– ఫిబ్రవరి 25 వరకు బిశ్వాల్‌ కమిటీ గడువు పెంపు
– ఇప్పటికే సిద్ధమైన నివేదిక
– ఫిట్‌మెంట్‌పైనే మల్లగుల్లాలు
– మాంద్యం నేపథ్యంలో 25శాతంలోపే
– ఉద్యోగుల్లో అసంతృప్తి

– హైదరాబాద్‌. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరోసారి నిరాశకు గురయ్యారు. వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ) కమిటీ నివేదిక గడువు మరో ఆర్నెల్లు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే 2020, ఫిబ్రవరి 25వ తేదీ వరకు పీఆర్సీ కమిటీ గడువును పెంచింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో పీఆర్సీ ఇప్పట్లో లేనట్టేనని అర్థమవుతున్నది. వచ్చేఏడాది ఫిబ్రవరి వరకు గడువు పెంచడంతో కొత్త బడ్జెట్‌లోనే వేతన సవరణ ఉండే అవకాశమున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈనెల 10న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పందించి పీఆర్సీ నివేదికను 10 నుంచి 12 రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఇక పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అందుతుందని అందరూ భావించారు. ఇంతలోనే గుట్టుచప్పుడు కాకుండా పీఆర్సీ కమిటీ గడువును ఆర్నెల్లు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి జీవోనెంబర్‌ 3006ను ఈనెల 19న జారీ చేశారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తే ఉద్యోగుల నుంచి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని గోప్యత పాటించింది. పది రోజుల తర్వాత ఈ ఉత్తర్వులు బయటికి రావడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే 17 నెలలు ఆలస్యం
2018, జులై 1 నుంచి తెలంగాణలో తొలి పీఆర్సీ అమలు కావాలి. ‘2018, జూన్‌ 2న మధ్యంతర భృతి (ఐఆర్‌), ఆగస్టు 15న పీఆర్సీ ప్రకటిస్తాం’అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు 2018, మే 16న ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల సమావేశం అనంతరం ప్రకటించారు. 2018, జూన్‌ 2న ఐఆర్‌ ప్రకటించలేదు. 2018, ఆగస్టు 15న పీఆర్సీ రాలేదు. ఇంకోవైపు పీఆర్సీ నివేదికను త్వరగా రూపొందించాలని ఏకసభ్య కమిషన్‌ నుంచి త్రిసభ్య కమిషన్‌ను వేస్తామని సీఎం వెల్లడించారు. అందులో భాగంగానే 2018, మే 18న పీఆర్సీకి త్రిసభ్య కమిటీని నియమించారు. మాజీ ఐఏఎస్‌ అధికారులు సిఆర్‌ బిశ్వాల్‌, సి ఉమామహేశ్వరరావు, రఫత్‌అలీలను పీఆర్సీ కమిటీ సభ్యులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘాలతో ఆ కమిటీ చర్చించింది. వివిధ శాఖలు ముఖ్యంగా ఆర్థిక శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించింది. ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలతో పీఆర్సీ నివేదికను కమిటీ సిద్ధం చేసినట్టు తెలిసింది. కానీ పీఆర్సీ కమిటీ గడువును ప్రభుత్వం ఆర్నెల్లు పొడిగించింది. పీఆర్సీ అమలు ఇప్పటికే 17 నెలలు ఆలస్యమైంది. ఇంకా ఎంత కాలం ఆలస్యమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇప్పటికే అమలవుతున్నది. కానీ ఇక్కడ ఐఆర్‌ లేదు, పీఆర్సీ ఊసేలేదు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
ఫిట్‌మెంట్‌పైనే అందరిచూపు
63 శాతం ఫిట్‌మెంట్‌ కావాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ కమిటీకి ప్రతిపాదించాయి. అయితే పీఆర్సీ కమిటీ ఎంత ఫిట్‌మెంట్‌ ప్రతిపాదిస్తుందన్న దానిపైనే అందరి చూపు పడింది. దేశంలో, రాష్ట్రంలో ఆర్థికమాంద్యం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి వచ్చే రాబడులపై ప్రభావం పడింది. ఆర్థిక శాఖ అధికారులతో నిత్యం పీఆర్సీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నది. మాంద్యం నేపథ్యంలో కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఫిట్‌మెంట్‌ 25 శాతంలోపే ప్రతిపాదించే అవకాశమున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీఆర్సీ కమిటీ నివేదికపై ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి ఫిట్‌మెంట్‌ను పెంచే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.62 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పింఛనర్ల చొప్పున 5.29 లక్షల మంది ఉన్నారు. వారికి ఒక శాతం ఫిట్‌మెంట్‌ పెంచితే రూ.250 కోట్లు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే రూ.6,250 కోట్లు, 30 శాతం ఇస్తే రూ.7,500 కోట్లు, 35 శాతం ఇస్తే రూ.8,750 కోట్లు, 40 శాతం ఇస్తే 10 వేల కోట్లు, 45 శాతం ఇస్తే రూ.11,250 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదో పీఆర్సీ కమిటీ 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసింది. ఏపీ విభజన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేశారు. ఈ నేపథ్యంలో గత పీఆర్సీ కంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ ప్రకటిస్తారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆశగా ఉన్నారు. ఇంకోవైపు ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 61 ఏండ్లకు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. పీఆర్సీ కమిటీ ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏండ్లకు పెంచాలని సిఫారసు చేసే అవకాశమున్నది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పీఆర్సీపై చర్చ జరుగుతుందని ఉద్యోగులు ఆశించారు.

Courtesy Navatelangana…