– కాశ్మీర్‌లో కేంద్రం ఆంక్షలను సమర్థించటం దురదృష్టకరం : జస్టిస్‌ సావంత్‌ 
– కేంద్రం చర్య వల్ల కాశ్మీరీలు భారత్‌కు వ్యతిరేకంగా ఐక్యమవుతారని వ్యాఖ్య 

జమ్మూకాశ్మీర్‌ లో సమాచార వ్యవస్థతోపాటు మీడియాపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను సమర్థిస్తూ సుప్రీంకోర్టులో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(పీసీఐ) పిటిషన్‌ వేయడం దురదృష్టకరమని జస్టిస్‌ పిబి సావంత్‌ అన్నారు. గతంలో ప్రభుత్వం తరఫున ఈవిధంగా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని పీసీఐ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ సావంత్‌ అన్నారు. 370 అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్‌ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌, మెబైల్‌ఫోన్‌ సేవలపై విధించిన ఆంక్షలు ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనంటూ కాశ్మీర్‌ టైమ్స్‌ ఎడిటర్‌ అనురాధా భాసిన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, దేశ భద్రత, సమగ్రతను కాపాడేందుకే ప్రభుత్వం ఆంక్షలు విధించినట్టు పీసీఐ తరఫున కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు కావడాన్ని జస్టిస్‌ సావంత్‌ తప్పు పట్టారు.

సమాచార వ్యవస్థపై ఆంక్షలు తొలగించాలని, జర్నలిస్టులు ఆ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా భాసిన్‌ తన పిటిషన్‌లో కోర్టును కోరారు. జాతి అభీష్టం మేరకే మీడియా స్వేచ్ఛను పరిమితం చేశారంటూ ప్రభుత్వ చర్యల్ని పీసీఐ సమర్థించింది. అయితే, పీసీఐలోని కొందరు సభ్యులు చైర్మన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు తాను విన్నానని పిబి సావంత్‌ తెలిపారు. చైర్మన్‌ ఏకపక్షంగా లేదా పీసీఐ చైర్మన్‌ హౌదాలో అయినాసరే మీడియాపై ఆంక్షల్ని న్యాయసమ్మతమేనని చెప్పడం దురదృష్టకరమని జస్టిస్‌ పిబి సావంత్‌ అన్నారు. పీసీఐ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రమౌలి కుమార్‌ ప్రసాద్‌ వేసిన పిటిషన్‌ గురించి తమకు తెలియదని కౌన్సిల్‌లోని సభ్యులు జైశంకర్‌గుప్తా, సికె నాయక్‌ చెప్పడం గమనార్హం.

జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హౌదా కల్పించే అధికరణం 370ని రద్దు చేయడం చట్ట విరుద్ధమని కూడా జస్టిస్‌ సావంత్‌ అన్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ సమ్మతి తీసుకోకుండా కేంద్రం రద్దు చేస్తే అది చట్ట విరుద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కాశ్మీరీలంతా భారత్‌కు వ్యతిరేకంగా ఐక్యమవుతారని జస్టిస్‌ సావంత్‌ అన్నారు. 70 ఏండ్లుగా పాకిస్థాన్‌గానీ, ఉగ్రవాదులుగానీ చేయలేనిది కేంద్ర నిర్ణయం వల్ల జరిగిందని ఆయన విమర్శించారు. ఇది పాకిస్థాన్‌కు విజయమైతే, భారత్‌కు ఓటమిలాంటిదని జస్టిస్‌ సావంత్‌ ది వైర్‌ వెబ్‌ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మోడీ సర్కార్‌ నిర్ణయాన్ని దుస్సాహసిక చర్యగా జస్టిస్‌ సావంత్‌ అభివర్ణించారు. జరిగిన నష్టాన్ని పూడ్చడం, కాశ్మీరీల విశ్వాసాన్ని తిరిగి పొందడం సంక్లిష్టమవుతుందని సావంత్‌ అన్నారు.

కాశ్మీరీల గొంతు నొక్కడం విషాదానికి దారి తీస్తుందని సావంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల్ని ఆ రాష్ట్రంలో పర్యటించేందుకు అనుమతించలేదంటే, ప్రభుత్వం తీసుకున్న చర్య చట్ట విరుద్ధమని స్పష్టమవుతోందని జస్టిస్‌ సావంత్‌ అన్నారు. దీంతో, ఆ రాష్ట్రంలో శాంతి,భద్రతలు కనుమరుగైనట్టు అర్థమవుతోందని ఆయన అన్నారు. జస్టిస్‌ సావంత్‌ సుప్రీంకోర్టు జడ్జిగా 1989 నుంచి 1995 వరకు పని చేశారు. 2002లో గుజరాత్‌లో జరిగిన మత హింసపై ఏర్పాటైన ఇండియన్‌ పీపుల్స్‌ ట్రిబ్యునల్‌లోని ముగ్గురు రిటైర్డ్‌ జడ్జిల్లో జస్టిస్‌ సావంత్‌ కూడా ఒకరు. ఆ సమయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రధాని మోడీ అన్నది గమనార్హం.

 

(Courtacy Nava Telangana)