ఒక కులం నెత్తిన మరొక కులాన్ని కూర్చోబెట్టి సమాజాన్ని నిలువునా చీల్చి ఏ వొక్క కులం మరొక కులంతో కలవకుండా అడ్డుగోడలు కట్టి బ్రాహ్మణవాదం అంతిమంగా తన పబ్బం గడుపుకుంటుంది. ఆధిపత్య కులాల చేత బానిసలుగా, అంటరానివారుగా చూడబడుతున్నప్పటికీ వారి మధ్య మనువు నిర్మించిన గోడలు పీడితులను ఒక్కటిగా కలపలేకపోయాయి. అణగారిన కులాల నుంచి వొచ్చిన సంస్కర్తలు బ్రాహ్మణీయ విలువల పైన వాటి వెనుక ఉండే సైద్ధాంతిక పోకడలపైన యుద్ధం చేశారు. 17 శతాబ్దానికి చెందిన పోతులూరి వీరబ్రహ్మం అటువంటి సామాజిక తత్వవేత్తలలో ఒకరు.

కుల వ్యవస్థను పకడ్బందీగా స్తిరీకరింప జేసుకోడానికీ, తమ ఆధిక్యతను నిరాటంకంగా కొనసాగాడానికీ లెక్కలేనన్ని కట్టుకధలతో అష్టా దశ పురాణాలను బ్రాహ్మణులు రాసుకున్నారు. వాటిపై కౌంటర్ డిస్కోర్స్ గా వచ్చిన కుల పురాణాలు కింది కులాలలో కొంత ఆత్మగౌరవం కలిగించినప్పటికీ అవి కూడా ఏదో ఒక మేర ఆ కులాల్లో కూడా ‘జంధ్యం’ కోసం తపనపడేట్టు చేశాయి. ఆయా కింది కులాలను ఒకటిగా ఐక్య పరచడం గానీ వివిధ కులాల మధ్య ఉండే అంతరాల దొంతరలను బద్దలు చెయ్యడం గానీ వాటి లక్ష్యం కాదు. అందుకే ఆ కుల పురాణాలు కింది కులాల్లో మరొక రకమైన అంతరాల పొరలు పేర్చడం వాటి పరిమితి అనుకోవాలి. బ్రహ్మం గారు తన సామాజిక అస్తిత్వాన్ని ‘విశ్వకర్మ’ అని ప్రకటించడం నిజానికి తన కులపు శ్రమ తత్వాన్ని చాటే ఒక ఆత్మగౌరవ ప్రకటన లాంటిదే అని ఎవరికైనా అర్ధమౌతుంది. దీనికి పెద్ద పెద్ద సిద్ధాంతాలతో పనిలేదు.

వినోదిని ‘వేగు చుక్కలు’ పుస్తకం అన్నమయ్య, వేమనలతో పాటు పోతులూరి వీరబ్రహ్మం ని కూడా కుల వ్యవస్థపై తాత్విక రంగంలో పోరాడిన సామాజిక తత్వవేత్తగా అభివర్ణించింది. ఆయన కులస్తులు మాత్రం బ్రాహ్మణ వాదంపై పోరు చేసిన బ్రహ్మం గారిని స్వంతం చేసుకోకపోవడం మళ్ళీ బ్రాహ్మణవాద విజయమే అనుకోవాలి. సమత కోసం కొట్లాడిన ఆయన్ని వినోదిని ‘వేగుచుక్క’ అనుకుంటే పాపం ఆయన కులస్తులు ‘జంధ్యం పోగు’ గా భావిస్తూ ఆమె వారి సామాజిక హోదాని తగ్గించే ప్రయత్నం చేసిందని నొచ్చుకోవడం పెద్ద విషాదం.

వినోదిని పోతులూరి వీరబ్రహ్మం పై పరిశోధనాత్మక పుస్తకం రాసినట్టు ఆమెపై దాడి చేసే విశ్వ బ్రాహ్మణ కులస్తులు కూడా ఆమె వాదాన్ని తిప్పికొడుతూ పుస్తకమో, వ్యాసమో రాస్తే ప్రజాస్వామికంగా ఉంటుంది. ఆ పని చెయ్యకుండా ఆమెని అసభ్యకరమైన పదాలతో నిందించడం వారి పిరికితనం.
వినోదిని వంటరి కాదు.

Challapalli_swarooparani