మనలని యుగాలుగా అలరించిన రాగాలను, గీతాలను, సంగీత జలపాతాలను ఎందుకు ప్రదర్శించుకోలేక పోతున్నాం? ఇప్పటికైనా ఈ అద్భుత వాద్య సంపదను సేకరించుకోవాలి. ప్రత్యేక వాద్య ప్రదర్శన శాల ఏర్పాటు చేసుకోవాలి. ఈ అవసరం కోసమే ‘ఆది ధ్వని’ ఏర్పడింది.

ప్రస్తుతం దేశం కోల్పోతున్న మానవీయ వ్యవస్థలలో సంగీతం ఒకటి. మనిషి హృదయ స్పందనలని వ్యక్తం చేసే రాగతాళగాన మాధుర్యం చివరి దశకు చేరింది. హింస, కామ ప్రకోప సంగీతం పెరిగిపోతున్నది. పిల్లలు బాల్యం నుండే అలాంటి చప్పుళ్ళ మధ్య పెరగడం వల్ల వారి జీవనశైలి కృత్రిమతకి దారి తీస్తోంది.

సంగీతం మనసుని తాకాలి. ఆ మనోధర్మ సంగీతం కావాలి. శరీరాల్ని మాత్రమే, అవయవాల్ని మాత్రమే కదిలించేది సంగీతం కాదు. శాస్ర్తీయ సంగీతం మోనాటనీకి చేరింది. దీని నుండి బయటపడాలి. కొత్తది, తాజాది అయిన సంగీతం మనిషిలో, ఇంటిలో, వీధిలో, సమాజంలో నిండిపోవాలి. ఒక మానవీయ, సామూహిక సవ్వడి అత్యవసరం. వాతావరణ కాలుష్యం కన్నా సంగీతంలో ప్రవేశిస్తున్న కాలుష్యం ఎక్కువగా ఉంది.

మన స్థానిక, ప్రాంతీయ, దేశీయ సంగీతాన్ని మనమే గుర్తించడం లేదు. ప్రోత్సహించడం లేదు. దానిని గుండెలకు హత్తుకోలేము – అలా అది నిరాదరణకు గురయ్యింది. సంగీతానికి మూలమైన వాద్యాలు పక్కన పడ్డాయి. ఆ సంగీత కళాకారులు అడ్డా కూలీలుగా మారారు. దేశీయ సంగీతవాద్యాలు తయారు చేసే మనుషులు ఒక్కొక్కరూ నిష్క్రమిస్తున్నారు. ఇది విషాదం. కొన ఊపిరితో ఉన్న వాద్యాలను, సంగీతకారులను బతికించుకోవాలి. పునర్జీవింప చేసుకోవాలి. మానవ, పౌరహక్కుల్లో కళాకారులను చేర్చుకోవాలి. వారి నైపుణ్యాలు సమాజానికి అవసరం. అందుకే వారి కోసం మనం ఉద్యమించాలి.

వారిని బతికించడానికి సమాజం ముందుకు రావాలి. అంటే జానపద ఆదివాసీ ప్రాంతాలలో అంతరించిపోతున్న వాద్యాలకు, కళాకారులను వెంటనే ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. హైదరాబాదులో ఒక్కరోజు ప్రదర్శన ఇప్పిస్తే అవి బతకవు. అడవులు తరిగిపోతుంటే వాద్యాలకు కావలసిన వస్తు సామాగ్రి లభ్యం కావడం లేదు. అటవీ చట్టాలు మనుషులను, కళాసంగీత వ్యవస్థలను ద్వేషిస్తున్నాయి. నేరస్థులుగా చూస్తున్నాయి. డోలుకు చర్మం వాడితే అది అడవి జంతువుదని కేసులు పెడుతున్నారు. అది మరణించిన పశువు చర్మం అని చెప్పినా వినడం లేదు. వారి సంగీత పరికరాలను ఆయుధాలుగా చూపించి కేసులు పెట్టి, వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.

పోడు వ్యవసాయం పేరుతో ఆదివాసీల గూడేలను చిందరవందర చేసి వారి అనేక సంగీత వాద్యాలను వారికి దూరం చేయడం వెనక గల కర్కశత్వాన్ని మనం ఎందుకు ప్రతిఘటించకూడదు. వారి వెచ్చని కన్నీరు ఆగిన బతుకులని గురించి ఎందుకు ఆలోచించవద్దు.

వైవిధ్యభరితమైన, విలక్షణ సంగీత విభాగాలను కాపాడుకోవడం మానవ హక్కు. ముందుగా మన చుట్టూరా ఆవరించిన మన నేల మీద ఎన్ని వాద్యాలు ఉన్నాయో పరికించి చూడ్డం అవసరం. ఇంతవరకు వాటి పేర్ల సమగ్ర పట్టిక కూడా తయారు చేసుకోలేని అశక్తులం.

ఇక వాటిని ఎప్పుడైనా మనం ఒక్కచోట చూశామా? రాజులకి సంబంధించిన టోపీలు, తిన్న కంచాలు, బల్లల్ని చూసి మురిసిపోతాం. మనలని యుగాలుగా అలరించిన రాగాలను, గీతాలను, సంగీత జలపాతాలను ఎందుకు ప్రదర్శించుకోలేక పోతున్నాం? ఇప్పటికైనా ఈ అద్భుత వాద్య సంపదను సేకరించుకోవాలి. ప్రత్యేక వాద్య ప్రదర్శన శాల ఏర్పాటు చేసుకోవాలి. ఈ అవసరం కోసమే ‘ఆది ధ్వని’ ఏర్పడింది. మన రాష్ట్రం మారుమూల గిరిజన ప్రాంతాలలో అజ్ఞాతంగా దాగిపోయిన వాద్యాలను పరిశోధించి తీసుకురావడం జరిగింది. గ్రామసీమలలో ఆగిపోయిన వాద్యసంగీత కేంద్రాలయిన వాద్యాలకు ఊపిరి పోస్తూ వాటిని కాపాడుకుంటూ, కొత్త వాద్యాలను తయారు చేయించడం జరిగింది. అలాంటి కొన్ని వాద్యాలను సేకరించడం కూడా జరిగింది. మొత్తానికి అత్యంత విలువైన తంత్రీవాద్యాలు, ఘనవాద్యాలు, ఊదేవాద్యాలు, చర్మ వాద్యాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రదర్శనలో 124 రకాల వాద్యాలు ఉంటాయి. జానపద ఆదివాసీ అపురూప వాద్య కళాకారులు పది మంది కూడా హాజరవుతారు. ఈ వాద్యాలను చూద్దాం. వీటిని ప్రదర్శనశాలగా మారుద్దాం. ప్రజల కళా సాహిత్యాలకు నీరాజనాలు అర్పిద్దాం.

గూడూరు మనోజ, జయధీర్‌ తిరుమలరావు