నూతన విద్యా విధానం వంటి పత్రాలలో మనం కొన్ని గంభీరంగా కనపడే ప్రకటనలకు, కొత్తగా ప్రతిపాదిస్తున్న మార్పులకు తేడా గమనించగలగాలి. ‘ప్రజలందరికీ విద్య’, ‘జీడీపీలో 6శాతానికి తగ్గకుండా విద్యా రంగానికి కేటాయించాలి’ వంటివి ఇటువంటి ఉత్తుత్తి ప్రకటనలే. వాటిని సాధించడానికి నిర్దిష్టమైన ప్రతిపాదనలు కానీ, కార్యాచరణ ప్రణాళిక కానీ లేకుండా కేవలం లక్ష్యాలను ప్రకటించడం అంటే గాలికబుర్లేనని మనం గ్రహించాలి. ఈ సంగతి గమనించనందువల్లనే కొందరు విద్యారంగంలో నిపుణులైనప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానంలో చాలా అంశాలు స్వాగతించదగ్గవి అంటూ స్పందిస్తున్నారు. వాస్తవానికి ఈ విద్యా విధానం పూర్తిగా తిరోగమన దిశలో ఉంది. సమ సమాజానికి పునాది వేయవలసిన విద్యా విధాన మౌలిక లక్ష్యం నుంచి వెనకడుగు వేయడమే ఈ నూతన విద్యా విధాన (ఎన్‌ఈపీ) సారాంశం.

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను విద్యారంగానికి దూరం చేయడం ఈ నూతన విధానంలో కనపడే పెద్ద వెనకడుగు. ఈ సామాజికంగా వెనకబడిన తరగతుల రక్షణ కోసం రూపొందిన రిజర్వేషన్లు వంటి గ్యారంటీ చర్యల గురించిన ప్రస్తావన ఏదీ ఈ విధాన పత్రంలో మనకు కనిపించదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేరుగా నిర్వహించే జేఎన్‌యూ వంటి విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లను అమలు జరపకుండా ప్రభుత్వమే నీరుగారుస్తున్న తీరు గమనిస్తే ఈ విధాన పత్రంలో దళిత, ఒబీసీ తరగతుల విద్యార్థును విద్యారంగం నుంచి పక్కకు నెట్టివేసే ధోరణి వెనుక ప్రభుత్వ పాత్ర స్పష్టంగా కానవస్తుంది.
ఎన్‌ఈపీ ప్రయివేటీకరణను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నది. ఆర్థిక అంశాలతో సహా ఇతర విషయాలలో కూడా స్వయం ప్రతిపత్తిని కల్పించాలన్న ప్రతిపాదన సారాంశం ఇదే. అధిక సంఖ్యలో కళాశాలలకు ఈ స్వయం ప్రతిపత్తిని కల్పించాలన్న ప్రతిపాదన అమలు జరిగితే ఆ సంస్థలన్నీ ఇకముందు అధిక ఫీజులను వసూలు చేయడం ప్రారంభిస్తాయి. దాని ఫలితంగా పేద కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు, ముఖ్యంగా అణగారిన తరగతులకు చెందిన విద్యార్థులు ఈ కళాశాలలలో అడుగుపెట్టే వీలు లేకుండా పోతుంది. అటువంటి పేద విద్యార్థుల కోసం ఉపకార వేతనాలు ఉంటాయి కదా అని ఈ విధానాన్ని సమర్థించే వారు వాదించవచ్చు. ఒకసారి స్వయంప్రతిపత్తి ఇచ్చాక కొందరికి స్కాలర్‌షిప్పులు ఇవ్వడం అంటే ఆమేరకు తక్కిన విద్యార్థు నుంచి అదనంగా ఫీజు వసూలు చేయడమే అవుతుంది. అప్పుడు ‘మా డబ్బుతో మీరు చదువుతున్నారు’ అనే విధంగా కొందరు సంపన్న తరగతుల విద్యార్థులు మరికొందరు విద్యార్థులను చిన్నచూపు చూడటం, వారిని వేరుగా పెట్టడం జరుగుతుంది. విద్యార్థులందరిలోనూ ఒక సమ భావన నెలకొనాల్సిన విద్యా సంస్థలలో ఇటువంటి చీలికలు అవాంఛనీయ పరిస్థితులకు దారి తీస్తాయి. ప్రజా ధనంతో, ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లతో నడిచే విద్యా సంస్థలు లేకుండా చేయాలనేది ఈ నూతన విద్యావిధానపు లక్ష్యంగా ఉంది. అప్పుడే నయా ఉదారవాదం నిర్దేశంచే విద్యా వ్యాపారానికి ప్రాతిపదిక ఏర్పడుతుంది. అందువలన పేద తరగతుల విద్యార్థులు చదువులకు దూరమైనా అవుతారు, లేకపోతే రెండవ తరగతి విద్యార్థులుగా తక్కిన విద్యార్థుల చేత చిన్నచూపు చూడబడుతూ చివరికి ఆ వివక్షను తట్టుకోలేక ఏకంగా చదువు మానేసే స్థితికి నెట్టబడతారు.
ముసాయిదా విద్యా విధానం-2019లో దాతృత్వ స్వభావంలేని ప్రయివేటు విద్యా సంస్థలను ప్రోత్సహించరాదన్న అర్థం వచ్చేలా కొన్ని వాక్యాలున్నాయి. ఇప్పుడు తాజాగా ప్రకటించిన విద్యా విధాన పత్రంలో అటువంటి వాక్యాలన్నీ తొలగించబడ్డాయి. ఇదొక ఆసక్తి కలిగించే వాస్తవం. అదేవిధంగా ముసాయిదాలో విద్యాహక్కు చట్టానికి సంబంధించిన ప్రస్తావనలు ఏవైతే ఉన్నాయో వాటిని తుది పత్రంలో పూర్తిగా తొలగించారు.

మన పరిశీలన ప్రకారం ఈ నూతన విధానం ఫలితంగా పలువురు విద్యార్థులు విద్యా రంగం నుంచి వైదొలగే అనివార్య పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా వైదొలగడాన్ని ‘సర్దుబాటుకు వీలుండే విధానం’ అనే మాటలతో కప్పిపుచ్చి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఈ విధానంలో నాలుగేండ్ల డిగ్రీ కోర్సును ప్రతిపాదించారు. దాని వెనుక కారణాలేమిటో స్పష్టతలేదు. ఇటువంటి ప్రతిపాదనే యూపీఏ-2 హయాంలో కపిల్‌ సిబాల్‌ చేసినప్పుడు దానికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మోడీ ప్రభుత్వం తొలి విడత అధికారంలోకి రాగానే స్మతి ఇరానీ విద్యా మంత్రిగా ఉండి ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. అప్పుడది కేవలం ఒక్క ఢిల్లీ యూనివర్సిటీకి మాత్రమే పరిమితంగా చేసిన ప్రతిపాదన. దానిని వెనక్కు తీసుకున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఏ కారణాలనూ వివరించకుండానే ఏకంగా దేశం మొత్తానికే ఆ నాలుగేండ్ల డిగ్రీ కోర్సును విస్తరిస్తూ ప్రతిపాదన చేశారు. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం ఏ విద్యార్థి అయినా ఒక ఏడాది లేదా రెండేండ్లు చదివాక ఇక కొనసాగించ కుండా మధ్యలోనే ఆగిపోతే అటువంటి వారికి ఒక ఏడాది పూర్తి చేస్తే సర్టిఫికెట్‌, రెండేండ్లు పూర్తి చేస్తే డిప్లొమా ఇస్తారు.

అంటే ఈ నూతన విద్యా విధానం డిగ్రీ చదువును మధ్యలో ఆపివేసి అర్థాంతరంగా వైదొలగడాన్ని అధికారికంగా ప్రోత్సహిస్తున్నదన్నమాట. డ్రాపౌట్లు లేకుండా నివారించడం ఎలా అన్నది వదలిపెట్టి ఆ డ్రాపౌట్లనే చట్టబద్ధం చేయడానికి పూనుకున్నదన్నమాట. ఆ విధంగా ఆగిపోయేవారికి ఓదార్పుగా ఓ సర్టిఫికెట్‌ గాని, ఓ డిప్లొమా గాని ఇవ్వనున్నారు. ఆ సర్టిఫికెట్లతో వారికెటువంటి ఉద్యోగాలూ వచ్చేదిలేదు. పూర్తికాలం కాలేజీలో చదవకుండా మధ్యలో ఆగిపోయి నందువలన వారికి ఎటువంటి విజ్ఞానమూ అదనంగా లభించదు. కాలేజీ జీవితం ద్వారా వారెటువంటి ప్రయోజన కరమైన అనుభవాన్నీ పొందజాలరు. మొత్తంగా చూస్తే ఈ నూతన విద్యా విధానం వలన చాలామంది అరకొర చదువుతో ఆగిపోడానికి, తాము చదువుకున్నామనే భ్రమలు వారికి కలగడానికి దారితీస్తుంది తప్ప ఆ ‘చదువు’ వలన వారికెటు వంటి ప్రయోజనమూ ఒనగూరదు. ఇటువంటివా రంతా అత్యధికులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన తరగతుల నుంచి ఉంటారని మనం స్పష్టంగానే గ్రహించవచ్చు.

స్వాతంత్య్రం సాధించినప్పుడు మనదేశం అన్ని ప్రాంతాల, అన్ని తరగతుల ప్రజలకూ విద్య అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యం నిర్దేశించుకుంది. ఆనాటి నూతన చైతన్యానికి ఇది సంకేతం. ఆనాటి లక్ష్యం నుంచి ఇప్పుడీ కొత్త విధానం పూర్తిగా వైదొలగినట్టే. అదే విధంగా ఉపాధి అవకాశాలను కల్పించే కోర్సులన్న పేరుతో వొకేషనల్‌ విద్య వైపుగా ఎక్కువ మందిని నెట్టడం ఈ విధానంలో కనపడుతుంది. సాధారణ విద్యను కనీస స్థాయి వరకూ అభ్యసించ కుండానే, అందుకవసరమైన కాలం ఉమ్మడిగా చదవకుండానే చిన్న పిల్లలను కూడా వొకేషనల్‌ విద్యవైపు నెట్టడం బట్టి ఈ ప్రభుత్వం యువతకు విద్య గరపవలసిన తన బాధ్యత నుంచి వైదొలగదలచుకుందని మనకు అర్థం అవుతోంది. కొద్దిపాటి శిక్షణనిచ్చి దానితో సరిపెట్టుకుని ఉపాధి కోసం వేటలో పడమని యువతకు ఈ ప్రభుత్వం సూచిస్తోంది.
పాఠశాల విద్యలో తొలి సంవత్సరాలలో పిల్లలు తమ తమ మాతభాషలలో చదువుకోవాలని, ఆ భాష ఆ రాష్ట్రం యొక్క అధికార భాష కాకున్నా పిల్లలు మాత్రం తమ మాతభాషలోనే చదువుకోవాలని నూతన విద్యా విధానం చెప్తోంది. ఇది మంచిదే (మన రాష్ట్రంలో సవర, కోయ భాషలలో చదువు నేర్పే విధానం కొన్ని చోట్ల అమలులో ఉంది). అయితే ఆ విధంగా చదువుకున్న వారు తర్వాత కాలంలో ఇతరులతోబాటు దీటుగా అధికార భాషా మాధ్యమంలో చదువుకోవాలన్నా, తక్కినవారితోబాటు పోటీ పడగలిగేలా ఉండాలన్నా అందుకు కొన్ని అదనపు చర్యలు అవసరం. అటువంటి వారికి పైచదువులలో రిజర్వేన్లు కల్పించడం అవసరం. అటువంటి చర్యలేవీ ఈ నూతన విధానంలో ప్రతిపాదించలేదు. దీని ఫలితంగా తమ తమ మాతభాషల్లో (అధికార భాషకాని స్థానిక భాషల్లో- కోయ, సవర వగైరా) చదువుకునే పిల్లలు ఇక ఆ స్థాయిని దాటి పై చదువులు నేర్చుకోలేని దుస్థితిలో పడిపోతారు. ప్రాథమిక స్థాయితోనే వారి చదువులు ముగిసిపోతాయి.

నూతన విద్యా విధానం ఆ విధంగా విద్యా రంగంలో ఉన్నత తరగతుల విద్యార్థులకు తక్కిన వారికి మధ్య ఒక చీలికను తీసుకువస్తుంది. ఇది ఏమాత్రమూ సహించరాని విషయం. ఇంతటితో ఆగక, ఆ చీలికను సమర్థించే తాత్విక దృక్పధాన్ని కూడా ఈ నూతన విధానం ముందుకు తెచ్చి ప్రజలు ఈ చీలికలను ఆమోదించేటట్టు వారిని ప్రభావితం చేస్తుంది. ‘భారతీయత’ ఒక గర్వించదగ్గ వారసత్వం అని ప్రతీ విద్యార్థీ భావించే విధంగా చేయాలన్నది ఒక లక్ష్యంగా ప్రకటించారు. అయితే మన సంస్కతిలో వారసత్వంగా మనకు అత్యంత అమానవీయమైన అంటరానితనం అనేది సంక్రమించింది. ఇటువంటి అంశాల పట్ల ఎవరైనా ఏవిధంగా గర్వపడగలరు? అందుకే సిలబస్‌ నుంచి అటువంటి వాస్తవిక అంశాలను మరుగుపరిచి మన భారతీయ వారసత్వాన్ని ‘అందంగా కనపడేలా’ సవరించనున్నారు.

‘నిష్కామ కర్మ’ అనేది మనకు సంక్రమించిన ఇంకొక తాత్విక వారసత్వం. వ్యక్తిగతంగా ఎవరికి వారు ఈ దష్టిని అలవరచుకోవడం అనేది వారి ఇష్టం. కాని దానినే విద్యార్థులకు ఒక సిలబస్‌లో భాగంగా బోధిస్తే అది అనివార్యంగా దోపిడీని కప్పిపుచ్చేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ ‘నిష్కామకర్మ’ భావన తలకెక్కిన కుర్రవాడు తన తండ్రి గనుక జీతం పెంచమని సమ్మె చేస్తే ఆ సమ్మెను ఎట్టి పరిస్థితిలోనూ బలరచడువిద్య యొక్క ప్రయోజనం ఇప్పుడున్న ప్రపంచంకన్నా మెరుగైన ప్రపంచాన్ని రూపొందించుకోవడం. అలా జరగాలంటే ఇప్పుడున్న ప్రపంచంలోని పరిస్థితుల పట్ల విద్యార్థులకు అసంతప్తి కలగాలి. అప్పుడే వారు దానిని మెరుగుపరిచేందుకు సిద్ధమౌతారు. అలా గాక, ఇప్పుడున్న పరిస్థితుల పట్ల, మరీ చెప్పాలంటే ఇంకా పాతకాలం నాటి పరిస్థితుల పట్ల సంతప్తిని కలిగించి సర్దుబాటు ధోరణిని ప్రోత్సహిస్తే అటువంటి విద్యా విధానం ఒక తిరోగమన దిశ వైపే మనల్ని నడిపిస్తుంది. ఈ నూతన విద్యా విధానం అటువంటిదే.
ఈ విద్యావిధానంలో విద్యార్థులకు వారి ప్రాథమిక హక్కుల గురించి ఏమీ బోధించరు. కేవలం వారి ప్రాథమిక విధుల గురించి మాత్రమే బోధిస్తారు. ఈ విధాన పత్రం మొత్తం మీద ‘లంగివుండడం’ అనే స్వభావాన్ని విద్యార్థులకు ఎక్కించడమనేదే అంతర్లీన సూత్రంగా ఉంది. ఉన్నత తరగతులకు చెందిన విద్యార్థులేమో అధికార పదవులు పొంది అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలకు లంగి వుంటూ వ్యవహరిస్తారు. అటువంటి అవకాశాలేవీ అందుబాటులోకి రాని వెనుకబడిన సామాజిక, ఆర్థిక తరగతుల విద్యార్ధులంతా ఈ వ్యవస్థకు లంగి పడివుండే శ్రామికవర్గంలో చేరుతారు. ఇంకోపక్క నానాటికీ ఉద్యోగావకాశాలు తగ్గిపోతుండడంతో అలా లంగి పడివుండే స్వభావమూ పెరుగుతుంది. ఈ పరిస్థితుల్ని ఎదిరించి పోరాడే మేథోపరమైన శక్తియుక్తులూ సన్నగిల్లుతాయి. ఇదే ఈ నూతన విధాన రూపకర్తల అసలు లక్ష్యం. మన దేశానికేగాదు, ఏదేశానికీ బత్తిగా పనికిరాని విధానం ఇది.

‘సర్దుబాటుకు వీలుండే విధానం’, ‘అందరికీ అవకాశాలు’, ‘విద్యార్థులపై భారం తగ్గించడం’ వంటి పదాల మాటున వాటికి పూర్తి వ్యతిరేకదిశలో ఫలితాలు వచ్చే విధానాలను తీసుకు వస్తున్నారు. ఎక్కువమంది విద్యకు దూరమవడమే గాక, అలాదూరం కావడానికి వారు సర్దుకుపోయే విధంగా తయారు చేయబడతారు. ఇంకోవైపు నుంచి చూస్తే ఈ విధానం ఇంకా బాగా అర్థమౌతుంది. ఇప్పటి పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒకే మూసలో పోసిన చదువు నేర్పడం అవసరం. అదే భూస్వామ్య సమాజంలోనైతే ఎక్కడి వారక్కడే పనుల్లో కుదురుకునేవారు. తమ స్వస్థలాలను వదిలిపెట్టడం అరుదు. కానీ ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థకు ఏ ప్రాంతానికి చెందినవాడైనా ప్రపంచంలో ఎక్కడికైనా పోయి పనిచేయడానికి సిద్ధపడే కార్మికులు కావాలి. అందుకే ప్రపంచమంతటా ఒకే విద్యా విధానం ఉండాలన్న నినాదాన్ని పెట్టుబడిదారులు ముందుకు తెస్తున్నారు (మన పాలకులు మనకు ప్రపంచ స్థాయి విద్యను నేర్పుతామంటూ చెప్పి విద్యావ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు) కానీ స్వతంత్ర భారతదేశం కోరుకున్నది ఈ తరహా విధానం కాదు. ఆయా ప్రాంతాల, తరగతుల ప్రత్యేకతలను, అసమానతలను గ్రహించి వాటిని అధిగమించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని పొందగలగాలి. కానీ నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడికి ఏమేరకు అవసరమో ఆ మేరకు మాత్రమే చదువు నేర్పి, తన దోపిడీని ఎల్లకాలమూ కొనసాగించడానికి వీలుగా ఎలాంటి ప్రతిఘటనా లేని పరిస్థితులను నెలకొల్పడం విద్యా విధాన లక్ష్యంగా ఉంటుంది. ఏయే హక్కులను, అవకాశాలను నిరాకరిస్తున్నదో, ఏయే అంశాలలో ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోజూస్తున్నదో పరిశీలిస్తే అప్పుడు ఈ నూతన విద్యా విధానం అసలు రంగు ఏమిటో బోధపడుతుంది.

-స్వేచ్ఛానుసరణ
ప్రభాత్‌ పట్నాయక్‌