• హాజీపూర్‌ వరుస హత్యాచారాల కేసుల్లో తీర్పు
  • 90 రోజుల్లోనే తేల్చేసిన పోక్సో కోర్టు
  • 2 కేసుల్లో మరణశిక్ష.. ఓ కేసులో జీవితఖైదు
  • జడ్జి సిద్ధ వేదవిద్యనాథారెడ్డి ఆదేశం
  • శ్రీనివా్‌సరెడ్డిలో కనిపించని పశ్చాత్తాపం
  • అప్పీలుకు సిద్ధం.. న్యాయ సాయానికి జడ్జి హామీ
  • చంచల్‌గూడ జైలుకు శ్రీనివాస్‌ రెడ్డి తరలింపు

నల్లగొండ: విద్యార్థినులను పాశవికంగా హత్యాచారం చేసి ఏళ్లతరబడి తప్పించుకు తిరిగిన సైకో కిల్లర్‌ శ్రీనివా్‌సరెడ్డికి పోక్సో న్యాయస్థానం మరణశిక్ష విధించింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన శ్రీనివా్‌సరెడ్డి.. విద్యార్థినులను నమ్మించి తన వాహనంపై ఎక్కించుకొని, అత్యాచారం, హత్య చేసి తన పాడుబడిన బావిలో పాతిపెట్టాడు. నేరాలు రుజువు కావడంతో శ్రీనివా్‌సరెడ్డికి చనిపోయే వరకు ఉరిశిక్ష విధించాలని పోక్సో కోర్టు జడ్జి గురువారం తీర్పు చెప్పారు. కోర్టు 54 పని దినాల్లో (90 రోజుల్లో)నే కేసు విచారణను పూర్తి చేసి తీర్పు వెలువరించడం విశేషం. ఈ కేసులో రాచకొండ పోలీసులు, న్యాయస్థానం స్పందించిన తీరుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హాజీపూర్‌లో 2019 ఏప్రిల్‌లో వెలుగులోకి వచ్చిన ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారం, హత్య, కిడ్నాప్‌ కేసులకు సంబంధించి నల్లగొండ మొదటి అదనపు జిల్లా జడ్జి (పోక్సో) కోర్టు 101 మంది సాక్షులను విచారించింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. మర్రి శ్రీనివా్‌సరెడ్డి హంతకుడని నిర్ధారించింది. రెండు కేసుల్లో చనిపోయేంత వరకు ఉరిశిక్ష, మరో కేసులో జీవిత ఖైదును విధిస్తూ జడ్జి సిద్ధ వేదవిద్యనాథారెడ్డి తీర్పు వెలువరించారు. విధించిన జరిమానా మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందజేయాలని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కూడా ఆర్థిక సహాయం చేయాలని తీర్పులో వెల్లడించారు. ఈ కేసుల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా చంద్రశేఖర్‌, శ్రీనివా్‌సరెడ్డి తరఫున ఎస్‌.ఆర్‌.ఠాగూర్‌ వాదించారు. కాగా.. తీర్పు వెలువరించే ముందు జడ్జి.. ‘పోలీసులు నీపై నేరాలను నిరూపించారు. నీవేమైనా చెప్పుకునేది ఉం దా?’ అని ప్రశ్నించగా.. ‘నాకేం తెలియదు. పోలీసులు భయపెట్టి నేరాలను ఒప్పించారు. గ్రామస్థులు మా భూమిని లాక్కున్నారు. మా ఇంటిని ధ్వంసం చేశారు’ అని శ్రీనివా్‌సరెడ్డి చెప్పాడు. ‘నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు’ అని జడ్జి ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పాడు. వారు బతికే ఉన్నారా? అని అడిగితే.. ‘నాకు తెలియదు’ అని సమాధానం ఇచ్చాడు.

క్షణక్షణం ఉత్కంఠ:
శ్రీనివా్‌సరెడ్డి కేసులో తుది తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు నిర్భయ దోషులకు ఉరిశిక్ష పదేపదే వాయిదా పడుతుండగా, మరోవైపు దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌, సమత కేసులో స్వల్ప కాలంలోనే ఉరిశిక్ష పడడం వంటి వరుస ఘటనల నేపథ్యంలో శ్రీనివా్‌సరెడ్డి కేసులో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. గురువారం ఉదయం హాజీపూర్‌ గ్రామస్థులు, బాధితుల కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు, న్యాయవాదులతో కోర్టు హాలు కిక్కిరిసింది. ఉదయం 10:30 గంటలకు బెంచిపైకి వచ్చిన జడ్జి.. మొదట సివిల్‌ కేసులను తీసుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. 11:30 గంటల వరకు ఆ కేసులను విచారించి, తర్వాత ఛాంబర్‌లోకి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి బెంచిపైకి వచ్చారు. జడ్జి ప్రశ్నించిన అనంతరం శ్రీనివాసరెడ్డి ఏడుస్తున్నట్లు నటించాడు. సరిగ్గా 2:15 గంటలకు జడ్జి తిరిగి తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. సరిగ్గా 6:15 గంటలకు బెంచిపైకి వచ్చిన జడ్జి ఒక్కో కేసులో నేరం, దానికి సంబంధించిన శిక్షను వివరిస్తూ తీర్పు వెలువరించారు. మొదటి కేసులో జీవితఖైదు అని చెప్పేసరికి అడ్వకేట్లు, మహిళా సంఘాలు నిరుత్సాహపడ్డారు. రెండో కేసులో మరణశిక్ష అని ప్రకటించడంతో న్యాయవాదులు బల్లలు చరిచారు. మూడో కేసులోనూ ఉరిశిక్షను ప్రకటించిన తర్వాత జడ్జి తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు.

ఏ కేసుకు ఏ శిక్ష
డిగ్రీ విద్యార్థిని హత్య కేసులో..
డిగ్రీ విద్యార్థిని (17)ని హత్య చేసినందుకు ఐపీసీ సెక్షన్‌ 302 ప్రకారం జీవితఖైదు, అత్యాచారం చేసినందుకు సెక్షన్‌ 366 ప్రకారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా; అపహరించినందుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 500 జరిమానా విధించారు.

పదో తరగతి విద్యార్థిని కేసులో..
పదో తరగతి విద్యార్థిని (15)ని హత్య చేసినందుకు చనిపోయేంత వరకు ఉరిశిక్ష, రూ.1000 జరిమానా; అపహరించినందుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా; అత్యాచారానికి పాల్పడినందుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా; ఆధారాలను మాయం చేసినందుకు ఏడేళ్ల కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధించారు.

ఆరో తరగతి విద్యార్థిని కేసులో..
ఆరో తరగతి విద్యార్థిని(11)ని హత్య చేసినందుకు చనిపోయేవరకు ఉరిశిక్ష, రూ.1000 జరిమానా; అపహరించినందుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా; అత్యాచారానికి పాల్పడినందుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా; సాక్ష్యాధారాలను మాయం చేసినందుకు ఏడేళ్ల శిక్ష, రూ.500 జరిమానా విధించారు.

కనిపించని పశ్చాత్తాపం..
సైకోగా ముద్ర పడిన శ్రీనివా్‌సరెడ్డిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. నేరాలు రుజువయ్యాయని జడ్జి ప్రకటించగా.. తనకేమీ తెలియదని నసగడమే తప్ప పెద్దగా స్పందించలేదు. తుది తీర్పులో భాగంగా రెండు కేసుల్లో చనిపోయేంత వరకు ఉరి శిక్ష విధిస్తున్నాను, ఒక కేసులో జీవితఖైదు అని జడ్జి వెల్లడించినప్పుడు కూడా శ్రీనివా్‌సరెడ్డి చలించలేదు. చివరి వరకు జడ్జి ఎదుట రెండు చేతులు జోడించి నిలబడడమే తప్ప ఎక్కడా బాధపడినట్లు కనిపించలేదు.

రేప్‌లు.. హత్యలు!

  • నాలుగేళ్లలో నలుగురు బలి
  • బాలిక అదృశ్యంతో
  • కదిలిన హత్యాచారాల డొంక

యాదాద్రి: ఊరిలో ఒకడిగా ఉంటూ అందరిని నమ్మించడం! అదను చూసుకుని ఆడపిల్లలను కాటేయడం!! చదువుకోవడానికి బడికెళ్లే చిన్నారుల జీవితాలను చిదిమేసి.. మృతదేహాలు సైతం దొరక్కుండా వ్యవసాయబావిలో పాతిపెట్టడం!! సీరియల్‌ కిల్లర్‌.. సైకో మర్రి శ్రీనివాస్‌ రెడ్డి నాలుగేళ్లుగా చేస్తున్న పని ఇదే. పదో తరగతి బాలిక అదృశ్యంతో అతగాడి అకృత్యాలన్నీ బయటపడ్డాయి. అదృశ్యమైన బాలిక స్కూల్‌ బ్యాగ్‌, బస్‌పాస్‌ వ్యవసాయ బావి దగ్గర దొరకడంతో శ్రీనివా్‌సరెడ్డి నేరాల డొంక కదిలింది. పక్కనేగల మరో బావిలో.. బాలిక మృతదేహం కూడా దొరకడంతో పోలీసులు అతడిపై దర్యాప్తు వేగవంతం చేయగా దిగ్ర్భాంతి కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. తమ గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థినులనే గాక కర్నూల్‌లో ఓ గుర్తుతెలియని మహిళపై అత్యాచారానికి పాల్పడి అమానుషంగా అంతమొందించిన వైనం బయటపడింది. శ్రీనివాస్‌ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు వ్యవసాయ బావిలో తవ్వకాలు జరిపితే.. 2015 ఏప్రిల్‌ 23న అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థిని, 2019 ఫిబ్రవరిలో మహా శివరాత్రి రోజున అదృశ్యమైన డిగ్రీ విద్యార్థిని ఎముకల గూళ్లు, దుస్తులు, గుర్తింపుకార్డులు, పుస్తకాలు లభ్యమయ్యాయి. వీరిలో ఆరో తరగతి విద్యార్థిని.. బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లికి చెందిన చిన్నారి. హాజీపూర్‌లోని తన మేనత్త ఇంటికి వచ్చి కాలినడకన తిరిగి వెళ్తుండగా శ్రీనివా్‌సరెడ్డి ఆమెపై హత్యాచారానికి పాల్పడ్డాడు. తమ బిడ్డ కోసం ఆ పాప తల్లిదండ్రులు నాలుగేళ్లపాటు వెతకని చోటు లేదు. ఆ చిన్నారి శ్రీనివా్‌సరెడ్డి చేతిలో బలైనవిషయం తెలిసి వారు కంటికీమంటికీ ఏకధారగా విలపించారు. అతడి చేతిలో బలైన డిగ్రీ విద్యార్థిని తల్లిదండ్రులదీ అదే పరిస్థితి.

నమ్మించి..
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్‌కు సరైన బస్సు సదుపాయం లేదు. గ్రామంలోని విద్యార్థినులు హైస్కూల్‌, ఆపై విద్యాభ్యాసానికి వెళ్లాలంటే బొమ్మలరామారం వరకూ కాలినడకన వెళ్లాల్సిందే. దీన్నే శ్రీనివా్‌సరెడ్డి అవకాశంగా తీసుకున్నాడు. గ్రామానికి ఒంటరిగా వస్తున్న విద్యార్థినులపై అత్యాచారం చేసి, చంపేసి పాడుబడిన వ్యవసాయబావిలో పూడ్చిపెట్టేవాడు. అంతకుముందు.. మైసిరెడ్డిపల్లిలో ఓ వివాహితపై హత్యాచార యత్యానికి పాల్పడి గ్రామస్థుల చేతిలో దేహశుద్ధికి గురయ్యాడు. కర్నూల్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ పెంట్‌హౌజ్‌లో ఓ గుర్తుతెలియని మహిళను చంపి మృతదేహాన్ని వాటర్‌ ట్యాంక్‌లో వేసిన కేసులో నిందితుడిగా బెయిల్‌పై ఉన్నాడు. ఇన్ని ఘోరాలు చేస్తున్న వ్యక్తి ఏమీ తెలియనట్టు మామూలుగా తమ మధ్యనే తిరగడంపై హాజీపూర్‌వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నప్పటి నుంచీ..
మర్రి శ్రీనివా్‌సరెడ్డిది యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌ గ్రామం. మర్రి అనసూయ, బాల్‌రెడ్డి దంపతుల రెండో కొడుకు. బొమ్మల రామారంలో పదో తరగతి వరకూ చదివిన అతడు.. లిఫ్ట్‌ మెకానిక్‌గా పనిచేసేవాడు. చిన్నప్పటి నుంచీ విపరీతమైన మనస్తత్వం గల శ్రీనివా్‌సరెడ్డితో గ్రామంలో ఎవరూ స్నేహం చేసేవాడు కాదు. మద్యం, గంజాయి వంటివి తాగుతూ చెడువ్యసనాలకు బానిసగా మారాడు. శ్రీనివా్‌సరెడ్డి గ్రామానికి ఎప్పుడు వచ్చేవాడో.. ఎప్పుడు వెళ్లేవాడో తమకు తెలియకపోయేదని గ్రామస్థులు అంటున్నారు.

Courtesy Andhrajyothi