మీ భారత జాతీయత నిరూపించుకోండి
20న విచారణకు హాజరు కండి..
లేదంటే ఆధార్‌ కార్డు రద్దవుతుంది..
తండ్రి ఆల్విన్‌లో ఒకప్పుడు ఉద్యోగి.. సీఏఏ నిరనసల మధ్య సంచలనం
మరో 127 మందికి నోటీసులు జారీ.. బర్మా దేశీయుల వల్లే ఈ తనిఖీలు
రేపు విచారణకు హాజరు కండి.. ఒరిజినల్‌ పత్రాలను తీసుకురండి
ఆటో డ్రైవర్‌ సత్తార్‌కు ఆధార్‌ నుంచి నోటీసు

హైదరాబాద్‌ సిటీ : ‘మీ భారత జాతీయతను నిరూపించుకోండి’ అంటూ పాతబస్తీకి చెందిన ఓ ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ సత్తార్‌ ఖాన్‌కు ఆధార్‌ కార్డు కార్యాలయం లేఖ రాసింది. ఈనెల 20న బాలాపూర్‌ రాయల్‌ కాలనీలోని మెఘా గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్లో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఆధార్‌ కార్డు కోసం జతపరిచిన ఒరిజినల్‌ పత్రాలతో విచారణాధికారిగా ఉన్న అమితా బింద్రూ ఎదుట హాజరు కావాలని తెలిపింది. ఒకవేళ హాజరు కాకపోయినా.. ఒరిజినల్‌ పత్రాలు చూపకపోయినా ఆయనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపడంతోపాటు ఆధార్‌ కార్డును రద్దు చేస్తామని లేఖలో పేర్కొంది.

తప్పుడు పత్రాలతో ఆధార్‌ కార్డును పొందినట్లు తమకు ఫిర్యాదులు అందాయని, అందుకే ఒరిజినల్‌ పత్రాలు చూపించి మీ భారత జాతీయతను నిరూపించుకోవాలని ఆ నోటీసులో వివరించింది. అయితే, ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సీఏఏ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఈ నోటీసు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, భవానీనగర్‌ తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సత్తార్‌ఖాన్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన జీవితంలో ఎప్పుడూ విదేశీ ప్రయాణం చేయని అతనికి ఇలాంటి నోటీసు రావడం షాకిచ్చింది. సత్తార్‌కు న్యాయవాది ముజఫరుల్లా ఖాన్‌ న్యాయ సహాయం చేస్తున్నారు. సత్తార్‌ ఆరోజు విచారణ ఎదుర్కొంటారని, ఆయన వద్ద ఓటరు ఐడీ, రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు ఉన్నాయన్నారు. ఇలాం టి నోటీసులు పాతబస్తీలో మరో 127 మందికి వచ్చాయి.

సత్తార్‌ హైదరాబాదీయే
సత్తార్‌ హైదరాబాద్‌కు చెందిన వాడేనని, అతని తండ్రి ఆల్విన్‌ కంపెనీలో పని చేశాడని, తండ్రి మరణించిన తర్వాత ఇప్పటికీ అతని తల్లికి పెన్షన్‌ వస్తోందని ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్‌ తెలిపారు. సత్తార్‌ కుటుంబంలో 10మంది ఉండగా.. అందరికీ అన్ని పత్రాలూ ఉన్నాయని, ఆధార్‌ సహా అన్నీ సరైనవేనని తెలిపారు. ఆధార్‌ నకిలీదని భావిస్తే.. కార్యాలయానికి పిలవకుండా ఫంక్షన్‌ హాల్లో విచారించడాన్ని తప్పుబట్టారు.

ఇదంతా ‘మీసేవ’ నిర్వాకమేనా!?
నకిలీ ఆధార్‌ కార్డులను తయారు చేసుకున్న కొంతమంది బర్మా దేశీయులను రెండేళ్ల కిందట పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా.. సంతోష్‌ నగర్‌లో ఓ మీసేవ కార్యాలయంలో వాటిని తయారు చేసినట్లు తేలింది. దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. సుమారు 100 ఆధార్‌ కార్డులను తయారు చేసినట్లు మీసేవ ప్రతినిధి అప్పట్లో వెల్లడించినట్లు సమాచారం. అలాంటి వారికే ఇప్పుడు నోటీసులు జారీ అవుతున్నాయని అంజదుల్లా తెలిపారు.

Courtesy Andhrajyothi