– ‘షాహీన్‌బాగ్‌’ నిరసనకారులపై మధ్యవర్తుల బృందం ప్రశంసలు
– గర్వించదగ్గ భారతీయుల్ని కలిశాం : సుప్రీం బృందం

న్యూఢిల్లీ : షాహీన్‌బాగ్‌… ఆ ప్రాంతంలో బేటీలు ఒక్క అడుగూ వెనకేయటంలేదు. ఏం చేయాలో.. ఈ ప్రదర్శన ఎలా నిలువరించాలో తెలియక మోడీ సర్కార్‌ సతమతమవుతున్నది. వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ)ను తీసుకొచ్చిన నాటి నుంచి చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమానికి ఊతమిచ్చిన ప్రాంతమిది. దేశంలో పలుచోట్ల ‘షాహీన్‌బాగ్‌’లు వెలిసేందుకు ఇది ఊపిరిపోసింది. ఎన్నార్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని షాహీన్‌బాగ్‌(రోడ్‌ నంబర్‌ 13)లో గత 68 రోజులుగా నిరవధిక ఉద్యమం కొనసాగుతున్నది. రహదారి దిగ్బంధనానికి పరిష్కారమార్గం చూపాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులు సంజరు హెగ్డే, సాధన రామచంద్రన్‌ల బృందాన్ని నియమించిన విషయం విదితమే. తొలిరోజైన బుధవారం బృందం ఆ ప్రాంతానికి చేరుకోగా.. నిరసనకారులు నిలబడి ఉత్సాహం గా చప్పట్లు కొడుతూ వారిని సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా న్యాయవాదుల దృష్టిని ఇద్దరు యువతులు ఫాతిమా, జైనబ్‌ ఆకర్షించారు. చదువు.. కుటుంబం.. ఉద్యమం ఇదీ ప్రస్తుతం వారిద్దరి దినచర్య. ‘ఇప్పటికైనా.. కనీసం మా మాట వినేందుకు ఒకరు వచ్చారు’ అని ఫాతిమా అన్నారు.

‘ఈ నేల కోసం మా పూర్వీకులు ప్రాణ త్యాగంచేశారు.. మా గుర్తింపును ప్రశ్నించటానికి ఎంత ధైర్యం?’
‘ఈ నిరసన ఉద్యమం నా జీవితానికి ఆచరణాత్మక పాఠాలను నేర్పింది. నిరసన తెలిపే హక్కును గుర్తించిన సుప్రీంకోర్టుకు మేం ఎంతో కృతజ్ఞులం. మా బాధలను వినాల్సిన అవసరాన్ని కోర్టు అంగీకరించింది. అత్యున్నత న్యాయ ‘ఆలయం’ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం’ అని ఆమె అన్నారు. ఈ సందర్భంగా.. నిరసన వేదిక వద్దకు వచ్చిన ఉద్దేశాన్ని ప్యానెల్‌ సభ్యులు హెగ్డే, రామచంద్రన్‌ నిరసనకారులకు వివరించారు. ‘మీ మాట వినటానికే మేం వచ్చాం.. అలాగే దీనికి ఒక పరిష్కారాన్ని కూడా కనుగొందాం’ అన్నారు.

‘భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లింలుగా మీతో మాట్లాడటానికి మేం ఇక్కడ ఉన్నాం. పాకిస్ధాన్‌ ఆలోచనను తిరస్కరించిన మా పూర్వీకులు ఈ నేల కోసం ప్రాణాలను అర్పించారు. మా గుర్తింపును ప్రశ్నించటానికి ఎవరికైనా ఎంత ధైర్యం?’ అని ఫాతిమా ప్రశ్నించారు. ‘ఈ దేశ మహిళలమైన మేం రెండు నెలలుగా రోడ్డుపై కూర్చొని ఉన్నాం. మా మాట వినటానికి ఎవరూ రాలేదు. మీడియా మా గురించి చెప్పిందేంటి? మమ్మల్ని ఉగ్రవాదులన్నారు.. దేశ వ్యతిరేకులని ముద్రవేస్తున్నారు. బిర్యానీ తింటానికి ఇక్కడ కూర్చున్నామన్నారు. మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వండి… మా అందరినీ చంపేయండి… మేం ఆత్మహత్య చేసుకోలేం.. ఎందుకంటే మా మతం అందుకు అనుమతించదు’ అని ఫాతిమా కుండబద్దలు కొట్టేలా వివరించారు.

ఉద్దేశపూర్వకంగానే మాపై బురద చల్లుతున్నారు. ప్రభుత్వ విభజన, విద్వేష చర్యలవల్లే మేం ఇప్పుడు రోడ్డుపై కూర్చున్నాం. ట్రాఫిక్‌ జామ్‌వల్ల మాత్రమే వారు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. మరి మా బతుకుల పట్ల కలుగుతున్న అసౌకర్యాన్ని మాత్రం పట్టించుకోరా? మేం చేస్తున్న నిరసన ను ఆపాలన్న ఏకైక లక్ష్యంతో కేంద్ర పాలకులు వెనుకుండి అనేక కట్టుకథలు సృష్టిస్తున్నారు. నిరసన వేదికను మార్చమని మీరు సూచిస్తున్నారు. ఇక్కడే మా మాట ఎవరూ విననప్పుడు.. మేం మా నిరసన వేదికను మారిస్తే.. ఎవరు పట్టించుకుంటారు?’ అని ప్రశ్నించారు. ‘దేశవ్యాప్తంగా సీఏఏ వ్యతిరేక నిరసనలకు షాహీన్‌ బాగ్‌ కేంద్రంగా ఉన్నది … మేం ఇక్కడ మా నిరసనను విరమించుకుంటే.. దేశవ్యాప్త నిరసనలపై ప్రభావం పడుతుంది. దానిని మేం భరించలేం.. అన్నింటికన్నా ముఖ్యమైనది… రాజ్యాంగాన్ని కాపాడుకునేం దుకు మేం వీధిలో కూర్చున్నాం. ఈ హక్కును కూడా ప్రభుత్వం లాక్కోవాలని చూస్తున్నది’ అని ఆమె అన్నారు.
గాంధీ, భగత్‌ సింగ్‌, లౌకికతత్వ ఆలోచనలు ప్రమాదంలో ఉన్నప్పుడు.. అందరూ వీధుల్లోకి రావాలి. ఆ పనే మేం చేశాం. ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యా న్ని ప్రభుత్వమే గుర్తించాలి’ అని ఫాతిమా అన్నారు. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేదిలేదన్న అమిషా వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. ‘చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న కోర్టు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని బలపరిచింది’ అన్నారు.

‘మీరు చాలా బాగా మాట్లాడుతున్నారని నేను ఈ మాటలు చెప్పటంలేదు. ప్రజాస్వామ్యం, వ్యవస్థ మీద మీకున్న విశ్వాసం చూసి ముగ్దుడనయ్యాను. నాకూ మీలాంటి పిల్లలున్నారు. పెద్ద న్యాయ పాఠశాలలో చదువుతున్నారు. కానీ, వారు మీలాగా వ్యక్తీకరించలేరు. పురుషులు, మహిళల హృదయాల్లో స్వేచ్ఛ ఉందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. రాజ్యాంగాన్ని పరిరక్షించే మీలాంటి బేటీలు మన దేశానికి ఉన్నంత వరకూ.. భారతదేశం ఎప్పటికీ స్వేచ్ఛను కోల్పోదు’ అన్నారు.

మధ్యవర్తులను ఉద్దేశించి.. మరొక యువతి జైనబ్‌ మాట్లాడారు. ‘ప్రభుత్వం, వారి మీడియా సంస్థల ద్వారా మాపై బురద చల్లుతున్నది. మేం వేసుకొనే డ్రెస్‌ కోడ్‌; ఆహారంపై నిరంతరం ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. భిన్నంగా దుస్తులు ధరించినంతమాత్రాన నేను ఉగ్రవాదినా?’ జైనబ్‌ ప్రశ్నించారు.
‘మేం సరిగా నిద్రకూడా పోవటంలేదు.. నాకు పరీక్షలు దగ్గరపడుతున్నాయి. కానీ, నేను అందుకు సిద్ధంకాలేకపోతున్నాను. ప్రభుత్వ నిర్ణయాలు మమ్మల్ని దెబ్బతీస్తున్నాయి. అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. పౌరసత్వాన్ని నిరూపించుకోలేని మన పేద దేశస్థుల గురించి కూడా మేం ఆందోళన చెందుతున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతున్నది. కానీ, అసోం మోడల్‌ మన ముందుంది. ప్రజలను నిర్బంధ కేంద్రాల్లో ఉంచారు. అసోంలోని నిర్బంధ కేంద్రాల్లో మరణించిన పిల్లల గురించి కూడా ఉన్నత న్యాయస్థానం ఆలోచించాలని మేము ఆశిస్తున్నాం’ అని మధ్యవర్తుల బృందానికి వివరించారు.

రెండు గంటలపాటు నిరసనకారుల అభిప్రాయాలను విన్న తరువాత… గర్వించదగ్గ భారతీయులను మేం కలుసుకున్నామనీ సీనియర్‌ న్యాయవాదులు సంజరు హెగ్డే, సాధన రామచంద్రన్‌ వ్యాఖ్యానించారు.

Courtesy Nava Telangana