– కార్పొరేట్‌ సంస్థలకు భారీ నష్టాలు..
– ప్రభుత్వరంగ సంస్థలకు స్వల్పంగా..
– వాటాల విక్రయానికే కేంద్రం సరికొత్త ఎత్తుగడలు
– ఉద్యోగులను గురించి పట్టించుకోని సర్కారు

వాణిజ్య విభాగం: దేశంలోని కార్పొరేట్‌ సంస్థల ఆర్థిక అండదండలతో అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని మోడీ సర్కారు.. వారికి లబ్ది చేకూర్చే విషయంలో అడ్డంగా వ్యవహరిస్తోంది. దేశంలో ప్రయివేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు తాము అన్ని విధాలా కృషి చేస్తామని ఇప్పటికే బాహాటంగా ప్రకటించిన మోడీ సర్కారు.. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలను బలిపీఠంపై పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎయిరిండియా, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌, హెచ్‌ఏఎల్‌, కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) వంటి సంస్థలను ప్రయివేటుకు అప్పగించేందుకు ఆసక్తి చూపుతోంది. ఒకప్పుడు జాతి నిర్మాణంలో ఎంతో కీలక పాత్ర పోషించిన ఆయా సంస్థలు.. తాజాగా తీవ్ర నష్టాలలోకి జారకున్నాయని సర్కారు ప్రచాం చేస్తోంది. మోడీ సర్కార్‌ చెబుతున్న లెక్కల ప్రకారం ఎయిరిండియా గత ఏడాది రూ.4600 కోట్లు, బీపీసీఎల్‌ రూ. 750 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.14,000 కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ.755 కోట్లు, సెయి ల్‌ రూ.286 కోట్ల మేర నష్టాలను నమో దు చేసినట్టు గా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయం లో ప్రయి వేటు రంగం లోని పోటీ సంస్థల పని తీరును పరిశీలిస్తే ఆయా సంస్థలు కూడా గొప్పగా తన లాభాలను నమోదు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఎయిరిండియాకు పోటీగా నిలిచే ఇండిగో రూ.1062 కోట్లు, స్పైస్‌జెట్‌ రూ.463 కోట్ల మేర నష్టాలను నమోదు చేశాయి. మరోవైపు ఒకప్పుడు ప్రయివేటు రంగంలో దిగ్గజ ఎయిర్‌లైన్స్‌గా వెలుగొందిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో రెక్కలు విరిగి నేలకొరిగింది. అయితే ఎయిరిండియాతో పోలిస్తే ఆయా సంస్థలకు ఉన్న విస్తృతి చాలా తక్కువ. వ్యాపార పరిధి కూడా పరిమితమే. దీన్ని బట్టి చూస్తే మిగతా కంపెనీ ల కంటే ప్రభుత్వ రంగ విమాన సంస్థ పనితీరే మెరుగ్గా ఉన్నట్టేన ని విశ్లేషకులు చెబుతు న్నారు.

మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలు నష్టాల్లో ఉన్నట్టుగా చెబుతున్న సర్కారు.. ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా దాదాపు రూ.15,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసినట్టుగా చెబుతోంది. ఇదేదో భారీ న(క)ష్టమని ఈ నేపథ్యంలో సంస్థను ముందుకు తీసుకుపోవడం కష్టమని చెబుతున్న సర్కారు ఆ సంస్థలకు శుభం పలికే దిశగా సన్నాహాలు చేస్తోంది. అయితే ఇదే రంగంలో ప్రయివేటుగా సేవలందిస్తున్న వోడాఫోన్‌, ఎయిర్‌టెల్‌ సంస్థల పరిస్థితిని విశ్లేషించి చూస్తే ఆయా సంస్థల నష్టాలు వరుసగా రూ.50,000 కోట్లు, రూ.23,000 కోట్ల నష్టాలను ప్రకటించాయి. అంటే ప్రయివేటు కంటే ప్రభుత్వ రంగ సంస్థ పనితీరే బాగుందని విశ్లేషించవచ్చని నిపుణులు వివిధ రిపోర్టుల్లో చెబుతున్నారు.

ఉద్యోగాలకు ఎసరు.. కొత్త ఉద్యోగాలకూ చెక్‌!
సర్కారు తీసుకుంటున్న ప్రయివేటు అనుకూల నిర్ణయా లతో కేంద్రంలో ఉన్న ఉద్యోగాలకు ఎసరురావడంతో పాటు.. కొత్తగా అందుబాటులోకి రావాల్సిన కొలువులు కూడా కొండెక్కుతు న్నాయి. బీఎస్‌ఎన్‌ఎల ్‌-ఎంటీఎన్‌ఎల్‌ సంస్థల నష్టాలను సాకుగా చూపుతూ దాదాపు 54,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపే దిశగా వ్యూహాలు రచిస్తోంది. దీనికి తోడు హెచ్‌ఏఎల్‌ సంస్థ నష్టాల్లో ఉందని ఆ సంస్థలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేవన్న వాదనను తెరపైకి తెస్తోంది. బ్యాంకుల విలీనం పేరుతో ఇప్పటికే సర్కారు బ్యాంక్‌ శాఖలను తగ్గిస్తూ వస్తోంది. దీంతో ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి. మరోవైపు రైల్వేలను విభాగాల వారీగా సర్కారు ప్రయివేటీకరిస్తూ వస్తోంది. మంద బలంతో చెలరేగిపోతున్న కేంద్ర ప్రభుత్వం కొన్ని రూట్లను పూర్తిగా ప్రయివేటుకే అప్పగించే సన్నాహాలను మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఉద్యోగాలు లభించడం కష్టంగా మారింది. దేశంలో నిరుద్యోగం నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరిన నేపథ్యంలోనూ యువతకు సరైన ఉద్యోగాలను కల్పించలేక పోతున్న ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను కూడా కోల్పోయేలా చర్యలు తీసుకోవటం పట్ల ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు.

(Courtesy Nava Telangana)