• వికటించిన కేసీఆర్‌ వ్యూహం!.. 
  • కఠిన వైఖరితో కొత్త సమస్యలు.. రెండు వర్గాలుగా మారిన కేబినెట్‌
  • ఉద్యమ మంత్రులు/ బీటీ మంత్రులు
  • బీటీ మంత్రుల మాటలతో చిచ్చు

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వ వ్యూహం వికటించిందా!? అనుకున్నది ఒకటి.. అయినది ఒకటిగా మారిందా!? కఠిన వైఖరితో కార్మికులు దారికొస్తారని అనుకుంటే.. సమ్మెకు మరింత పీటముడి పడిందా!? సమస్య పరిష్కారానికి ఉద్యమ నేపథ్యం ఉన్న మంత్రులకు బదులు ఉద్యమ నేపథ్యం లేని మంత్రులను రంగంలోకి దింపడం బెడిసికొట్టిందా!? ‘ఔను’ అంటున్నాయి రాజకీయ వర్గాలు! ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌… డెడ్‌లైన్‌ విధించి, ఆలోగా విధుల్లో చేరని కార్మికులు ఉద్యోగాలు కోల్పోయినట్టేనన్న సందేశం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. రాజీకి మార్గాలు మూసుకుపోవడంతో కార్మికులు కూడా పట్టుదలకు పోయారు. ఈ నేపథ్యంలో మంత్రుల్లో రెండు రకాల విరుద్ధ అభిప్రాయాలు ఏర్పడ్డాయి. టీఎంయూ… ఉద్యమం నుంచి ఏర్పడిన సంఘమనీ, తెలంగాణ సాధనలో దాని పాత్ర కూడా ఉందనీ, కార్మికులతో అంత కఠినంగా ఉండడం తగదనీ ఉద్యమ కాలం నాటి మంత్రులు అభిప్రాయానికి వచ్చారు. అందుకే కేటీఆర్‌ సహా ఉద్యమ మంత్రులెవరూ సమ్మెపై నోరు విప్పలేదు. సమ్మెను వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా ఉద్యమమంత్రులు పెద్దగా స్పందించలేదని తెలిసింది.

మరోవైపు ఉద్యమ సమయంలో టీఆర్‌ఎ్‌సలో లేకుండా, తర్వాత వచ్చి మంత్రులైన వారు మాత్రం, క్షేత్రస్థాయిలో ఉన్న సున్నితత్వాన్ని గుర్తించకుండా, దూకుడుగా, ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. దీంతో పరిస్థితి మరింత విషమించి కార్మికుల బలిదానాలదాకా వెళ్లింది. సర్కారు తీరుపై జనంలో ఆగ్రహం పెల్లుబికింది. ‘‘ఉద్యమంలో పాల్గొన్న మంత్రులు ఏమైనా మాట్లాడితే ఒప్పుకొంటాం. కానీ, ఉద్యమ చరిత్ర లేనివాళ్లు కార్మికులను బెదిరించడం ఏమిటి!?’’ అని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్‌ ఎన్నడూ చెప్పలేదని, ఆ నినాదం టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలోనే లేదని మంత్రులు పువ్వాడ, తలసాని, ఎర్రబెల్లి వంటివారు వ్యాఖ్యానించడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని కేసీఆర్‌ వాగ్దానం చేశారనీ, ఆర్టీసీ విలీనంపైనా హామీ ఇచ్చారని, అప్పుడు పార్టీలో లేని మీకు ఆ విషయాలు ఎలా తెలుస్తాయని కార్మికులు ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో టీడీపీలో ఉన్న గంగుల కమలాకర్‌, తలసాని, ఎర్రబెల్లి ఇప్పుడు ఆర్టీసీ నేతలపై విమర్శలు గుప్పించడం సమస్యను మరింత తీవ్రం చేసింది. కార్మికులు, ఉద్యోగుల నడుమ ‘విభజించు, పాలించు’ విధానాన్ని అనుసరించాలన్న ప్రభుత్వ వ్యూహం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సర్కారుకు సన్నిహితంగా ఉన్నట్టు కనిపించిన ఉద్యోగ సంఘ నేతలపై అటు ఉద్యోగుల నుంచి, ఇటు జనం నుంచీ ఒత్తిడి వచ్చింది. దీంతో వారు కార్మికులకు అనుకూలంగా ప్రకటనలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇలా అన్ని వైపులా ప్రతికూలతలే కనిపించడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది.

మెట్టుదిగడానికి సిద్ధపడిన ప్రభుత్వం
కార్మికులు సెల్ఫ్‌డిస్మిస్‌ చేసుకున్నారనీ, వారిని మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదని హూంకరించిన ప్రభుత్వం… మెట్టుదిగడానికి సిద్ధపడింది. బేషరతుగా క్షమాపణ చెప్పి చేరతామనే వారిని ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి సిద్ధమనే రీతిలో సంకేతాలివ్వాల్సిందిగా మంత్రులు, ఎమ్మెల్యేలకు సర్కారులోని ముఖ్యులు సూచించినట్టు తెలిసింది. ఈమేరకు డిపో మేనేజర్లకు ఆదేశాలిస్తామని కూడా సూచించారు. ప్రభుత్వం తరఫున బహిరంగంగా ఎలాంటి హామీ లేకుండానే ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా విధుల్లో చేరేలా ఒప్పించాలని పేర్కొన్నారు. అయితే పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయిందని, అలాంటి వాటితో ఇప్పుడు ఉపయోగం లేదని ఉద్యమ మంత్రులు కొందరు స్పష్టంచేసినట్టు సమాచారం. ఆర్టీసీలో పని చేస్తున్న వారంతా చిన్న చిన్న జీతాలతో బతుకుతున్నారని, పైగా, ఉద్యమ సమయంలో వారితో తమకు అనుబంధం ఉందని, డిమాండ్లను పరిశీలిస్తామని ఒక్కమాట ప్రభుత్వం చెబితే.. తాము సమ్మెను విరమింపజేస్తామని ముగ్గురు నలుగురు ఉద్యమ మంత్రులు వివిధ మార్గాల ద్వారా సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. అయితే సీఎం అందుకు అంగీకరించలేదని సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు లొంగితే మున్ముందు మిగతా ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యమబాట పడతాయని, దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడుతాయని కేసీఆర్‌ భావించారు. అయితే డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి తర్వాత మరో కండక్టర్‌ కూడా ఆత్మహత్య చేసుకోవడం, మరికొందరు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడం, ప్రభుత్వం మెట్టుదిగక తప్పని వాతావరణాన్ని కల్పించింది.

దీంతో ‘ఆర్టీసీ కార్మికులకు లొంగినట్టు కన్పించకూడదు. అలాగని, పరిస్థితిని తెగేదాకా లాగకూడదు!’ అనే ఉద్దేశంతోనే కే. కేశవరావును సీఎం చర్చలకు పురమాయించినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అటు కాంగ్రెస్‌లోనూ ఇటు టీఆర్‌ఎ్‌సలోనూ కీలక నేతగా ఉండి, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన కేకే ద్వారా రాజీకి ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. సమ్మెపై సీఎం సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా పేర్కొనడం గమనార్హం. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ఐఏఎ్‌సలతో కాకుండా ఉద్యమ మంత్రులతోనే కమిటీ ఏర్పాటు చేసి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

Courtesy Andhra Jyothy