– 96శాతం మందికి ఏ రూపంలోనూ అందని సాయం
– పోక్సో కేసుల నివేదికపై సుప్రీంకోర్టు విస్మయం
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసుల్లో మైనర్‌ బాధితుల్లో ఒక శాతం మందికి మాత్రమే పరిహారం లభిస్తున్నది. చట్టం, పథకం ఉన్నప్పటికీ.. 99శాతం మందికి ఎలాంటి ఆర్థిక సహాయమూ అందటంలేదు. అదేవిధంగా, మైనరు బాధితుల్లో 96 శాతం మందికి ఏ రూపంలోనూ సహాయం అందటంలేదు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) రూపొందించిన పోక్సో చట్టం కింద లైంగికదాడి, అసహజ లైంగిక వేధింపులకు గురైన మైనర్లకు కనీసం రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలి. అసహజ సందర్భాల్లో తక్షణ ఆర్థిక సహాయం తప్పనిసరి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పథకం కింద మధ్యంతర పరిహారాన్ని కూడా చెల్లించాల్సి వుంది. అయితే, 99శాతం మందికి తాత్కాలిక పరిహారం కూడా చెల్లించటంలేదని జాతీయ సర్వే తెలిపింది. పోక్సో కేసులపై సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ సురీందర్‌ ఎస్‌ రతి సమర్పించిన నివేదికను ప్రస్తావిస్తూ.. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోరు నేతత్వంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఈ నివేదిక తెరపైకి తెచ్చిన గణాంకాలు పూర్తిగా నిరాశపరిచాయని తెలిపింది.

పూర్తిగా చట్ట ఉల్లంఘన జరిగినట్టు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ‘ఈ నివేదిక దిగ్భ్రాంతికరమైన పరిస్థితిని ప్రతిబింభిస్తున్నది. కేసుల విచారణపై ఏం మాట్లాడాలి? 20శాతం కేసుల్లో దర్యాప్తు ఏడాదిలోపు కూడా పూర్తికాలేదు.
వాస్తవానికి, ఏ రకమైన సహాయం అందటంలేదు, బాధితులకు పరిహారం కూడా చెల్లించలేదు. మూడింట రెండొంతుల కేసులు ఏడాదికిపైగా విచారణలో వున్నాయి’ అని ధర్మాసనం పేర్కొంది. పోక్సో చట్టం క్రింద అందించిన కాలపరిమితి ప్రతి దశలోనూ ఉల్లంఘనకు గురవుతున్నదనీ, దీనికి ఒక ప్రధాన కారణం అవగాహన లేకపోవడం, దర్యాప్తు పూర్తికి అంకితభావం కొరవడటంమని ధర్మాసనం అభిప్రాయపడింది. న్యాయస్థానాల సంఖ్య కూడా తగినన్ని లేకపోవటంవల్ల ఈ చట్టం కింద విచారణ పూర్తి కావడానికి నిర్దేశించిన కాలానికి మించి కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది.
పోక్సో చట్టం కింద విచారణను నిర్దేశించిన కాలపరిమితిలో పూర్తయ్యేలా చూడడానికి ”మరింత చురుకైన” పాత్ర పోషించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోక్సో కేసులకు అధిక ప్రాధాన్యత నిచ్చేలా అంకితమైన న్యాయస్థానాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తద్వారా నిర్దేశిత వ్యవధిలో చార్జిషీట్లు దాఖలవుతాయి, తగిన కాలపరిమితిలోనే విచారణలు పూర్తవుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అలాగే తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను వెంటనే సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అలాగే దీనిపై జస్టిస్‌ దీపక్‌ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబరు 12న విచారణ జరుపుతుందని న్యాయస్థానం తెలిపింది.

Nava telangana…