Image result for ఆమెను కాపాడుకుందాం"ఎవరెన్ని మాట్లాడినా.. ఎన్ని చట్టాలొచ్చినా మహిళ జీవితం మారట్లేదు. దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట దిశ, నిర్భయ, సమతల ఆర్తనాదాలు మిన్నంటుతూనే ఉన్నాయి. మృగాళ్ల అకృత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఆడపిల్లల పట్ల సమాజం ఎందుకిలా ప్రవర్తిస్తోంది? ఈ కొత్త దశాబ్దంలోనైనా మనం మన ఇంటి దీపాలను కాపాడుకోగలమా? కనీసం ఆ దిశగా కొంతైనా ముందడుగు వేయగలమా? అందుకు మనమేం చేయాలి? 

ఆమెను కాపాడుకుందాం

దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది…  అకృత్యం కొత్త కాకపోవచ్చు. కానీ అది జరిగిన తీరు తెలుసుకుంటుంటే అందరికీ గుండెలు పిండినట్లయింది. మరుక్షణం రక్తం మరిగిపోయింది. ఈ దశాబ్ది చివర్లో దేశాన్ని ఒక్కసారిగా కదిలించి.. ఒక్క తాటిపైకి తెచ్చిన ఘటన.. ‘దిశ’పై జరిగిన పాశవిక రాక్షసకాండ! వెంటనే అందరి మనసుల్లో ‘నిర్భయ’ మెదిలింది. ‘సమత’, ‘ప్రణతి’.. ఇలా మాకెందుకీ దుస్థితి అంటూ మనల్ని బోనులో నిలబెట్టే ఈ బాధితుల జాబితాకు అంతే లేదు. కొత్త దశాబ్దంలోనైనా బిక్కుబిక్కుమంటూ తిరగాల్సిన అవసరం లేకుండా, మహిళలు నిశ్చింతగా ఉండేలా భద్రమైన జీవన పరిస్థితులను కల్పించగలమా? నిర్భయ, దిశ చట్టాలు… ఉరి శిక్షలూ, ఎన్‌కౌంటర్లూ.. ఇవేవీ  అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తున్న దాఖలాలే లేని  నేపథ్యంలో.. దీన్ని ఎదుర్కొనేదెలా?

సవాల్‌ 10
కొత్త దశాబ్దిలోకి అడుగుపెడుతున్న తరుణంలో  మన ముందుకొచ్చిన మరో అతిపెద్ద సవాల్‌… మహిళల జీవితాలు ఇంటా బయటా మరింత భద్రంగా ఉండేలా చూడటం ఎలా?
* ఆడపిల్లలపై.. పుట్టకముందే మొదలవుతున్న వివక్ష.. వృద్ధాప్యం వరకూ కూడా ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంటోంది!
* మహిళలపై దేశవ్యాప్తంగా ఒక్క ఏడాదిలోనే 3.5 లక్షలకు పైగా అఘాయిత్యాలు జరిగాయి. ఈ సంఖ్య నానాటికీ పెరుగుతోందేగానీ తగ్గుతున్నట్లు కనిపించటం లేదు.
మనం ఏంచేయాలి?
పెంపకంలోనే సమానత్వం
ఒకే ఇంట్లో ఆడపిల్లా, మగపిల్లాడూ ఉంటే వాళ్లిద్దరినీ మనం ఎలా పెంచుతున్నామన్నది ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా ఆడపిల్లలు ఎలా మసలుకోవాలి,   మగపిల్లలు ఎలా ఉండాలి? పెద్దయిన తర్వాతా ఇంట్లో మగవాళ్లు ఎలా ప్రవర్తించొచ్చు? స్త్రీలు ఎలా ఉండాలన్న సంప్రదాయ ఆలోచనా ధోరణులను పూర్తిగా విడనాడాలి. పిల్లలకు బొమ్మలు కొనిపెట్టటం నుంచీ నీతినియమాలు బోధించటం వరకూ.. అంతా పురుషులు అధికులన్న భావనను బలపరిచేలా ఉన్న ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దాలి. బాల్యం నుంచీ ఆడపిల్లలకు స్వేచ్ఛ, సమాన అవకాశాలను కల్పించటం, వాటిని వారు ఎలాంటి బెరుకూ లేకుండా ఉపయోగించుకునేలా చూడటం అత్యంత ముఖ్యం.

సినిమాలూ మారాలి
ఆమెను కాపాడుకుందాం

కొన్ని సినిమాల్లో హీరోలు సైతం అమ్మాయిలను వేధించటం, వెటకారాలు ఆడటం, దురుసుగా ప్రవర్తించటం, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా దాడులకు దిగటం వంటివి పరిపాటిగా మారాయి. యుక్తవయస్కులపై బలమైన ప్రభావం చూపించే సినిమాల్లో ఈ ధోరణిని చక్కదిద్దటం.. అమ్మాయి, అబ్బాయిల మధ్య చక్కటి అనురాగాలను ప్రదర్శించటం అవసరం. మారుతున్న కాలానికి తగ్గట్టుగా మన సినిమాలూ మారాలి.

‘కొత్త’ దశాబ్దాన్ని నిర్మిద్దాం
నేటి తరం మహిళలు ఉన్నత చదువులతో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. పురుషులకంటే ఏ రకంగానూ తక్కువ కాదని  నిరూపించుకుంటున్నారు కూడా. కానీ.. చిన్నప్పటి నుంచీ తాము ‘ఆడపిల్లల కంటే అధికులమన్న’ సామాజిక ఆధిపత్య భావనల మధ్య పెరుగుతున్న మగపిల్లలు ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న చాలా దురాగతాలకు, దాడులకు, హత్యాచారాలకు మూలాలు ఇక్కడే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా, రాజ్యాంగపరంగానే కాదు.. సామాజికంగా, సాంస్కృతికంగా కూడా మనల్ని మనం ఎంతో సంస్కరించుకోవటం, ‘జెండర్‌ ఎడ్యుకేషన్‌’, ‘జెండర్‌ సెన్సిటివిటీ’ పట్ల అవగాహన కల్పించటం అవసరమని నిపుణులు బలంగా నొక్కి చెబుతున్నారు.

చట్టాలపైనా అవగాహన
ఆమెను కాపాడుకుందాం

లింగవివక్ష పైనా, దాని నిరోధక చట్టాలపైనా యుక్తవయసు నుంచే పిల్లల్లో అవగాహన పెంచాలి. ఏ పని నేరం కిందకు వస్తుంది? అదెంతటి శిక్షార్హమైంది? పర్యవసానాలు ఏమిటనేది కచ్చితంగా తెలియజెప్పాలి. దీనివల్ల మగపిల్లలకు తమ హద్దులు తెలిసి వస్తాయి. ఆడపిల్లలకు తమ హక్కులేమిటో అవగాహన పెరుగుతుంది. మహిళలు తాము పనిచేసే ప్రాంతాల్లో, కార్యాలయాల్లో.. చివరకు ఇళ్లలో కూడా లైంగిక దాడులు, వేధింపులకు గురవుతున్నారు. ఈనేపథ్యంలో ఆడపిల్లలు ఎవరినీ మూఢంగా నమ్మకూడదు. వ్యక్తుల స్వభావాలను, దురుద్దేశపూరితమైన చర్యలను సత్వరమే కనిపెట్టాలి. అత్యాచారాలే కాదు.. శారీరకంగా తాకడం, అసభ్యంగా ప్రవర్తించడం, లైంగికంగా ఒత్తిళ్లకు గురిచేయటం, అసభ్య చిత్రాలను చూపించడం వంటివన్నీ కూడా నేరాలే. కార్యాలయాల్లో లైంగిక ఒత్తిళ్లకు తలొగ్గకపోతే కష్టమైన పనులు నెత్తిన వేయటం, వృత్తిపరంగా ఎదగకుండా అడ్డుకోవడం, రాజీనామా చేయాలని ఒత్తిడి తేవడం కూడా నేరమే. వీటిపై అవగాహన ఉండటం చాలా అవసరం.

అండగా ఉండండి
ఆడపిల్లలు తమకు ఏ రూపంలో కష్టమొచ్చినా స్వేచ్ఛగా ఇంట్లో చెప్పుకోగలిగే వాతావరణాన్ని కల్పించాలి. వాళ్ల ప్రవర్తనలో ఏ పాటి తేడా కనిపించినా వెంటనే ప్రేమగా ఆరా తీయాలి. మనమున్నామన్న ధైర్యాన్ని కల్పించాలి. బడుల్లో ఈ పాత్ర ఉపాధ్యాయులు పోషించాలి.

ఉద్యోగాలు, ఉపాధి, ఆర్థిక శక్తి

ఆమెను కాపాడుకుందాం

భారత్‌లో 18-59 ఏళ్ల వయసు పురుషుల సంపాదన 100 రూపాయలుంటే.. స్త్రీల సంపాదన రూ.70 ఉంటోంది. ఆర్థిక అవకాశాలు మహిళలకు 35.4% మాత్రమే ఉన్నాయి. కార్మికశక్తిలో పురుషులు 80% పైగా ఉంటే.. మహిళలు కేవలం 32 శాతం మాత్రమే ఉంటున్నారు. ఉద్యోగాలకు సంబంధించి నాయకత్వ స్థాయిలో 14 శాతమే ఉండగా.. వృత్తి, సాంకేతికపరమైన ఉద్యోగాల్లో 30 శాతం మహిళలున్నారు.
* ఆడపిల్లలు, మహిళలు ఎదుర్కొనే చాలా సమస్యలు కొత్తకొత్త చట్టాలతోనో, శిక్షలతోనో పరిష్కారమైపోయేవి కాదు. వాటి మూలాలు, పరిధి మన సమాజంలో, కుటుంబాల్లో లోతుగా విస్తరించుకుని ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు మనం చేసే కృషి కుటుంబాల నుంచి, ఇంటి నుంచే ఆరంభం కావాలి.

మహిళలు ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నారు?
* లింగ నిష్పత్తిలో
* బడి చదువుల్లో
* ఉన్నత చదువులను అందుకోవటంలో
* ఉద్యోగాల్లో
* వేతనాల్లో
* చట్ట సంస్థల్లో
* రాజకీయ ప్రాతినిధ్యంలో
బాధల్లో ముందున్నారు!
* వివక్ష
* గృహ హింస
* లైంగిక వేధింపులు, అత్యాచారాలు
* ఏ గుర్తింపూ లేని ఇంటి చాకిరీ

ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ-పురుష తారతమ్యాలు పోవటానికి మరో వందేళ్లు పడుతుందని, రాజకీయంగా సమానత్వం రావటానికి 95 ఏళ్లు పడుతుందని, ఇక  అవకాశాల్లో తారతమ్యాలు తొలగిపోవటానికి ఏకంగా 257 సంవత్సరాలు పడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక అంచనా వేసింది. దీనర్థం లింగవివక్ష మూలంగా మన సమాజం ఆర్థికంగా, సామాజికంగా, ఏరకంగా చూసుకున్నా భారీగా మూల్యం చెల్లించుకుంటోందనే! అందుకే ఈ దశాబ్దిలోనే  పరిస్థితులను చక్కదిద్దేందుకు మనం గట్టి కృషి చేయాల్సి ఉంది.

(Courtesy Eenadu)