‘‘జాతీయత’’ పేరిట పీటీఐ‍ వార్తా సంస్థకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం ద్వారా– దేశవ్యాప్తంగా పీటీఐ అందించే వార్తలపై ఆధారపడే చిన్న చిన్న వార్తా సంస్థలను అదుపులోకి తెచ్చుకోవచ్చన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా అనిపిస్తోంది. ఇలాంటి హేయమైన పన్నాగాలను మేము వ్యతిరేకిస్తున్నాం.

చైనా రాయబారితో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) చేసిన ఇంటర్వ్యూని ‘‘జాతి వ్యతిరేక కథనం’’గా అభివర్ణిస్తూ, పీటీఐ వార్తా సంస్థతో తెగదెంపులు చేసుకోబోతున్నట్టు ప్రసార భారతి ఇటీవల ప్రకటించింది. పీటీఐకి ఇలా దురుద్దేశాలు ఆపాదించడం వెనుక మొత్తం మీడియాను తన అదుపులోకి తెచ్చుకోవాలన్న ప్రభుత్వ వ్యూహం ఉన్నదని ఆరోపిస్తూ ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా’ అధ్యక్ష కార్యదర్శులు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం ఇది.

ప్రెస్‌ ట్రస్ట్‌ ఆఫ్ ఇండియా (పీటీఐ) తన పనితీరుతో భారత దేశపు ప్రతిష్టాత్మక న్యూస్ ఏజెన్సీగా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం పీటీఐను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ పనికి ఆయుధంగా ప్రభుత్వం తన ప్రతినిధి సంస్థ అయిన ప్రసార భారతి (పీబీ)ని వాడుకుంటోంది.

పీటీఐ సంస్థకు స్వతంత్ర భారతానికి ఉన్నంత వయసు ఉంది. అది ఒక లాభరహిత సంస్థగా పని చేస్తుంది. దాని బోర్డులో సభ్యులుగా దేశంలోని ప్రఖ్యాత స్వతంత్ర (ప్రైవేటు) వార్తా సంస్థలకు చెందిన వ్యక్తులు ఉంటారు. సంస్థ ఇప్పటిదాకా వార్తా సేకరణలో ఒక స్పష్టమైన సమతూకాన్ని పాటిస్తూ వచ్చింది. ఆ విధంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు, దేశంలోని మారుమూల ప్రదేశాలకూ తమ ప్రతినిధులను పంపే అవకాశం లేని ఎన్నో పత్రికలకు, వార్తా సంస్థలకు విశ్వసనీయమైన సంస్థగా పీటీఐ మారింది.

ప్రసార భారతి మాత్రం దేశంలోని ప్రజా ప్రయోజన వార్తా సంస్థగా తన బాధ్యతలను నిలబెట్టుకోలేకపోయింది. 1997లో ఆ సంస్థ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడినప్పుడు ఆ బాధ్యత దానికి సంక్రమించింది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలను పర్యవేక్షించే ఈ సంస్థకు సర్వ స్వతంత్ర అధికారాలు ఉన్నాయి. అయినప్పటికీ అది కేంద్ర ప్రభుత్వానికి జేబు సంస్థగా మారిపోయింది.

పీటీఐకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన చర్య విషయానికొద్దాం. న్యూఢిల్లీలోని చైనా రాయబారిని ఇంటర్వ్యూ చేసే విషయంలో పీటీఐ పూర్తి వృత్తి నిబ ద్ధతతో వ్యవహరించింది. ఇతర మీడియా సంస్థలన్నిటికంటే చురుకుగా వ్యవహరించింది. చైనా–-భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూ ఎంతో విలువైన సమాచారాన్ని రాబట్టింది. ఇంత కష్టపడినందుకు ఇప్పుడు పీటీఐ‍ ‘‘జాతి ప్రయోజనాలకు నష్టదాయకంగా’’ వ్యవహరించిందన్న ఆరోపణలను ప్రసార భారతినుంచి ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాని ఆరోపణ. ఏది ‘‘జాతి ప్రయోజన’’మన్నది తనకే తెలిసినట్టు నిర్వచనాలిస్తూ, ఏది వార్త ఏది కాదు అన్న తీర్పులకు పాల్పడుతూ ప్రసార భారతి నియంతృత్వ పోకడలను అనుకరిస్తోంది. ఎవరూ ఎప్పుడూ వినని ‘ప్రసార భారతి వార్తా సంస్థ’ (ప్రసార భారతి న్యూస్ సర్వీస్-– పీబీఎన్‌ఎస్) పేరిట ఒక లేఖ జారీ చేసింది.

కొన్నేళ్ళుగా ప్రభుత్వం తీరు గమనిస్తే అది తమకు నచ్చిన వ్యక్తులను కీలక స్థానాల్లో నియమించటం ద్వారా పీటీఐను అదుపులోకి తెచ్చుకోజూస్తున్నట్టుగా అనిపిస్తోంది. కానీ పీటీఐ బోర్డు ఈ ప్రయత్నాలను సాగనివ్వలేదు. ప్రస్తుత చర్యను ప్రభుత్వం ముందే నిర్దేశించుకున్న కుట్రలో ఒక భాగంగా చూడవచ్చు. ఈ లేఖను బట్టి పీబీఎన్‌ఎస్ ఇక పీటీఐ నుంచి తన చందాను ఉపసంహరించుకోబోతోందని స్పష్టం చేసిందనే అనుకోవాలి. పీటీఐ‌ను ఆర్థికంగా కుదేలు చేయాలన్నదే దీని వెనుక ఉద్దేశం. పీటీఐ బోర్డు ఈ పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించాలనీ, పీటీఐ మర్యాదను నిలబెట్టే దిశగా చర్యలు తీసుకోవాలనీ ఆ లేఖ పేర్కొన్నది.

ప్రభుత్వం ఒక ప్రక్క పీబీఎన్‌ఎస్ సంస్థను వృద్ధిలోకి తెచ్చి క్రియాశీలంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. మరో పక్క చిన్నచిన్న ప్రైవేటు వార్తా సంస్థలపై ఒత్తిడి తెచ్చి వాటిని ప్రజా ప్రయోజనాలకు గాక ప్రభుత్వ ప్రయోజనాలకు అనుకూలంగా మలిచే అవకాశం ఉంది. చైనా రాయబారితో ఇంటర్వ్యూపై ప్రసార భారతి తన అసంతృప్తిని వెళ్ళగక్కటమన్నది ప్రభుత్వానికి అక్కరకొSun Weidongచ్చిన ఒక సాకు మాత్రమే. ప్రస్తుత ప్రభుత్వం మీడియాపై పూర్తి ఆధిపత్యాన్ని స్థిరపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నదని విలేకర్ల సమాజమంతా భావిస్తున్నది. కొందరు విలేకర్లపైనా, వార్తా సంస్థలపైనా గురిపెట్టి వారిపై చట్టపరమైన ఒత్తిడులను తీసుకురావటం ద్వారా మొత్తం మీడియాను అదుపులోకి తెచ్చుకోవటానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం ‘‘జాతీయత’ పేరిట పీటీఐ‍ వార్తా సంస్థకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం ద్వారా– దేశవ్యాప్తంగా పీటీఐ అందించే వార్తలపై ఆధారపడే చిన్న చిన్న వార్తా సంస్థలను అదుపులోకి తెచ్చుకోవచ్చన్నది వారి ఆలోచనగా అనిపిస్తోంది. ఇలాంటి హేయమైన పన్నాగాలను మేము వ్యతిరేకిస్తున్నాం.

ఆనంద్ కె. సాహే (అధ్యక్షుడు)
అనంత్ బగైత్కర్ (సెక్రటరీ జెనరల్) ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా

Courtesy AndhraJyothy