విద్యుత్‌ అధికారుల వివక్ష : కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరంజ్యోతి
జాతీయ రహదారిపై బైటాయింపు

వడ్డేపల్లి : గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని పైపాడు గ్రామ దళితులపై విద్యుత్‌ శాఖ అధికారులు వివక్ష చూపారని కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.పరంజ్యోతి అన్నారు. దళిత కాలనీకి కరెంట్‌ చేయడాన్ని నిరసిస్తూ కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం దళితులు జాతీయ రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైపాడు గ్రామానికి చెందిన దాదాపు 50 దళిత కుటుంబాల ఇండ్లకు ఐదు రోజుల కిందట ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా కరెంట్‌ సరఫరా నిలిపేశారని తెలిపారు. అప్పటి నుంచి చీకటిలోనే మగ్గుతున్నారని వాపోయారు. ఓ వైపు పిల్లలకు ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతుండగా.. మరోవైపు వర్షాల నేపథ్యంలో కరెంట్‌ బంద్‌ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేద న్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపై బైటాయించామన్నారు. విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. దళితులపై వివక్ష చూపే అధికారులపై చర్యలు తీసుకుని మీటర్లు బిగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ విజరు కుమార్‌, పోలీసులు అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.

Courtesy Nava Telangana