పౌరచట్టాలపై ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతుండగా.. ఇప్పుడు ప్రధాని పౌరసత్వంపై ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అసలు ఈ దేశ ప్రజలంతా ఈ దేశ పౌరులేనా..!? అని అనుమానం ఏలినవారికి..! అందుకే ప్రజల పట్టిక తయారీకి ఏన్నార్పీ, పౌరులను నిర్ణయించడానికి ఎన్నార్సీ, శరణార్థులలో ముస్లింలను వేరుచేయడాని సీఏఏ..! ఈ మూడు అస్త్రాలను ప్రజలపైకి ప్రయోగిస్తోంది ప్రభుత్వం. తగిన ఆధారపత్రాలను చూపి మీ పౌరసత్వాన్ని నిరూపించుకోండి అని ఆజ్ఞాపిస్తున్నది. నమ్మి ఓటేసిన పాపానికి ప్రజలెదుర్కొంటున్న దురవస్థ ఇది కాగా.. నిరూపించుకోవాల్సింది ప్రజలేనా? ప్రభువులు కూడానా? అన్న సందేహాలూ సహజం. ఆర్టీఐ కార్యకర్త శుభంకర్‌ సర్కార్‌కూ ఈ సందేహమే వచ్చి ఉంటుంది. అందుకే సమాచార హక్కు చట్టం మేరకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ప్రధాని మోడీ పౌరసత్వాన్ని ధృవీకరించే పత్రాలు కావాలని కోరాడు. దీనికి దేశం దిమ్మరపోయే సమాధానమిచ్చింది పీఎంవో..!

‘మోడీ ఈ దేశ ప్రధాని. అంతేకాక ఆయన పుట్టుకతోనే ఈ దేశ పౌరుడు. కాబట్టి ఆయన కొత్తగా ఇప్పుడు తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అంటోంది ప్రధాని కార్యాలయం..! మరి ఆ అవసరం మాకు మాత్రం ఎందుకు? ప్రభువులకో నీతి, పౌరులకో నీతా? ప్రధాని పుట్టుకతోనే భారతీయుడు కాబట్టి ఆయనకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.. సరే బాగానే ఉంది. మరి ఈ దేశ ప్రజలంతా పుట్టుకతో భారతీయులు కారా? తమ పుట్టుకను శంకించడానికా ప్రజలు వీరికి పట్టం కట్టింది? ఇవీ ఇప్పుడు పౌరసమాజంలో తలెత్తుతున్న ప్రశ్నలు. ప్రధాని కార్యాలయం సెలవిచ్చినట్టుగా.. ఏ పౌరసత్వ చట్టం 1955, సెక్షన్‌ 3ప్రకారం మోడీ పుట్టుకతోనే భారతీయుడో, అదే చట్టం ప్రకారం ఈ దేశ ప్రజలందరూ పుట్టుకతోనే భారతీయులు. అటువంటప్పుడు ప్రధానికి అవసరం లేని నిరూపణ ప్రజలకెందుకు?

భారత రాజ్యాంగం ముందు సాధారణ పౌరుడి నుంచి ఈ దేశ ప్రథమ పౌరుడి వరకూ అందరూ సమానమే. అది కుల మత జాతి భేదాలకూ హౌదాలకూ అతీతంగా అందరికీ అన్నింటా సమాన అవకాశాలనూ, హక్కులనూ, బాధ్యతలనూ కల్పిస్తోంది. చట్టం ముందు ప్రజలందరూ సమానులేనని రాజ్యాంగం నిర్దేశిస్తుంటే.. ప్రధాని మాత్రం అందుకు అతీతుడెలా అవుతాడు? విచిత్రమేమిటంటే పౌరసత్వ నిరూపణకు, వీరికి అధికారమిచ్చిన ప్రజల ఓటు హక్కూ చాలదట! ఓటరు కార్డూ చెల్లదట! మరి ప్రజలందరూ అనుమానాస్పద పౌరులే అయినప్పుడు.. ఆ పౌరులో కాదో తెలియని ప్రజలిచ్చిన ఓటుతో పీఠమెక్కినవారు మాత్రం ప్రభువులుగా ఎలా అర్హులవుతారు? ఇవి ఇప్పుడు ఎల్లెడలా పెల్లుబుకుతున్న సందేహాలు.

ఈ సందేహాల సారం ప్రధాని హౌదాని తక్కువ చేసేది ఎంత మాత్రమూ కాదు. ఈ దేశ పౌరునిగా ప్రధాని హౌదాలో ఉన్న ఆయనకు లేని అవసరం.. ఏ హౌదా లేని సాధారణ ప్రజలకు ఎందుకని మాత్రమే. సాక్షాత్తూ ప్రధానమంత్రికే సాధ్యం కాని ధృవపత్రాలు పామర జనానికి ఎక్కడ లభిస్తాయి? ఉద్దేశాలతోనో ఉద్వేగాలతోనో గాక, ఈ వాస్తవాల ఆధారంగా తర్కబద్ధంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితేగానీ మనకు సత్యమూ కర్తవ్యమూ బోధపడవు. ఇప్పటికే ఈ పౌర చట్టాల దెబ్బకు భయాందోళనల్లో మునిగిన ప్రజలు.. ఎన్నార్పీ ముసుగులో ముంచుకొస్తున్న ఎన్నార్సీ ముప్పుకు బెంబేలెత్తిపోతున్నారు. ఆధారపత్రాల కోసం అధికారుల చుట్టూ అంగ ప్రదక్షిణలు చేస్తున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలో ఈ ప్రధాని పౌరసత్వ ఆంశం చర్చనీయాంశం కావడం విశేషం.

ఏలినవారు చెబుతున్నదేమిటంటే.. తన పౌరసత్వం నిరూపించుకోవడానికి ఈ దేశ ప్రధానికి ఏ పత్రమూ అవసరం లేదట. కానీ 130కోట్ల భారత ప్రజలు మాత్రం.. తమవే కాదు, తమ తండ్రులూ తాత ముత్తాతల పత్రాలు కూడా చూపించాలట..! కాబట్టి ప్రజలిప్పుడు తమ మూలాలకు ఆధారాలు చెప్పండని పూర్వీకులకు మొరపెట్టుకోవాలన్నమాట..! బతికినంతకాలం ఈ నేలకు నెత్తురు ధారపోయడమే తప్ప, నిశ్శబ్దంగా యంత్రాల మధ్య ఆవిరికావడమే తప్ప.. వాటికి ఏ ఆధారాలనూ ఆశించని అంతరించిన తరాల జాడలను ఎక్కడ వెతకాలిప్పుడు..? ఈ ఏలికలకు మా ఆధారాలను చూపించండి తాతల్లారా అని ఏ దిక్కుకు వెళ్లి పిలువాలి వాళ్లని..? ఈ దిక్కుమాలిన దుస్థితిని ఏ దిక్కుకు విన్నవించుకోవాలి..? నిన్ను మోస్తున్న పాదాలు నీవి అవునో కాదో నిరూపించమంటే.. నీలో పారుతున్న నెత్తురు నీదో కాదో బదులివ్వమంటే ఏం చేయాలి? పుట్టిన మట్టికి పరాయిని చేసే ఈ కుట్రలకు తట్టుకునేదెట్లా..?

మనిషిని మతంగానే చూసే కండ్లకు మానవత్వం కనిపిస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. అయినా ఇప్పుడు వారికి కావాల్సింది మనుషులుకాదూ, మంచితనమూ కాదు. ప్రజలను మత ప్రాతిపదికన విభజించి, విద్వేషాలను వండివార్చి ఈ దేశాన్ని వశపరుచుకోవడం. అందుకే ఈ కుతంత్రం. కానీ ఈ కుతంత్రాలకు బలై అగాథంలో కూరుకుపోవడానికి ఈ దేశ ప్రజలేం గమ్యం తెలియని మార్గాలు కాదు. అందుకే ఈ కుట్రలకు నిరసనలై వెల్లువెత్తుతున్నారు. దేశమంటే మనుషులని తెలిసినవాళ్లకు.. ఈ ఉచ్చులో చిక్కుకుంటే తామంతా దేశంలేని అనాథలమవుతామని తెలియదా? అందుకే ఇప్పుడు ఆసేతుహిమాచలం చెప్పవలసింది ఒకే మాట. ఈ దేశంమాదేననీ, అది ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం ప్రధానికే కాదు.. మాకూ లేదని.

Courtesy Nava Telangana