కాశ్మీర్‌ ప్రజల మీద, ముఖ్యంగా మహిళల మీద, పిల్లల మీద దిగ్బంధం ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నదో స్వయంగా చూసేందుకు ‘నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ విమెన్‌’ తరఫున ఆనీ రాజా, కవల్‌ జిత్‌ కౌర్‌, పంఖురి జహీర్‌, ‘ప్రగతిశీల్‌ మహిళా సంఘటన్‌’ తరఫున పూనమ్‌ కౌశిక్‌, ‘ముస్లిం విమెన్స్‌ ఫోరమ్‌’ తరఫున సయిదా హమీద్‌ బృందంగా సెప్టెంబర్‌ 17 నుంచి 21 వరకు కాశ్మీర్‌లో పర్యటించారు. నిర్బంధంలో జీవిస్తున్న సాధారణ ప్రజల బాధలకూ, గాథలకూ ప్రత్యక్ష సాక్షుల కథనం క్లుప్తంగా.
మేం విమానాశ్రయంలో దిగి నగరంలోకి వెళ్తుండగా కొట్టవచ్చినట్టు కనిపించిన దృశ్యం మూసి ఉన్న దుకాణాలు, హౌటళ్లు, పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, నిర్జనమైన వీధులు. స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడాన్ని కూడా అడ్డుకుంటున్న వాతావరణం అక్కడ నెలకొని ఉన్నది. కాశ్మీర్‌ అనగానే గుర్తొచ్చే శికారాలు, హౌస్‌ బోట్లు, తామర పూలు, దాల్‌ సరస్సు అనే సాధారణ చిత్రం ఇప్పుడక్కడ లేదు.
మేం తిరిగిన నాలుగు జిల్లాల్లోని అన్ని గ్రామాల్లోనూ ప్రజల అనుభవం ఒకే రకంగా ఉంది. రాత్రి ఎనిమిదింటికి, మఘ్రేబ్‌ ప్రార్థన అయిపోగానే ఇండ్లలో లైట్లు ఆర్పేసి చీకటి చేయాల్సి ఉంటుందని వాళ్లందరూ చెప్పారు. బడి మళ్లీ తెరుస్తారేమో, పరీక్షలకు చదువుకోకపోతే ఎట్లా అని బండిపొరాలో ఒక అమ్మాయి లైటు ఆర్పకుండా ‘తప్పు’ చేసింది. అలా కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినందుకు సైనికులకు చాలా కోపమొచ్చింది. అంతే.. గోడ దూకి ఇంట్లోకి తోసుకొచ్చారు. ప్రశ్నించడానికనే పేరుతో ఇంట్లో ఉన్న ఇద్దరు మగవాళ్లను తీసుకుపోయారు. ‘ఏం ప్రశ్నించడానికి?’ అని ప్రశ్నించే సాహసం అక్కడ ఎవరికీ లేదు. అప్పటి నుంచి వారిని నిర్బంధం లోనే ఉంచారు. ‘సాయంత్రం ఆరింటికల్లా మా మగవాళ్లందరినీ ఇంటి లోపలికి వచ్చెయ్యమంటున్నాం. మగవాళ్లు పెద్దవాళ్లైనా, పిల్లలైనా చీకటి పడ్డాక వీధుల్లో కనబడడం చాలా పెద్ద ప్రమాదం. అత్యవసరమైతే, ఆడవాళ్లమే బైటికి వెళ్తున్నాం’ అని బండిపొరా జిల్లా కేంద్రానికి పొరుగున ఉన్న ఒక గ్రామంలో జరీనా అంటున్నది.
మేం ఎక్కడికి వెళ్లినా ఇదే కథ. ఈ నలభై మూడు రోజులూ మృత్యు శాంతి తాండవించింది. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా రద్దయిపోయింది. సొంత కార్లున్న వాళ్లు కూడా అత్యవసరమైన పనుల కోసం మాత్రమే వాటిని బైటికి తీస్తున్నారు. మహిళలు రోడ్ల పక్కన నిలబడి వచ్చి పోయే కార్లనూ, బైక్‌లనూ లిఫ్టు ఇమ్మని అడగడం, వాళ్లందరూ ఆగి సహాయం చేయడం కనబడుతున్నది.
370వ అధికరణం రద్దు జరిగిన నాటి నుంచీ తమకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి శ్రీనగర్‌లో లాలా దేడ్‌ ఆస్పత్రిలో యువ మహిళా డాక్టర్లు చాలామంది మాతో పంచుకున్నారు. ‘ప్రసవానికి స్త్రీలను తగిన సమయంలో తీసుకు రాలేక పోయిన సందర్భాలున్నాయి. చాలా తక్కువ అంబులెన్సులు ఉన్నాయి.

ఉన్న కాసిన్నిటిని కూడా దారిలో సైనిక పికెట్ల దగ్గర అడ్డగిస్తున్నారు. ప్రసవం ఆలస్యం కావడం వల్ల అంగవైకల్యంతో, ఇతర రకాల సమస్యలతో పిల్లలు పుడుతున్నారు. అది ఆ పిల్లలకు జీవితాంతం సమస్యే. తల్లిదండ్రులకైతే జీవన్మరణమే. మరొకపక్క, చాలామంది స్త్రీలు ప్రస్తుత స్థితిలోని ఒత్తిడి వల్ల, భయం వల్ల సమయానికి ముందే ప్రసవిస్తున్నారు’ అన్నారొక డాక్టర్‌. ఇంటర్నెట్‌ మీద మాత్రమే పని చేసే ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకాన్ని వాడుకోవడానికి కూడా అక్కడి డాక్టర్లకూ, రోగులకూ అవకాశం లేదు. ఇంటర్నెట్‌ లేదు కనుక.
గ్రామాల్లో మా ముందు నిలబడిన మహిళల కళ్లల్లో శూన్యం కొట్టవచ్చినట్టు కనబడింది. ‘మా పిల్లలను తీసుకుపోయారు. మా ఇండ్లలో నుంచి ఎత్తుకుపోయారు. వాళ్లు ఎక్కడున్నారో మాకెట్లా తెలుస్తుంది? మా మగవాళ్లు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి అడిగితే అక్కడ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అడగమంటున్నారు. ఎవరో ఒకరిని లిఫ్టు ఇమ్మని బతిమిలాడి, బామాలి ఏదో ఒకరకంగా ప్రధాన కార్యాలయానికి చేరితే, అక్కడ ‘రాళ్లు విసిరినవాళ్లు’ అని బోర్డుల మీద జాబితాలు పెట్టారు. ఆ జాబితాల్లో ఉన్నవాళ్లు ఆగ్రా, జోద్‌పూర్‌, అంబేద్కర్‌, జజ్జర్‌ జైళ్లలో ఉన్నారు’ అన్నారొకరు. ‘బతిమిలాడో, అప్పు చేసో, మాలో కొద్దిమంది అన్ని వందల మైళ్లు ప్రయాణం చేసి వెళ్లినా, మాకు ఎంతమాత్రం తెలియని ఆ నగరాల్లో మేమంటే పడని జైలు గార్డులు మమ్మల్ని తోసేస్తారు అంతే’ అన్నాడు పక్కన నిలబడిన వ్యక్తి.
‘యువకులు, యిప్పుడిప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్న పిల్లలు కనబడ్డారంటే సైనికులు వారి మీద విరుచుకు పడతారు. అసలు వాళ్లను చూస్తేనే సైనికులకు ద్వేషం పొంగుకొస్తోంది. తమ పిల్లలను కాపాడడానికి తండ్రులు వెళ్లగానే వాళ్ల నుంచి డబ్బులు లాగడం మొదలు పెడతారు. ఒక్కొక్కరి దగ్గర రూ.20 వేల నుంచి రూ.60 వేలు వసూలు చేస్తారు.’ కాశ్మీరీ యువత పట్ల సైనికుల ద్వేషం ఎంత సుపరిచితం అయిందంటే, ఇంటి తలుపు తట్టిన చప్పుడు వినబడగానే, ఇంట్లోని వృద్ధుడిని మాత్రమే తలుపు తీయడానికి పంపుతారు. ‘వృద్ధుడిని, చూస్తే వాళ్లు వదిలేస్తారని ఆశిస్తాం, వదిలేయాలని ప్రార్థిస్తాం కూడా! కాని ఎదురుగా ఉన్నది వృద్ధుడైనా, యువకుడైనా, చివరికి చిన్నపిల్ల వాడైనా సరే చెంపదెబ్బలు, ముఖం మీద పిడి గుద్దులు తప్పవు. అయినా, అసలు మా తలుపుల గొళ్లాలు ఎంత వదులుగా పెడతామంటే సైనికులు ఒక్క తన్ను తన్నగానే తలుపులు ఊడిపోతాయి!’ ఈ మామూలు మాటల్లో ఎంత వ్యంగ్యం, విషాదం వ్యక్తమవుతున్నాయి! పద్నాలుగు, పదిహేనేండ్ల పిల్లలను కూడా తీసుకుపోతున్నారు. చిత్రహింసలు పెడుతున్నారు. కొందరినైతే 45 రోజులుగా నిర్బంధంలోనే ఉంచారు. వారికి సంబంధించిన పత్రాలన్నీ తీసుకుపోయారు. కుటుంబాలకు కనీస సమాచారం కూడా లేదు. పాత ఎఫ్‌ఐఆర్‌లు తవ్వి తీస్తున్నారు. వాళ్ల ఫోన్లు లాక్కుపోతూ, సైన్యం క్యాంపుకు వచ్చి తీసుకొమ్మంటున్నారు. సైనికుల గురించి తెలిసిన వాళ్లెవరూ, అది ఎంత ఖరీదైన ఫోన్‌ అయినా సరే, తెచ్చుకోవడానికి క్యాంపుకు వెళ్లడం లేదు. ఈ నిర్బంధ కాలంలో మొత్తం 13,000 మంది మగ పిల్లలను తీసుకుపోయారని తెలుస్తున్నది. చివరికి ఇంట్లో ఉన్న తిండి దినుసులను కూడా సైనికులు వదలలేదు. ‘ఎప్పుడెలా ఉంటుందో అని మేం బియ్యం, పప్పులు, నూనె కాస్త ఎక్కువగానే నిల్వ ఉంచుకుంటాం. అయితే ఆ దినుసుల డబ్బాల్లో కిరసనాయిలు గుమ్మరించారు. కొన్ని చోట్ల బొగ్గుపొడి కలిపారు’ అందో మహిళ.
పర్యటనలో భాగంగా మేమొక జమ్మూ కాశ్మీర్‌ పోలీసును కూడా కలిశాం. వారి దగ్గర నుంచి తుపాకులు తీసేసుకుని లాఠీలు ఇచ్చారు. ‘దాంట్లో మంచీ ఉంది, చెడూ ఉంది’ అన్నాడాయన. ‘వాటిని ఎప్పుడు ఎవరు ఎత్తుకు పోతారో అని భయపడుతూ ఉండేవాళ్లం, అందువల్ల అది లేకపోవడమే మంచిది. కాకపోతే ఇప్పుడు కాల్పులు జరిగితే మమ్మల్ని మేం రక్షించుకోవడానికి కూడా అవకాశం లేదు. అది చెడ్డది’ అన్నాడాయన. ‘భారత ప్రభుత్వం మమ్మల్ని పాలస్తీనా లాగా మార్చదలచుకుంది. మేం, కాశ్మీరీలం దాన్ని ఎదిరిస్తాం’ అన్నది ఒక మహిళా సెక్యూరిటీ గార్డ్‌. ‘మాకు స్వేచ్ఛ కావాలి. మాకు భారత దేశమూ వద్దు, పాకిస్థానూ వద్దు. మా స్వేచ్ఛ కోసం మేం ఎంత మూల్యమైనా చెల్లిస్తాం. ఇది కాశ్మీరీ రక్తం. ఎంత త్యాగమైనా చేస్తుంది’ అన్నాడు ఒక యువ నిపుణుడు.
మేం ఎక్కడికి వెళ్లినా రెండు భావోద్వేగాలు కొట్టవచ్చినట్టు కనిపించాయి. మొదటిది, ఆజాదీ కోసం, స్వేచ్ఛ కోసం తపన. వాళ్లకు ఇటు భారతదేశమూ వద్దు, అటు పాకిస్థానూ వద్దు. 70ఏండ్ల పాటు వాళ్లు అనుభవించిన అవమానాలూ చిత్రహింసలూ ఇక వెనక్కి తిరగలేని దశకు చేరాయి. ఆర్టికల్‌ 370 రద్దుతో భారతదేశంతో వారికి ఉన్న చిట్టచివరి బంధం తెగిపోయిందని కొందరన్నారు. ఇంతకాలమూ ప్రతి సందర్భంలోనూ భారత రాజ్యాన్ని సమర్థించిన వాళ్లను కూడా ఇప్పుడు ప్రభుత్వం తిరస్కరించింది. ఇక రెండోది, తల్లుల విషాధ విలాపాలు. ఆ తల్లులు ఎందరో పిల్లల మృత దేహాలను, చిత్రహింసల గాయాలపాలైన మృత దేహాలను చూశారు. వారు ఈ అమాయకుల మీద జరుగుతున్న పాశవిక దాడి తక్షణమే ఆగిపోవాలని కోరుతున్నారు. తుపాకుల కింద, జాక్‌ బూట్ల పదఘట్టనల కింద తమ పిల్లల జీవితాలు అంతరించి పోగూడదని కోరుతున్నారు.
కాశ్మీర్‌లో మా పర్యటన అనుభవాలను, పరిశీలనలను నివేదిస్తున్న క్రమంలో, రెండు నిర్థారణలతో మేమీ నివేదిక ముగించదలచాం. ఒకటి, గత యాభై రోజుల్లో భారత ప్రభుత్వమూ సైన్యమూ సాగించిన పాశవికత్వం ముందు, నిర్బంధకాండ ముందు కాశ్మీరీ ప్రజలు ఆశ్చర్యకరమైన పద్ధతిలో తమ ఓరిమి ప్రదర్శించారు. వారు మాకు చెప్పిన సంఘటనలు వింటుంటే మా ఒళ్లు జలదరించింది. ఈ నివేదిక వారు చెప్పిన వాటిలో కొన్నిటి సారాంశం మాత్రమే. కాశ్మీరీ ప్రజల ధైర్యసాహసాలకు, దృఢ చిత్తానికి మేం మా అభినందనలు తెలియజేస్తున్నాం. రెండవది, అక్కడి పరిస్థితి ఎంతమాత్రం ప్రశాంతంగా లేదని మేం మరొకసారి నొక్కి చెప్పదలచాం. పరిస్థితి క్రమంగా ప్రశాంతత దిశగా సాగుతున్నదని ప్రకటిస్తున్న వాళ్లందరూ వాస్తవాల వక్రీకరణతో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు.
మా డిమాండ్లు… 1. ప్రశాంత పరిస్థితి నెలకొనేందుకు తక్షణం సైన్యాన్ని, అర్ధసైనిక బలగాలను ఉపసంహరించాలి. 2. ప్రజలలో విశ్వాసం నెలకొనేందుకు అన్ని కేసులనూ ఎఫ్‌ఐఆర్‌లనూ రద్దు చేయాలి. ఆర్టికల్‌ 370 రద్దు నాటి నుంచీ నిర్బంధంలో, జైలులో ఉంచిన అందరినీ, ప్రత్యేకించి యువకులను తక్షణమే విడుదల చేయాలి. 3. న్యాయాన్ని నెలకొల్పేందుకు సైన్యమూ, ఇతర భద్రతా బలగాలూ అమలు చేసిన భయానక హింస, చిత్రహింసల మీద విచారణ జరిపించాలి. 4. రవాణా సౌకర్యాలు, సమాచార సంబంధాలు లేనందువల్ల తమ సన్నిహితుల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలన్నిటికీ నష్టపరిహారం ఇవ్వాలి.

(మేం కలిసిన వ్యక్తుల భద్రత దృష్ట్యా వారి పేర్లను మార్చాం.
ఆ కారణం వల్లనే మేం పర్యటించిన గ్రామాల పేర్లు కూడా రాయడం లేదు.)

Courtesy Navatelangana..