•  హైదరాబాద్‌ ఆర్యవైశ్య సత్రంలో ఎలుకల మందు తిని బలవన్మరణం
  • న్యాయవాదిని కలిసేందుకు హైదరాబాద్‌కు
  • కారులో కూతురు ఫొటోలు చూస్తూనే రాక
  • ఆర్యవైశ్య మహాసభ సత్రంలో అద్దెకు గది
  • గారెల్లో ఎలుకల మందు కలిపి తిని మృతి
  • మృతదేహం పక్కన సూసైడ్‌ నోట్‌ లభ్యం
  • అమ్మ వద్దకు రావాలంటూ అమృతకు విన్నపం
  • ఉరిశిక్ష తప్పదేమోనని తీవ్ర ఆందోళన
  • సోదరుడు, సుపారీ హంతకుల వేధింపులు?
  • ఆత్మహత్యకు కారణాలు ఇవేనా?
  • ప్రణయ్‌ను చంపించడంపై పశ్చాత్తాపంతోనే కావొచ్చు: అమృత

ఖైరతాబాద్‌, నల్లగొండ, మంగళ్‌హాట్‌, మిర్యాలగూడ టౌన్‌ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, తన కూతురు అమృత భర్త ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరునగరి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య మహాసభ సత్రం గదిలో ఆదివారం ఉదయం అతడు విగతజీవిగా పడివుండగా కనుగొన్నారు. గారెల్లో ఎలుకల మందు కలుపుకొని తిని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. భార్య గిరిజను క్షమించమని వేడుకొంటూ కూతురు అమృతను అమ్మ వద్దకు వెళ్లాలని కోరుతూ సూసైడ్‌ నోట్‌ రాశాడు. పోలీసులు, ఆర్యవైశ్య సత్రం సిబ్బంది, మారుతీరావు కారు డ్రైవర్‌ రాజేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాయవాదిని కలిసేందుకు శనివారం సాయంత్రం 6:40 గంటలకు మిర్యాలగూడ నుంచి తన కారులో మారుతీరావు హైదరాబాద్‌కు బయలుదేరాడు. మధ్యలో ఎక్కడా వాహనాన్ని ఆపొద్దని డ్రైవర్‌ రాజేశ్‌కు చెప్పాడు. దారిపొడవునా కూతురు అమృత ఫొటోలను చూస్తూ ఉండిపోయాడు.

చింతలబస్తీలోని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యాలయం వద్ద కారును ఆపి.. ముందుగా బుక్‌ చేసుకున్న పైఅంతస్తులోని 306 నంబరు గదిలోకి వెళ్లాడు. కొద్దిసేపటికి తర్వాత బయటకు వచ్చిన ఆయన, తాను తినేందుకు హోటల్‌ నుంచి గారెలను, అలాగే కారులో ఉన్న కోర్టు పేపర్లను తీసుకురావాలని రాజేశ్‌కు పురమాయించి తెప్పించుకున్నాడు. గారెలు తిన్న అనంతరం రాజేశ్‌ను కారులోనే పడుకోమని చెప్పి తాను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఒకసారి, తిరిగి 7.30 గంటల ప్రాంతంలో మరోసారి రాజేశ్‌ గది తలుపులు తట్టగా మారుతీరావు తీయలేదు. ఆ సమయంలోనే భార్య గిరిజ ఫోన్‌ చేసినా మారుతీరావు ఎత్తలేదు. డ్రైవర్‌ రాజేశ్‌కు ఆమె ఫోన్‌ చేసి చెప్పడంతో అతడు, సత్రం రిసెప్షన్‌ కౌంటర్‌లో ఉన్న రిసెప్షనిస్ట్‌కు విషయం చెప్పాడు. ఇద్దరూ వెళ్లి తలుపులు గట్టిగా బాదినా తీయకపోవడంతో ఆర్యవైశ్య మహాసభ నిర్వాహకులకు, పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు వచ్చి గది తలుపులను తెరిపించి చూడగా అప్పటికే లోపల బెడ్‌పై మారుతీరావు చలనం లేని స్థితిలో కనిపించాడు. వెంటనే అతడిని 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ఽధ్రువీకరించారు. శనివారం రాత్రే మారుతీరావు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా మిర్యాలగూడ లాయర్లతో పనికాదని హైదరాబాద్‌లో సీనియర్‌ న్యాయవాదిని కలిసేందుకు ప్రత్యేకంగా వచ్చిన మారుతీరావు, లాయర్‌ను కలవకుండానే ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గదిలో సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో ‘గిరిజా క్షమించు. అమృతా..  అమ్మ దగ్గరకు రా’ అని రాసివుంది. గదిలో తనీఖీ చేసిన పోలీసులు.. అతడి సెల్‌ఫోన్‌, బట్టలు, అతడి కారుకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

అతడు విషం తాగినట్లుగా గదిలో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. అయితే, మారుతీరావు వాంతి చేసుకున్నట్లు గుర్తించిన క్లూస్‌టీమ్‌.. ఆ నమూనాలను పరీక్షల కోసం సేకరించారు. మారుతీరావు తోడల్లుడు, కొత్తపేటకు చెందిన రఘు.. కుటుంబసభ్యులతో కలిసి ఘటనాస్థలికి వచ్చారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అక్కడ భర్త మృతదేహాన్ని చూసి గిరిజ సొమ్మసిల్లి పడిపోయారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన ఆమె.. గుండెలవిసేలా రోదించారు.

భార్య అనుమానించినట్లుగానే..
మారుతీరావు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడని అతడి భార్య గిరిజ ముందే అనుమానించారా? కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు దీన్నే చెబుతున్నాయి. ప్రణయ్‌ హత్యకేసు చివరి దశకు చేరుకోవడం, మిర్యాలగూడ కోర్టులో అతడి తరఫున వాదిస్తున్న న్యాయవాదులు తమ చేతిలో ఏమీ లేదని, తీర్పు అతడికి వ్యతిరేకంగా రావొచ్చునని పేర్కొనడంతో మారుతీరావు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. పైగా ఇటీవలే మారుతీరావుకు చెందిన పాత షెడ్డులో ఓ మృతదేహం కనిపించింది. ఈ నేపథ్యంలో భార్య గిరిజ కొన్నాళ్లుగా అతడిని దగ్గరగా గమనిస్తున్నారు. ఇంట్లోంచి అతడు బయటకు వెళితే తరచూ ఫోన్లు చేస్తూ ఎక్కడున్నారని అడిగి తెలుసుకొనేవారు. అందులో భాగంగానే ఆదివారం ఉదయం ఆరింటికే భర్తకు  ఫోన్‌చేశారు.

ఉరి తప్పదేమోననే ఒత్తిడితోనే..
కూతురు అమృత ప్రేమ వివాహం ఇష్టం లేని మారుతీరావు, 2018 సెప్టెంబరు 14న ఆమె భర్త ప్రణయ్‌ని కిరాయి హంతకులతో హత్యచేయించాడు. ఈ కేసులో పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లాడు. ఆర్నెల్ల క్రితం బెయిల్‌పై బయటకొచ్చాడు. అప్పటి నుంచి తనను కేసు నుంచి విముక్తి కోసం కూతురుతో అతడు రాయబారాలు సాగిస్తున్నట్లు సమాచారం. సహకరిస్తే ఆస్తిని తన పేర రాస్తానని చెప్పించినా అమృత ససేమిరా అన్నట్లు తెలిసింది. ప్రణయ్‌ హత్య అనంతరం పరిణామాలతో కుటుంబసభ్యుల మధ్య స్పర్థలు ఏర్పడటం, రాజీ కోసం కూతురు సహకరించకపోవడం, రక్తసంబంధీకులంతా దూరమవడం, సమాజంలో ఛీత్కారాలతో మారుతీరావు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. వీటన్నింటికన్నా గతకొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలే అతడిని మరింత ఒత్తిడికి గురిచేశాయని అంటున్నారు.

ప్రణయ్‌ హత్య కేసులో నల్లగొండ పోలీసులు పూర్తి ఆధారాలను సేకరించి బలమైన కేసులు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక కోర్టు శరవేగంగా విచారణ చేస్తోంది. గత నెల చివరి వారంలో చార్జిషీట్‌ దాఖలు చేయగా, ఈనెల 3న దానికి సంబంధించిన నోటీసులు మారుతీరావుకు అందాయి. ఈ క్రమంలోనే కేసు నుంచి బయటపడేందుకు అతడు ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే మిర్యాలగూడలో న్యాయవాదులు చార్జిషీట్‌ను పరిశీలించిన అనంతరం, కేసు నుంచి బయటపడటం కష్టమని, ఉరిశిక్ష కూడా పడొచ్చని చెప్పడంతో మారుతీరావు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఇటీవల కోర్టులోనే న్యాయవాది ఎదుట అతడు విలపించగా, కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేద్దామని ఓదార్చినట్లు సమాచారం.  కాగా ప్రణయ్‌ హత్య అనంతర పరిణామాలతో కుటుంబంలో కలతలు నెలకొన్నాయని.. అతడి కారణంగా  ఇంట్లోని పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదరడడం లేదని, సమాజంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అతడి సోదరుడు శ్రవణ్‌ ఆరోపించినట్లు తెలిసింది.

సోదరుడితో అతడికి ఆస్తి తగాదాలు కూడా ఉన్నట్లు సమాచారం. కోర్టు ఖర్చుల కోసం ఆస్తులను విక్రయించేందుకు సిద్ధపడినా ఎవ్వరూ ముందుకు రాలేదని సమాచారం. రూ.50 వేల కోసం తాను ఇబ్బంది పడుతున్నానని, పలువురు మిత్రులతో అతడు తన బాధను వ్యక్తం చేశాడు. కాగా  మారుతీరావు సోదరుడు నాగేందర్‌దీ ఈ తరహా విషాదాంతమే. సివిల్‌ సప్లయి సబ్‌ కాంట్రాక్టరుగా పనిచేసిన ఆయన 1987లో విజయవాడలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగుమారిన శరీరం
ఉస్మానియా ఫోరెన్సిక్‌ విభాగం వైద్యులు డాక్టర్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో మారుతీరావు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని భార్య గిరిజకు అప్పగించారు. మారుతీరావు మృతదేహం రంగు మారడాన్ని గుర్తించి, అతడు ఎలుకల మందు తిని మృతి చెందినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు భావిస్తున్నారు. ఎలుకల మందు కారణంగా మృతి చెందిన వారి శరీరం ఎలా అవుతుందో మారుతీరావు బాడీ కూడా అలానే మారిపోయినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు పేర్కొన్నారు. అయితే నివేదిక వచ్చిన తర్వాతే అతడు ఎలా చనిపోయాడనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. కాగా మారుతీరావు ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నామని సైఫాబాద్‌ సీఐ చింతల సైదిరెడ్డి చెప్పారు. విషం తీసుకోవడంతోనే చనిపోయాడా? మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఆస్తి బదలాయించాలని సోదరుడు శ్రవణ్‌ ఒత్తిడి
ఆస్తుల విషయంలో మారుతీరావుతో అతడి సోదరుడు శ్రవణ్‌ ఘర్షణపడినట్లు తెలిసింది. అకారణంగా తననూ హత్యకేసులో ఇరికించి జీవితాన్ని నాశనం చేశావని, ఒక్కగానొక్క కూతురు దూరం కావడంతో ఆస్తులనంతా తన పేరిట బదలాయించాలని మారుతీరావుపై శ్రవణ్‌ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే జైల్లో ఉన్నప్పుడే మారుతీరావు తన ఆస్తుల్లో కొంత భాగాన్ని భార్య గిరిజ పేరుమీదకు బదలాయించాడు. ఆగ్రహించిన శ్రవణ్‌ జైల్లోనే అతడిపై పలుమార్లు భౌతిక దాడులు చేసినట్లు తెలిసింది. ఇక ప్రణయ్‌ హత్యకు సుపారీ తీసుకున్న సుభాష్‌ శర్మ, అస్గర్‌ అలీ, అబ్దుల్‌ బారీ తరఫువారి నుంచి డీల్‌ కుదుర్చుకున్న డబ్బుల కోసం మారుతీరావుపై వేధింపులు పెరిగినట్లు తెలిసింది.

మారుతీ రావుతో మాటల్లేవు: శ్రవణ్‌
మారుతీరావుకు తనకు మధ్య ఆస్తి వివాదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సోదరుడు శ్రవణ్‌ పేర్కొన్నాడు. ఉస్మానియా మార్చురీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడాడు. షేర్ల విషయంలో మారుతీరావుకు తనకు మధ్య గొడవ జరిగినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందన్నాడు. నిరుడు మే 15 నుంచి మారుతీరావుతో తనకు మాటల్లేవని చెప్పాడు. మొదటి నుంచి ఎవరి ఆస్తులు వారి పేర్లపైనే ఉన్నాయన్నాడు.

అంత్యక్రియలకు కూతురు దూరం
మారుతీరావు అంత్యక్రియలు సోమవారం మిర్యాలగూడలో జరగనున్నాయి. అంత్యక్రియలకు కూతురు అమృత దూరంగానే ఉండనుంది. మారుతీరావు అంత్యక్రియలను భార్య గిరిజ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమృత ఇంటి వద్ద ఐదుగురు సిబ్బందితో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా అమృత ఇంటికి వెళ్లి మీడియా పలకరించగా.. ఆమె ముక్తసరిగా స్పందించింది. మీడియా ద్వారానే తనకు తండ్రి ఆత్మహత్య వార్త తెలిసిందని పేర్కొంది. ప్రణయ్‌ ని హత్య చేయించడంతో పశ్చాత్తాపం (రిగ్రెట్‌) చెంది ఉంటాడని.. అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అభిప్రాయపడింది.

Courtesy Andhrajyothi