న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో పేదల కుటుంబాలలో ఆహార వ్యయం గణనీయంగా తగ్గిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆహారం, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, పొగాకు, కమ్యూనికేషన్లు, వినోద కార్యకలాపాలు, వ్యక్తిగత ఖర్చుల వంటి వాటిపై వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్రం తాజాగా విడుదల చేసిన నేషనల్‌ అకౌంట్స్‌ స్టాటిస్టిక్స్‌ ద్వారా తెలుస్తోంది. 2016-17లో ఈ కుటుంబ వ్యయం రు.5 లక్షల కోట్లుగా నమోదు కాగా, 2017-18లో ఇది 4.8 లక్షల కోట్లకు పడిపోయినట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. ప్రొటీన్లు సమృద్ధిగా వుండే పాలు, చీజ్‌, గుడ్ల వంటి ఉత్పత్తుల వ్యయం కూడా 12 శాతం మేర (రు.3.7 లక్షల కోట్లు) పడి పోయిందని, పాలు, పాల ఉత్ప త్తులపై వ్యయం 14.6 శాతం మేర పడిపోయిందని ఈ గణాంకాల ద్వారా తెలుస్తోంది. కాగా యెస్‌బ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం వినిమయ సూచీలు గణనీయంగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్‌ తగ్గిపోవటం వల్లే కార్లు, టూ వీలర్ల విక్రయాలు పడిపోయాయని, యెస్‌బ్యాంక్‌ తన నివేదికలో పేర్కొంది.

మాట మరిచిన మోడీ: ఏచూరి
నోట్ల రద్దు ప్రకటించిన 50 రోజుల తరువాత సత్ఫలితాలు కన్పించకపోతే ప్రజలు తనను శిక్షించవచ్చని అప్పట్లో చేసిన ప్రకటనను ప్రధాని నరేంద్రమోడీ బహుశా మర్చిపోయి వుండవచ్చని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. వాస్త‌వానికి నోట్ల రద్దు దేశ ప్రజల పాలిట ముఖ్యంగా పేదల పాలిట భారీ విపత్తుగా పరిణమించిందని ఆయన వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు ఫలితంగా పాలు, పాల ఉత్పత్తులపై ప్రజలు చేసే వ్యయం 2917-18లో దాదాపు రు.60 వేల కోట్ల మేర పడిపోయిందని ఆయన వివరించారు.

Courtesy Prajasakthi…