కరోనా మహా సంక్షోభం మాటున ఆధిపత్య ధోరణి పెట్రేగిపోతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలైన అమెరికా, భారత దేశాల్లో బడుగుల హక్కులపై పాలకులు ఉక్కుపాదం మోపుతున్నారు. హక్కుల కోసం నినదించిన గళాలను పాశవికంగా అణచివేస్తున్నారు.

అమెరికా పోలీసుల చేతుల్లో నల్లజాతీయుడు బలైపోవడంతో అగ్రరాజ్యంలో ఆందోళనలు మిన్నంటాయి. అటు చైనా కూడా హాంకాంగ్‌పై దురాక్రమణకు దిగుతోంది. భారత్‌ సర్కారు అనాలోచిత లాక్‌డౌన్‌తో వలస శ్రామికులు పడుతున్న కష్టాలకు అంతే లేదు. తెలుగు గడ్డపైనా నిమ్నవర్గాలకు నగుబాటు తప్పడం లేదు. రక్షణ పరికరాలు అడిగిన వైద్యుడిని సర్కారు వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య భావజాలం జడలు విప్పడం పట్ల బుద్ధిజీవులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోరాటాలకు సిద్ధమవుతున్నారు.

అమెరికాలో మిన్నంటిన ఆందోళనలు
మత్తుపదార్థాలు కలిగివున్నాడన్న ఆరోపణలతో మిన్నియాపోలిస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో ఇటీవల అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టి చంపారు. మెడపై కాలుతో తొక్కి ఖాకీలు కర్కకశంగా ఫ్లాయిడ్ ప్రాణాలు తీశారు. ఈ దారుణోంతానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అమెరికా పోలీసుల క్రూరత్వంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖాకీల ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా మిన్నియాపోలిస్ నగరంలో మొదలైన ఉద్యమం ఇప్పుడు అమెరికా అంతటా వ్యాపిస్తోంది.

‘డ్రాగన్‌’ దేశం కుయుక్తులు
స్వతంత్ర దేశంగా ఉన్న హాంకాంగ్‌ను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ‘డ్రాగన్‌’ దేశం చైనా చేస్తున్న కుయుక్తులు పతాక స్థాయికి చేరాయి. చైనా ఆధిపత్యాన్ని హాంకాంగ్‌ ప్రజలు పెద్ద ఎత్తున తిరస్కరిస్తున్నా లెక్కచేయకుండా ‘డ్రాగన్‌’ దేశం వివాదాస్పద జాతీయ భద్రతా చట్టాన్ని తాజాగా ఆమోదించింది. హాంకాంగ్‌ స్వేచ్ఛను హరించేలా, తన పెత్తనాన్ని పెంచుకునేలా ఈ బిల్లును రూపొందించి తమ పార్లమెంట్‌లో చైనా ఆమోదముద్ర వేయించుకుంది. ప్రపంచ దేశాల ఆక్షేపణలను లెక్కచేయకుండా హాంకాంగ్‌ను తన వశం చేసుకునేందుకు చైనా ఈ దుశ్చర్యకు పాల్పడింది.

వలస బతుకుల వెతలు
భారత దేశంలో కరోనా కట్టడికి అమలు చేస్తున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ బడుగుజీవుల పాలిట మృత్యుపాశంగా మారింది. ముందు వెనుకా ఆలోచించకుండా మోదీ సర్కారు ప్రకటించిన లాక్‌డౌన్‌ వలస శ్రామికుల బతుకులు ఆగమయ్యాయి. కాలినడన, సైకిళ్లపై, ప్రైవేటు వాహనాల్లో స్వస్థలాలకు వెళుతూ దాదాపు 200 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం పెనువిషాదం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక ప్రత్యేకరైళ్లలో అన్నపానీయలు లేక బడుగుజీవులు ఆకలిబాధతో చనిపోతున్నారు. తాజాగా బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో వెలుగు చూసిన విషాదం దేశం మొత్తాన్ని కదిలించింది. ఆకలితో చనిపోయిన కార్మికురాలి మృతదేహాన్ని అధికారులు ప్లాట్‌ఫాం మీదనే వదిలేశారు. చనిపోయిన అమ్మకు కదలించేందుకు చిన్నపిల్లవాడైన ఆమె కొడుకు ప్రయత్నించిన వీడియో జాతి జనులను కన్నీళ్లు పెట్టించింది. శాసనకర్తల నిష్ఫూచీని చీదరించుకునేలా చేసిన ఈ విదారక ఘటనపై కళాకారులు, కవులు తమ చిత్రాలు, కవితల ద్వారా ఆవేదనను ప్రకటించారు.

దళిత వైద్యుడికి సర్కారు వేధింపులు
ఆంధ్రప్రదేశ్‌లో దళిత వైద్యుడి పట్ల సర్కారు వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసింది. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులకు సరైన రక్షణ పరికరాలు ఇవ్వాలని అడిగినందుకు విశాఖ జిల్లా నర్సీపట్నంకు చెందిన డాక్టర్‌ సుధాకర్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. అక్కడితో ఆగకుండా అతడిపై పిచ్చోడనే ముద్ర వేసి పిచ్చాసుపత్రికి తరలించింది. దళిత, బహుజన సంఘాలు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న హైకోర్టు ఏపీ సర్కారుకు గట్టిగా తలంటేసింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. దర్యాప్తు బాధ్యత తీసుకున్న సీబీఐ అధికారులు తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.