ఈ వ్యవస్థలో ప్రభుత్వం అనేది, మొత్తం బూర్జువావర్గ సమిష్టి వ్యవహారాలను చక్కబెట్టే కమిటీ మాత్రమే అంటాడు కార్ల్‌ మార్క్స్‌. ఆయన కమ్యూనిస్టు ప్రణాళికలో ఈ మాట చెప్పి ఇప్పటికి 171సంవత్సరాలు అవుతున్నది. ఈ మాటలోని ప్రతి అక్షరమూ సత్యమేనని ఈ రోజు మన రాష్ట్రంలో ఆర్టీసీలో జరుగుతున్న పరిణామాలు మరొక్కసారి రుజువు చేస్తున్నాయి. ఎలా?
ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టీసీకి 97డిపోలు, 357బస్టాండ్‌లు, 3,687 బస్‌రూట్‌లు, 13రీజియన్లు, 10,450 బస్సులు ఉన్నాయి. ఇవికాక ఇతర స్థలాలు కూడా ఉన్నాయి. వీటివిలువ దాదాపు రూ.60వేలకోట్లు. ఈ సంస్థ ప్రతి ఏడాది కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో రూ.4,000కోట్లు చెల్లిస్తున్నది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన, ఇన్ని వేలకోట్ల విలువైన ఈ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ను ఇప్పుడు ప్రయివేట్‌ బడాబాబులకు ధారాదత్తం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
”సగం ఆర్టీసీని ప్రయివేటు వాళ్ళకు అప్పచెప్పాల్సిందే, ఆర్టీసీ బస్సులు 50శాతం, అద్దె బస్సులు 20శాతం, ప్రయివేట్‌ బస్సులు 30శాతం పద్ధతితో ఇకనుండి నడపాలి.” ఈ మాటలు అన్నది ఎవరో కాదు. గతంలో కేంద్ర కార్మికశాఖా మంత్రిగా పనిచేసి, ఉమ్మడి రాష్ట్రంలో రవాణా మంత్రిగా పనిచేసి, ఇప్పుడు మన బంగారు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌.
ఇప్పుడు అధికారంలో తానున్నాడు కాబట్టి కేసీఆర్‌ మాట్లాడారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు అంతే మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రులూ ఇదే మాట మాట్లాడారు. బీజేపీ అధికారంలో ఉన్నచోట వారు అలానే మాట్లాడుతున్నారు. కారణం అవి కూడా బూర్జువావర్గ పార్టీలే కదా! ఈ వాదనలలో తెలంగాణ ప్రజలు దేనిని బలపరచాలి. దేనిని వ్యతిరేకించాలి. ఏది ప్రజలకు అనుకూలం, ఏది ప్రజలకు వ్యతిరేకం అనేది ఈరోజు కీలకమైన అంశం.
కార్మికవర్గం ప్రధాన డిమాండ్‌ ఆర్టీసీని ప్రభుత్వం స్వీకరించాలి. ఆర్టీసీని పరిరక్షించాలి. ప్రయివేటు వాళ్ళకు కట్టబెట్టవద్దనీ.. ఈ డిమాండ్‌తో పాటు 25 ఇతర డిమాండ్లు పెట్టి 35రోజుల ముందే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు. నోటీసు అందుకొన్న యాజమాన్యం, ప్రభుత్వ సలహాతో కార్మిక సంఘాలను నెల రోజులపాటు చర్చలకు పిలువలేదు. గుర్తింపు సంఘంతో కూడా కనీసం చర్చించలేదు. లేబర్‌ కమిషన్‌ కూడా చర్చించలేదు. ఇప్పుడే కాదు. 2017 ఏప్రిల్‌ నుంచి కార్మికులు అడుగుతున్నా, ఒక్క జాయింట్‌ మీటింగ్‌ నిర్వహించడానికి కూడా, ఈ ప్రభుత్వం కానీ, మేనేజ్‌మెంట్‌ కానీ, లేబర్‌ కమిషన్‌ కానీ సిద్ధపడలేదు.
ప్రభుత్వం మరోవైపు నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. 5వ తేదీ ఉదయం సమ్మె మొదలైతే, సాయంత్రం 6గంటల లోగా సమ్మె విరమించి కార్మికులు డ్యూటీలో చేరితేనే ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఊడుతుందని హెచ్చరించింది. అసలు ఆర్టీసీని ప్రయివేటీకరించవద్దని అనటమే నేరమంటున్నది. కచ్చితంగా ప్రయివేటీకరిస్తాం.. ఏమిచేస్తారో చేసుకోండి అంటున్నది. ఇండిస్టియల్‌ డిస్ప్యూట్‌ యాక్ట్‌, లేబర్‌ లా, యంపీడబ్ల్యూ యాక్ట్‌ ప్రకారం నోటీసు ఇచ్చి చేస్తున్న సమ్మెనే ప్రభుత్వం

పోతినేని సుదర్శన్‌ రావు

నేరమంటున్నది. తామిచ్చిన గడువులో డ్యూటీలో చేరలేదు కాబట్టి కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు అంటున్నారు. చర్చలకోసం ఏర్పాటు చేసిన కమిటీని కూడా రద్దు చేశారు. తీసేసిన ఉద్యోగుల స్థానంలో కొత్తగా ఉద్యోగాలలో చేరేవాళ్ళు కూడా, యూనియన్లలో చేరకూడదంట. కొత్త యూనియన్లు పెట్టకూడదంట. అలా అని అఫిడవిట్‌లు ఇవ్వాలని రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు.
సమ్మె పరిణామాలపై చర్చించడానికి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం), ఇతర ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తే, మీ పార్టీ పాలించే కేరళలో విలీనం చేశారా? కాంగ్రెస్‌ లేక ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో చేశారా అని ఎదురు దాడి చేస్తున్నారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వశాఖలో విలీనం చేయాలని సీపీఐ(ఎం) కానీ మరే యితర ప్రతిపక్ష పార్టీ కానీ డిమాండ్‌ చేయలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్న సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకుడిగా నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనాడు తెలంగాణ ప్రజలకిచ్చిన వాగ్దానమది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఐదున్నరేండ్లు గడిచిపోయింది. ఇంకెప్పుడు విలీనం చేస్తారని ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారు. ఇచ్చినమాట తప్పుతున్నారని ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారు. దీనికి సమాధానం చెప్పవలసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో చేసారా? ఆ రాష్ట్రంలో చేసారా అని దాటవేస్తున్నారు. ఆనాడు నమ్మించారు. ఈ రోజు మోసం చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు నిలదీస్తున్నారు.అయినా అడిగారు కాబట్టి కేరళ గురించి ఒకమాట చెప్పుకుందాం.
కేరళ ప్రభుత్వం గత మూడేండ్లలో అక్కడి ఆర్టీసీకి 4,500 కోట్లు గ్రాంటుగా ఇచ్చింది. అవి కాక ప్రతి ఏడాది 1,000 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తున్నది. గత రెండేండ్లలో రూ.3,500కోట్ల అప్పు తాను బాధ్యత వహించి ఇప్పించింది. ఫెన్షన్‌ లయబిలిటీ 40కోట్లు ప్రభుత్వమే భరిస్తున్నది.
కేసీఆర్‌ ప్రభుత్వం ఆర్టీసీ మీద, సంస్థ ఉద్యోగుల మీదా దాడి చేస్తున్నది. పూర్తి అసత్యాలు చెపుతున్నది. ఒక్కొక్కరికి సగటున రూ.50వేలు జీతం వస్తుంటే చాలటం లేదా అంటున్నది. ఆర్టీసీని తాము నిలబెట్టాలని చూస్తుంటే ఉద్యోగులు దెబ్బతీస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నది. వాస్తవాలు ఏమిటి? కార్మికుల జీతాలు ఎంతున్నాయని పరిశీలిస్తే, కొత్తగా కండక్టర్‌ ఉద్యోగంలో చేరిన వారికి బేసిక్‌ 12,610 డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పీయఫ్‌ మొత్తం కలిపి రూ.17,464 ఇస్తున్నారు. డ్రైవర్‌కు మొత్తం కలిపి రూ.19,084 ఇస్తున్నారు. పదేండ్ల సర్వీస్‌ అనంతరం డ్రైవర్‌కు మొత్తం రూ.24,762. కండక్టర్‌కు రూ.22,865, ఇరవైఏండ్ల సర్వీసు అనంతరం కూడా కండక్టర్‌కు వచ్చే మొత్తం రూ.28,682 కాగా, డ్రైవర్‌కు వచ్చే మొత్తం రూ.30,856 మాత్రమే. యండీలకు, చైర్మన్‌లకు, ఈడీలకు, డీయంలకు, ఆర్‌యంఒలకు లక్షలాది రూపాయలు ఇచ్చే వేతనాలన్నీ కలిపి కార్మికులకు ఇచ్చే వేతనాలు సగటు చేసి ఒక్కొక్కరికి రూ.50,000 ఇస్తామని చెప్పటం అంబానీ ఆదాయాన్నీ, అత్తరు సాయిబు ఆదాయాన్నీ, సమానం చేయటం లాంటిదే.
ఇక ఆర్టీసీని నిలబెట్టే ప్రయత్నాలను పరిశీలిస్తే ఆర్టీసీకి ప్రభుత్వం ఇవ్వవల్సిన బకాయిలు 2,800కోట్లు. ఈ కాలంలో ఇచ్చింది కేవలం 649కోట్లు. ఆర్టీసీకి 2019 మార్చి నాటికి ఉన్న అప్పు 3,200కోట్లు. గత ఐదేండ్లలో 3,491కోట్లు ఈ సంస్థ అప్పులు, వడ్డీల క్రింద తిరిగి చెల్లించింది. ఇందులో 2,200కోట్లు స్వంత వనరుల ద్వారా తీర్చారు. ఈ ఐదేండ్లలో పెరిగిన అప్పు కేవలం 1271కోట్లే. ప్రభుత్వం ఆర్టీసీని నిలబెట్టటానికి సహకరించటం కాదు.. తానే కావాలని పడదోస్తున్నది. ఇంకోవైపు వికలాంగులకు, విద్యార్థులకు, యంయల్‌ఎ, యంయల్‌సిలకు ఇస్తున్న రాయితీల రీ ఎంబర్స్‌మెంట్‌ ఒక్కరూపాయి కూడా చెల్లించటం లేదు.
ప్రజలారా.. వారేం చేయాలి మరి సమ్మె తప్ప
వాస్తవానికి తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు, మెకానిక్‌లు తమ చెమటనే కాదు, రక్తాన్ని ధారపోసి ఆర్టీసీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డరోజు 57,000మంది ఉద్యోగులు ఉంటే, ఈరోజు 50,000 మంది మాత్రమే ఉన్నారు. కానీ, ఆరోజు బస్సులు రోజుకు 30లక్షల కి.మీలు తిరుగుతుంటే, ఈ రోజు 36లక్షల కిలో మీటర్లు తిప్పుతున్నారు. ఆ రోజు 89లక్షల మంది ప్రయాణీకులను గమ్యాలకు చేరిస్తే, ఈనాడు రోజుకు కోటిమంది ప్రయాణీకులను గమ్యాలకు చేరుస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యానికి రోజుకు 14కోట్ల రూపాయలు మనిషి-మనిషి వద్ద వసూలు చేసి అందచేస్తున్నారు. ప్రతిరోజూ ఆ డబ్బులోనుంచి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో 4కోట్లు తీసుకొంటున్నాయి. గమ్యానికి ప్రయాణీకులను చేర్చిన తరువాత, ఆర్టీసీ కార్మికులు ఇంటికి వెళ్ళటానికి కూడా డీలక్స్‌ బస్సుల్లో గానీ, లగ్జరీ బస్సుల్లో గానీ ప్రయాణించకూడదు. కనీసం నిలబడి ప్రయాణం చేయటానికి కూడా అవకాశం లేదు. ఈ క్రమంలో పనిభారం తీవ్రమై, వేతనాలు తక్కువై వారు పడుతున్న శారీరక, మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలోనే ఆరుగురు కండక్టర్లు ఆత్మహత్య చేసుకొన్నారు. 7గురు డ్రైవర్లు స్టీరింగ్‌మీదనే గుండెపోటుతో చనిపోయారు. వారు చనిపోతూ కూడా ప్రయాణీకులను మాత్రం సురక్షితంగా కాపాడారు. ఈ పరిస్థితులలో పనిచేస్తున్న వారికి, తమ బాధల గురించి చెప్పుకోవటానికి గత 30నెలలుగా ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. కార్మికులేం చేయాలి. సమ్మె తప్ప మరొక మార్గం ఈ ప్రభుత్వం ఏమన్నా ఉంచిందా?
అటువంటి పరిస్థితులలో పనిచేస్తున్న కార్మికులను, కేసీఆర్‌ ప్రభుత్వం డిస్మిస్‌ చేస్తానంటున్నది. అసలు వారే సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారని ఎగతాళి చేస్తున్నది. గేటుదాటి వెళ్ళినవాళ్ళు తిరిగి రావటానికి వీల్లేదంటున్నది. ఆర్టీసీ ప్రాంగణాన్ని ఈ దొర తన గడీలాగా, తన ఫాంహౌస్‌లాగా భావిస్తున్నారు. ఈ ప్రాంగణాలు, డిపోలు, బస్సులు, బస్సు రూట్లూ, ఆర్టీసీ కార్మికులు, ప్రజల కష్టాల-శ్రమల ఫలితం. నైజాం నవాబు కాలంలో 1932లో నైజాం స్టేట్‌ రైల్‌Êరోడ్‌ ట్రాన్స్‌పోర్టు పేరుమీద 27బస్సులు, 166మంది ఉద్యోగులతో ప్రారంభమై గత 87ఏండ్లలో లక్షల మంది శ్రామికుల, కోట్లమంది ప్రజల కష్టంతో కూడబెట్టిన ఆస్తి ఇది.
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికులకు దుర్భరమైన పరిస్థితులను సృష్టించి వారితో చర్చలు జరపకుండా, కాలయాపన చేసి వారిని సమ్మెలోకి నెట్టింది. సమ్మె కారణాన్ని చూపి ఆర్టీసీ ఆస్తులను ప్రయివేటు పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నది. ఇప్పటికే ఆర్టీసీ స్థలాలను ఫంక్షన్‌ హాళ్ళకు, షాపింగ్‌ మాళ్ళకు, హౌటళ్ళకు ప్రయివేటు వాళ్ళకు కట్టపెట్టటం ప్రారంభింది. ఇప్పుడున్న ఎలక్ట్రిక్‌ బస్సులన్నీ ప్రయివేటు వ్యక్తులవే. ఇప్పుడు తెస్తాననేవీ ప్రయివేటు బస్సులే. లాభదాయక రూట్లూ, లాభదాయక సమయాల్లో ప్రయివేటు వాళ్ళకు అప్పచెబుతున్నారు.
అందుకే ప్రజలు ఆలోచించాలి. మన బస్సు మనకు లేకుండా పోతున్నది. మన డిపోలు మనవి కాకుండా పోతున్నాయి. మన బస్టాండులు ప్రయివేటువాళ్ల చేతుల్లోకి పోతున్నాయి. ఇది కార్మికుల సమస్య కాదు. ప్రజల సమస్య. ప్రజల ఆస్తిని దోచుకోవాలని చూసే ప్రయివేటు పెట్టుబడిదారులకు దోచిపెట్టాలనే ప్రభుత్వానికి, కాపాడుకోవాలనే ప్రజలకు సంబంధించిన సమస్య. ప్రజలు కదలాలి. ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగట్టాలి. ప్రజా ఆస్తుల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. దానికోసం నిలబడుతున్న ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ అండదండలివ్వాలి.

పోతినేని సుదర్శన్‌ రావు