దిల్లీ: మహారాష్ట్రలో మలుపుల రాజకీయానికి తెరపడింది. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన దస్త్రంపై ఆయన సంతకం చేశారు. అంతకుముందు ‘మహా’లో రాష్ట్రపతి పాలన విధించే అంశానికి కేంద్ర కేబినెట్‌ ప్రతిపాదించింది. ఎన్సీపీ మరింత గడువు కోరడంతో రాష్ట్రంలో ఇక రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చిన గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ..  రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారుసు చేస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా ఈ రోజు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో, కేంద్ర కేబినెట్‌ సిఫారసు, మహారాష్ట్ర గవర్నర్‌  నివేదికను అధికారులు రాష్ట్రపతి వద్దకు పంపారు.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలను, అవకాశాలను పరిశీలనలోకి తీసుకొని ఎక్కడా అవకాశాలు కనబడలేదని గవర్నర్‌ తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే, అన్ని పార్టీలతో మాట్లాడిన తర్వాత.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో అవకాశం లేదని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ అంశంపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ముందు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తప్పనిసరి గనక గవర్నర్‌ కార్యాలయం ఇచ్చిన సమాచారం మేరకు ఈ మధ్యాహ్నం కేంద్ర కేబినెట్‌ ప్రత్యేకంగా భేటీ అయి దీనిపై తీర్మానం చేసింది. కేంద్ర కేబినెట్‌ తీర్మానం ప్రతిని, గవర్నర్‌ పంపిన నివేదిక రాష్ట్రపతి భవన్‌కు చేరాయి. పంజాబ్‌ పర్యటన ముగించుకొని దిల్లీ చేరుకున్న రాష్ట్రపతి కోవింద్‌ దీనికి ఆమోద ముద్ర వేశారు. గవర్నర్‌ సిఫారసు, కేంద్ర కేబినెట్‌ తీర్మానంపై రాష్ట్రపతి సంతకం పెట్టడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన అమలులోకి వచ్చినట్టయింది. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఆరు నెలల పాటు సుప్తచేతనావస్థలో ఉండనుంది.

Courtesy Eenadu..