ప్రయివేటు నర్సుల ఇక్కట్లు
మార్గదర్శకాలున్నా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం

సుదీర్ఘపోరాటం తర్వాత నర్సులు సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్న కనీసవేతనం రూ.20 వేల డిమాండ్‌ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిర్లక్ష్యంతో అమలుకు నోచుకోవడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం డాక్టర్‌ జగదీశ్‌ ప్రసాద్‌తో నిపుణుల కమిటీ వేయగా అన్ని అంశాలను పరిశీలించిన కమిటీ ప్రయివేటు ఆస్పత్రుల్లో నర్సుల కనీసవేతనం రూ.20 వేలుగా ఉండాలంటూ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. వీటిని అమలు చేయాలంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి మూడేండ్లు గడిచినా రాష్ట్రంలో అతీగతీ లేకుండా పోయింది. పలుమార్లు నర్సింగ్‌ సంఘాలు అమాత్యులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం రాలేదు. దీంతో రాష్ట్రంలోని ఎమిమిది వేల ప్రయివేటు ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 80 వేల మంది నర్సులు చాలీచాలనీ జీతంతో గడుపుతున్నారు. ఇప్పటికీ ప్రారంభవేతనం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.12 వేలకు మించకపోగా, చిన్నాస్పత్రుల్లో మరీ తక్కువగా ఉంటున్నది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఇప్పటికే ప్రయివేటు ఆస్పత్రుల్లో నర్సులకు కనీసవేతనం రూ.20 వేలుగా అమలు చేస్తున్నది.

తద్వారా ఆయా యాజమాన్యాలను కట్టడి చేసింది. ఢిల్లీ ప్రభుత్వం అమలు ప్రక్రియను మొదలుపెట్టింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా అమలు కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. కాని మన రాష్ట్రంలో ఈ మార్గదర్శకాల అమలులో పురోగతి లేకపోవడంతో కనీసవేతనాల మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మరోసారి గుర్తు చేసినట్టు తెలిసింది.

తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు కనీస వేతనాలను అమలు చేయకపోవడంపై నర్సింగ్‌ యూనియన్లు పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ (ఆరోగ్యం)కు సభ్యులకు ఫిర్యాదు చేశాయి. రాష్ట్రాలు దీన్ని తప్పనిసరిగా అమలు చేసి కనీసవేతనం రూ.20 వేలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది.ప్రయివేటు ఆస్పత్రుల్లో నర్సుల కనీసవేతనాల అమలు నిర్ణయ పరిశీలనను రాష్ట్ర సర్కార్‌ వైద్యుల చేతుల్లో పెట్టింది. అసలు సమస్య ఇక్కడే ఉందని నర్సింగ్‌ సంఘాలు ఆరోపిసు ్తన్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న డాక్టర్లు ఆయా విభాగాలు, వారి సమస్య లనే పరిష్కరించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తుండడంతో దీర్ఘకాలంపాటు నర్సుల కనీసవేతనం ఫైలు పెండింగ్‌లో పడింది.

నిపుణుల కమిటీని నియమించాలంటూ సుప్రీంకోర్టు 2016 జనవరిలో కేంద్రాన్ని ఆదేశిం చింది. ఆ కమిటీ సూచన అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతూ అదే ఏడాది సెప్టెంబర్‌ లో లేఖలు రాసింది. నాటి నుంచి ఇది పరిశీలన దశ నుంచి ముందుకు కదలడం లేదు. వైద్యఆరోగ్యశాఖకు మంత్రులు మారుతున్నా …

దీని అమలుకు మాత్రం చర్యలు తీసుకోకపోవడం గమ నార్హం. ఒకవైపు ప్రభుత్వం నర్సు పోస్టులను భర్తీ చేయడం లేదు. అడపా దడపా ఇచ్చే నోటిఫికేషన్లు కూడా న్యాయవివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఇక మిగిలిన ప్రయివేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ విద్యాలయాల్లో పని చేసే వారికి కనీస వేతనం ఇప్పించేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదని నర్సింగ్‌ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతాధికారులుగా ఎక్కువ మంది డాక్టర్లే ఉండడం, వారే పరిశీలిస్తుండడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నర్సుల సమస్యల పరిష్కారనికి ఒక నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉంటే దీని సాధ్యసాధ్యాలు, అమలులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలతో వెంటనే పరిశీలన పూర్తి చేయడం ద్వారా మార్గం సుగమమయ్యేదని వైద్యనిపుణులు అంటున్నారు.

Courtesy Nava Telangana