– ప్రధాని మోడీని కోరిన ఐఎల్‌ఓ
– హక్కుల పరిరక్షణకు జోక్యం చేసుకుంటాం
– పది కార్మిక సంఘాల లేఖపై ప్రతిస్పందన

న్యూఢిల్లీ : భారత్‌లో కార్మిక చట్టాల నిర్వీర్యంపై అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని భారత్‌కు చెందిన కార్మిక సంఘాలకు ఐఎల్‌ఓ ఈనెల 22న రాసిన ప్రతిస్పందన లేఖలో పేర్కొంది. అంతర్జాతీయ కార్మిక చట్టాలను సమర్ధిస్తూ, వాటికి అనుగుణంగా నడుచుకో వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ప్రధాని మోడీని కోరింది. భారత్‌లో కార్మిక హక్కులు, అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను కాపాడేం దుకు జోక్యం చేసుకోవాలని 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈనెల 14న ఐఎల్‌ఓకు ఉమ్మడిగా ఒక లేఖ రాశాయి. దీనికి స్పందనగా ఐఎల్‌ఓకు చెందిన ఇంటర్నేషనల్‌ లేబర్‌ స్టాండర్డ్స్‌ డిపార్ట్‌మెంట్‌ బ్రాంచ్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ చీఫ్‌ కరేన్‌ కర్టిస్‌ తిరుగు లేఖ రాశారు. భారత్‌లో కార్మిక చట్టాల నిర్వీర్యంపై ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ జోక్యం చేసుకుంటారని తెలిపారు. ఐఎల్‌ఓకు లేఖ రాసిన కార్మిక సంఘాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ది సెల్ఫ్‌ ఎంప్లాయిడ్‌ వుమెన్స్‌ అసోసియేషన్‌, ఆలిండియా సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌, ఎల్‌పీఎఫ్‌, యూటీయూసీ ఉన్నాయి.

ఐఎల్‌ఓకు కార్మికసంఘాలు రాసిన లేఖ
దేశంలో వివిధ రాష్ట్రాల్లో కార్మిక చట్టాల రద్దుపై కేంద్ర కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు సోమవారం జనీవాలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ గై రైడర్‌కు పది కేంద్ర కార్మిక సంఘాల నేతలు లేఖ రాశారు. భారత రాజ్యాంగ సూత్రాలు, ఐఎల్‌ఓ నిర్ణయాలు రద్దుతో చాలా గందరగోళంగా అనిశ్చిత పరిస్థితిలో ఉన్నాయని తాము భావిస్తున్నట్టు తెలిపారు. భారత ప్రభుత్వం ప్రాథమిక కార్మిక హక్కులను రద్దు చేయడంపై ఐఎల్‌ఒ శక్తివంతంగా, సమర్థవంతంగా జోక్యం చేసుకోవాలని కోరారు. ఐఎల్‌ఓ సూచించిన సామాజిక భాగస్వామ్యం, త్రైపాక్షికత ప్రాథమిక భావనకు వ్యతిరేకంగా మోడీ సర్కార్‌ ఏపపక్షంగా నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. పని గంటలు పెంచడం, కార్మిక సంఘాల స్వేచ్ఛ హక్కు రద్దు, వేతన బేరసారాల నిబంధనలను పూర్తిగా రద్దు చేయడం లక్ష్యంగా ఆర్డినెన్స్‌ తీసుకొస్తున్నారని వివరించారు.

భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు కోవిడ్‌-19 ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసే ఉద్దేశంతో కార్మిక చట్టాలను మార్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కార్మిక చట్టాలను మార్చే అంశంపై ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్లు జారీ చేశాయని తెలిపారు. గుజరాత్‌లో ”పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచుతూ ఏప్రిల్‌ 7న ఆర్డినెన్స్‌ ఇచ్చారు. అయితే ఈ పెంచిన పని గంటలకు వేతనం ఇవ్వటం లేదు. అక్కడ అన్ని కార్మిక చట్టాలను 1200 రోజులు నిలిపివేయబోతున్నారు” అని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ”పని గంటలను 12 గంటలకు పెంచుతూ మే 6న ఆర్డినెన్స్‌ తీసుకొచ్చారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పని చేయడానికి షాప్‌, ఎస్టాబ్లిష్‌మ్ట్‌ెం చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. 1000 రోజుల పాటు అన్ని కార్మిక చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు” అని వివరించారు. వీటితో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా, అస్సాం, బీహార్‌, కర్నాటక రాష్ట్రాల్లో కూడా కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను మార్చేందుకు ఆర్డినెన్స్‌లు, నోటీఫికేషన్లు తీసుకొచ్చారని తెలిపారు.

కార్మిక హక్కుల పరిరక్షణకై జోక్యం: ఐఎల్‌ఓ
అయితే కార్మిక సంఘాల లేఖపై ఐఎల్‌ఓ స్పందించింది. ఈ మేరకు పది కార్మిక సంఘాలకు లేఖ రాసింది. ”మీరు పంపిన లేఖ అందింది. కార్మిక చట్టాలను, అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను అణగదొక్కడానికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వెలుగులోకి వచ్చాయి. కార్మికుల హక్కుల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత అధికారులతో కలిసి జోక్యం చేసుకుంటాం. ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ వెంటనే జోక్యం చేసుకుంటారని హామీ ఇస్తున్నాం. ఇటీవలి చోటు చేసుకున్న పరిణామాలపై తన ప్రగాఢ ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అంతర్జాతీయతను సమర్థించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన సందేశం పంపాలని, సామాజిక సంభాషణలో నిబద్ధతలను ప్రోత్సహించాలని ప్రధాన మంత్రిని విజ్ఞప్తి చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

Courtesy Nava Telangana