• వైద్య విద్యార్థిని పట్ల ఏసీపీ అభ్యంతరకర చర్య
  • తాకకూడని చోట తాకిన వైనం
  • ఐఏఎస్‌ వీపుపై చేయి వేసి తీసుకెళ్లిన ఆనంద్‌

అక్కడ వైద్య విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నా పరిస్థితి అదుపు తప్పలేదు.. ఎలాంటి ఉద్రిక్తపరిస్థితులూ లేవు. అయినా ఓ పోలీసు అధికారి గీత దాటి వ్యవహరించారు. ఓ విద్యార్థిని పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆ విద్యార్థినినితాకకూడని చోట చేత్తో గట్టిగా తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారు. మరో ఐఏఎస్‌ అధికారిణి పట్లా అలాగే వ్యవహరించారు. చార్మినార్‌ ఆయుర్వేద ఆస్పత్రిని తరలించవద్దంటూ అక్కడి వైద్య విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమంలో బుధవారం మీర్‌చౌక్‌ ఏసీపీ ఆనంద్‌ చేష్టలివి! గత నాలుగు రోజులుగా ఆస్పత్రి తరలింపును నిరసిస్తూ వైద్య విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తున్నారు.

అదే తరహాలో బుధవారం కూడా ఆందోళనకు దిగారు. విద్యార్థులను అడ్డుకునేందుకు మహిళా పోలీసులు కూడా ఉన్నారు. అయితే మహిళా కానిస్టేబుళ్లతో కలిసి మగ కానిస్టేబుళ్లు, సీఐ, ఏసీపీ స్థాయి అధికారులు కూడా వైద్య విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ‘మమ్మల్ని వదిలేస్తే వెళ్లిపోతాం’ అంటూ విద్యార్థినులు వేడుకుంటున్నా.. నిర్దయగా ఈడ్చి పారేశారు. సివిల్‌ డ్రెస్‌లో ఉన్న చార్మినార్‌ కానిస్టేబుల్‌ పరమేశ్‌ అయితే ఓ వైద్య విద్యార్థినిని కాలితో తన్ని, గట్టిగా గిల్లాడు. పోలీసుల చేష్టల తాలూకు ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో క్షణాల్లో వైరల్‌ అయ్యాయి. విద్యార్థినుల పట్ల పోలీసులు చర్యలను సోషల్‌ మీడియాలో ప్రజలు తప్పుబడుతున్నారు. కాగా మగ పోలీసుల ఈ చర్యలు విధుల్లో భాగమేనంటూ ఉన్నతాధికారులు సమర్థించడం గమనార్హం. అయితే.. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై విచారణ జరుపుతామని దక్షిణ మండలం డీసీపీ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆపివేయాలని ఆయన చెప్పడంతో తప్పు చేసిన పోలీసులను సమర్థిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులను వెంటనే సస్పెండ్‌ చేయాలని బీజేపీ మీడియా కన్వీనర్‌ సుధాకర్‌ శర్మ డిమాండ్‌ చేశారు.

(Courtacy Andhrajyothi)