, సందీప్‌కుమార్‌ సుల్తానియా, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనమంత్‌రావ్‌ ఇతర అధికారులు హైకోర్టుకు స్వయంగా హాజరయ్యారు. ప్రభుత్వం వచ్చే నెల 13 నాటికి కౌంటర్‌ వేయాలని ఆదేశించింది. అమీన్‌పూర్‌ గుడి అక్కడి పరిస్థితులు, ఇతర వివరాలతో రిపోర్టు ఇవ్వాలని ప్రవీణ్‌రెడ్డి అనే లాయర్‌ను అడ్వకేట్‌ కమిషన్‌గా నియమించింది. విచారణను వచ్చేనెల 16కి వాయిదా వేసింది. అడ్వకేట్‌ కమిషన్‌ అమీన్‌పూర్‌లోని గుడి కట్టడాన్ని పరిశీలించాలి. దాని ప్లాన్‌, మ్యాప్‌, డాక్యుమెంట్లను పరిశీలించి రిపోర్టు తయారు చేయాలి. ప్రవీణ్‌రెడ్డికి కోర్టు ఖర్చుల కింద టెంపుల్‌ కమిటీ రూ.50 వేలు ఇవ్వాలి. కమిషన్‌కు పోలీసులు రక్షణ ఉండేలా డిజిపి చర్యలు తీసుకోవాలి.. అని డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను మార్చి 16కి వాయిదా వేసింది.

చెరువులు, పార్కులు, కుంటలు, సర్కారీ జాగాలను ఆక్రమించి మత మందిరాలు కడుతున్నారని ఏకంగా 40 పిల్స్‌ తమ ముందున్నాయని, ఇలాంటి అక్రమ మత మందిరాల విషయంలో చర్యలు తీసుకోకపోతే చట్టానికి అర్ధమే లేదని వ్యాఖ్యానించింది. అరకొర సమాచారంతో ప్రభుత్వం కౌంటర్‌ వేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.. దీంతో ప్రభుత్వ లాయర్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పి కౌంటర్‌ను వెనక్కి తీసుకుంటామని, మళ్లీ కౌంటర్‌ పిటిషన్‌ వేస్తామని కోరగా అందుకు డివిజన్‌ బెంచ్‌ సమ్మతించింది. మార్చి 13లోగా సీఎస్‌ పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ఆదేశించింది. మత విశ్వాసాలు, మత స్వేచ్ఛ, మనోభావాలు మొదలైన వాటి పేరుతో సర్కారీ జాగాల్లోనో, పార్కుల్లోనో మత మందిరాలను నిర్మాణం చేస్తుంటే సర్కార్‌ చూస్తూ ఉంటే ఎలాగని, ఆస్తులను కాపాడాల్సినది ప్రభుత్వమేనని, చట్టాన్ని అమలు చేయాల్సింది కూడా సర్కారేనని, వీటి విషయంలో ప్రభుత్వమే ఏమీ చేయకుండా ఉంటే ఎలాగని హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణాలు జరిగిన ప్రదేశాల్ని చూసి తగిన చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తామంటూ కౌంటర్‌లో ఎలా చెబుతారని, చర్యలు తీసుకుని తీరాలని, చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తామనడం సరికాదని చెప్పింది. ఏదో ఒకటి చేస్తామనేలా తప్పించుకు తిరిగే విధానం తగదని తెలిపింది. కచ్చితమైన విధాన నిర్ణయాలు తీసుకుని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ రిపోర్టు ఆధారంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక ఇస్తే వాటిని హైకోర్టుకు ఇవ్వకుండా సర్కార్‌ చాలా అస్పష్టమైన కౌంటర్‌ పిటిషన్‌ వేసిందని తప్పుపట్టింది. 2010లో ఆలయాన్ని కడితే 2014, 2020లో సర్కార్‌ నోటీసులతో సరిపెట్టుకుందని, ఈ నోటీసుల్ని ఆలయ కమిటీ సంగారెడ్డి కోర్టులో సవాల్‌ చేస్తే ఆ కోర్టులో ఉన్న కేసు నేపథ్యం గురించి కూడా కౌంటర్‌లో చెప్పలేదని తప్పుపట్టింది. కేసులోని వాళ్లను ప్రాసిక్యూట్‌ చేయబోమని పోలీసులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది జీవో నెంబర్‌ 262 జారీ చేసి సుమారు పదేండ్లు అయిందని, ఆ వివరాలు ఇవ్వలేకపోయినా గత అయిదేండ్ల వివరాలైనా ఇవ్వండని ఆదేశించింది. చెరువులు, పార్కులు, సర్కారీ జాగాలు ఆక్రమణలకు గురికాకుండా చేయాల్సిన సర్కార్‌ మత మందిరాల్ని కట్టేస్తుంటే చర్యలు తీసుకోకుండా చూస్తూ ఉంటే ఒత్తిళ్లకు లొంగిపోయినట్లుగా భావించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. జీవో నెంబర్‌ 262లో మూడు కేటగిరీలను పేర్కొన్నారని, మూడో కేటగిరీలో బాగా పాత మత కట్టడాల విషయంలో ఆయా ప్రాంత ప్రజలతో సమగ్ర చర్యలు జరిపి ఏకాభిప్రాయం వచ్చాక వాటిని తొలగించే ప్రయత్నం చేస్తామని ఉందని బెంచ్‌ గుర్తు చేసింది. నిజమే పాతవైనా కొత్తవైనా, ఆ రెంటింటి మధ్యస్త కాలానికి చెందినవైనా ఎక్కడైనా భక్తుడికి ఒకే విధమైన సెంటిమెంట్‌ ఉంటుందని, వాళ్ల మనోభావాలని చెప్పి చర్యలు తీసుకోకుండా చట్ట వ్యతిరేకంగా ఉన్న వాటిని తొలగించే చర్యలు తీసుకోకపోతే ఎట్లాగని ప్రశ్నించింది. అమీన్‌పూర్‌లోని పార్కులో కట్టిన ఆలయం విషయంలో చర్యలు ప్రారంభించిన రాష్ట్రానికి స్పష్టమైన సంకేతం ఇవ్వాలని, గ్రామాల విషయాన్ని పక్కనబెట్టి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లోని అక్రమ మతపరమైన కట్టడాల విషయంపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ఆ తర్వాత రాష్ట్రంలోని అంశాల్లోకి వెళ్లవచ్చునని హైకోర్టు హితవు చెప్పింది. రాజస్థాన్‌లో అన్ని మతాలకు చెందిన అక్రమ కట్టడాలపై కచ్చితమైన విధాన నిర్ణయాన్ని అమలు చేసినట్లుగానే మన రాష్ట్రంలోనూ అమలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని సలహా ఇచ్చింది. చర్చల ద్వారా స్థానికులను ఒప్పంచి చేద్దామంటే భక్తి పేరుతో ఎవ్వరూ ఒప్పుకోకపోవచ్చునని, అప్పుడు చట్టాన్ని అమలు చేయకుండా చేతులు కట్టుకుని కూర్చుంటారా అని డివిజన్‌ బెంచ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీవో నెంబర్‌ 262లో 1) కొత్తగా కట్టినవి, 2) కట్టి కొంతకాలం అయినవి, 3) బాగా పాత మత మందిరాలు అనే మూడు కేటగిరీలుగా చేశారని, వేటి విషయంలోనైనా భక్తుడి మనోభావాలు ఒకేలా ఉంటాయని బెంచ్‌ పేర్కొంది. ఆలయాన్ని కట్టడంతో భక్తుల ధనసాయం ఉందని, ఇది చాలా సున్నిత వ్యవహారమని, ఇందులో తమ వాదనలు కూడా వినాలని భక్తుల తరఫు లాయర్‌ కోరగా అందుకు హైకోర్టు అంగీకరించలేదు. దేవుడు కూడా వివాద స్థలంలో తనకు గుడి లేదా మసీదు లేదా చర్చి కట్టాలని కోరుకోడని వ్యాఖ్యానించింది. ఆలయ కమిటీ లాయర్‌ రతన్‌సింగ్‌ వాదిస్తుంటే హైకోర్టు కల్పించుకుని మూడు వాయిదాలు పడిన తర్వాత కూడా ఆలయ మ్యాప్‌, పర్మిషన్‌లు వంటి వివరాలతో టెంపుల్‌ కమిటీ కౌంటర్‌ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. ఇలాంటి విషయాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్ని పరిశీలిస్తే అక్రమ మత మందిరాలన్నింటినీ కూల్చేయాల్సి వస్తుందని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం మార్చి 13లోగా కౌంటర్‌ వేయాలని, అదే తేదీ నాటికి లాయర్‌ కమిషన్‌ కూడా రిపోర్టు ఇవ్వాలని బెంచ్‌ ఆదేశించింది. విచారణను మార్చి 16కి వాయిదా వేసింది.

Courtesy Nava telangana