– రైతులకు భారమౌతున్న దేశీయ ఆవుల పెంపకం
– వాటి స్థానే సంకరజాతి గేదెలతోనే అధిక ఆదాయం
– గోరక్షకుల దాడులు, తోలు పరిశ్రమల మూతతో భారీ నష్టాలు

న్యూఢిల్లీ : దేశీయ ఆవుల సంఖ్య నానాటికీ తగ్గుతున్నది. దీంతో వాటిని రక్షించాలని మోడీ సర్కారు ప్రజలపై తీసుకొస్తున్న ఒత్తిడితో ఆ భారం రైతులు, పాడిపెంపకందారులపై అధికంగా పడుతున్నది. గడిచిన 25 ఏండ్లలో దేశీయ ఆవుల సంఖ్య భారీగా తగ్గింది. అంతేగాక ఆవులతో పోల్చితే గేదెలు, పాలిచ్చే సంకరజాతి పశువుల నుంచి ఎక్కువ పాల ఉత్పత్తి అవుతుండటంతో రైతులు వాటిని పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ, కొద్దిరోజులుగా బీజేపీ పాలిత రాష్ట్రాలలో గోశాలలు, ఆవుల రక్షణ పేరిట పాలివ్వని గోవులను కూడా రైతులే సంరక్షించాలని ఆయా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దీంతో అది తమకు మరింత భారమౌతున్నదని పాడి రైతులు వాపోతున్నారు.
పశువుల గణన వివరాల ప్రకారం.. దేశీయ ఆవుల సంఖ్య 25 శాతానికి తగ్గింది. 1992 నాటికి దేశంలో 18.9 కోట్ల ఆవులుండేవి. అప్పటినుంచి వాటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. 2012 నాటికి అవి 15.1 కోట్లుండగా, ఈ ఏడాదికి 14.2 కోట్లకు తగ్గాయి. ఇదే క్రమంలో దేశీయ గేదెల సంఖ్యతో పాటు సంకరజాతి గేదెల సంఖ్య భారీగా పెరిగింది. 1992లో 8.4 కోట్లున్న గేదెలు.. 2019కి 11 కోట్లకు చేరాయి. అలాగే 1.5 కోట్లున్న సంకరజాతి గేదెలు.. ప్రస్తుతం 5.1 కోట్లకు పెరిగాయి. ఆవులతో పోలిస్తే సంకరజాతి పశువులు మూడింతలు ఎక్కువగా పాలిస్తాయి. ఈ రెండింటికీ పెట్టే ఖర్చు దాదాపు సమానం. దీంతో రైతులు సంకరజాతి పశువులను పెంచడానికే మొగ్గు చూపుతున్నారు. దేశంలోని మొత్తం పాల ఉత్పత్తిలో ‘గోమాత’ల నుంచి వచ్చే పాలు 21 శాతం మాత్రమే.

‘గోమాత’లతో ఆర్థిక భారం
పునరుత్పత్తి కోల్పోయి, వ్యవసాయానికి పనికి రాకుండా ఉన్న ఆవులను రక్షించడం రైతులకు తలకు మించిన భారం అవుతున్నది. లైవ్‌స్టాక్‌ లెక్కల ప్రకారం దేశంలో 1.32 కోట్ల ఆవులు ఈ కోవకు చెందినవి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ కామధేను పథకం ప్రకారం.. ఒక్క ఆవును సంరక్షించడానికి ఏడాదికి రూ. 15,650 ఖర్చవుతుందని అంచనా వేశారు. దీంతో 1.32 కోట్ల ఆవుల నిర్వహణకు ఏటా రూ. 20 కోట్లకు పైనే వ్యయమవుతున్నది. ఈ భారమంతా ప్రభుత్వాలు భరించడానికి సిద్ధంగా లేవన్నది నిర్ద్వందం. ఇందుకు సంబంధించి యూపీలో గోశాలల నుంచి తప్పిపోయిన ఆవులను రైతులే సంరక్షించాలని యోగి సర్కారు ఆదేశించినట్టు గతంలో వార్తలొచ్చాయి. దీంతో రోడ్లమీద విహరించే ఆవులు తమ పంట పొలాలను నాశనం చేయకుండా ఉండేందుకు రైతులే వాటిని పెంచుతున్నారు. ఇప్పటికే వ్యవసాయం సరిగ్గా లేక రుణాలు అధికమై సతమతమవుతున్న రైతులకు ఇది మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నది.

తోలు, మాంసం పరిశ్రమలకు భారీ నష్టం
మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోరక్షణ పేరిట గోరక్షకుల దాడులు అధికమయ్యాయి. దళితులు, ముస్లిం మైనారిటీలే లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నాయి. అంతేగాక యూపీలో ఉన్న తోలు పరిశ్రమలను నిర్వహిస్తున్న వారిని తక్షణమే నిలిపివేయాలంటూ యోగి సర్కారు గతేడాది ఆదేశాలు జారీ చేసింది. దీంతో యేటా రూ. 30 వేల కోట్ల పరిశ్రమ భవిష్యత్తు ఒక్కసారిగా అంధకారమైంది. కాన్పూర్‌, ఉన్నావోలో ఉన్న తోలు పరిశ్రమలు బంద్‌ కావడంతో రూ. 20 వేల కోట్ల నష్టాలు వాటిల్లాయని కౌన్సిల్‌ ఫర్‌ లెదర్‌ ఎక్స్‌పోర్ట్‌ (కాన్పూర్‌) రీజినల్‌ చైర్మెన్‌ జావేద్‌ ఇక్బాల్‌ తెలిపారు. గతంతో పోల్చితే మాంసం ఎగుమతులు సైతం భారీగా తగ్గాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

…Courtesy Nava telangana