• ఏడాదిగా పోలీసుల ఒత్తిళ్లు
  • భార్య, కుమార్తెలను ప్రస్తావిస్తూ సీఐ దూషణలు
  • నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్యలపై బంధువుల ఆరోపణలు

కర్నూలు: నంద్యాలలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సలాం కుటుంబాన్ని పోలీసులు ఏడాదిగా వేధిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యలకు పాల్పడిన ముందురోజు సైతం తీవ్రస్థాయిలో బెదిరించారన్నారు. మీకు నాలుగు రోజులే గడువిస్తున్నా.. విజయవాడ పంపి అక్కడ నీ సంగతి చూస్తాం అంటూ సీఐ హెచ్చరించారని, అంతటితో ఆగకుండా భార్యా, కుమార్తెల గురించి అసభ్యంగా మాట్లాడుతూ సలాంను మానసిక క్షోభకు గురిచేశారని ఆయన అత్త మాబున్నీసా గురువారం ‘ఈనాడు- ఈటీవీ’ వద్ద కన్నీరుమున్నీరయ్యారు. తన అల్లుణ్ని బంగారం దుకాణంలో చోరీ కేసు, ఆటోలో నగదు మాయమైన కేసులను ఒప్పుకోవాలంటూ ఒత్తిడి చేశారని తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ కొన్నాళ్లుగా బంగారు దుకాణంలోని కొన్ని ఫొటోలను సలాం సెల్‌ఫోన్‌కు పంపిస్తూ భయాందోళనకు గురిచేసేవారని చెప్పారు. గంగాధర్‌ బెదిరింపులకు సంబంధించి ఆడియో టేపులున్న ఆ ఫోన్‌ను పోలీసులు విచారణ పేరుతో తీసుకున్నారని వెల్లడించారు.

పోలీసుల నిర్లక్ష్యంతోనే మృతి
సలాం 25 ఏళ్లపాటు స్థానిక నిమిషాంబ జ్యువెల్లర్స్‌లో గుమస్తాగా పనిచేశారు. గతేడాది నవంబరులో సుమారు 3 కిలోల బంగారం అపహరణకు గురైనట్లు యజమాని వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజీన్నర బంగారం చోరీ అయిందని పోలీసులు కేసు నమోదు చేసి సలాంను అనుమానితుడిగా చేర్చి రిమాండ్‌కు పంపారు. సలాం బెయిల్‌పై బయటకు వచ్చి ఆటోడ్రైవర్‌గా జీవనం సాగించేవారు. ఈ నెల 2న ఆటో ఎక్కిన ఓ ప్రయాణికుడి నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు పిలిచిన పోలీసులు అప్పుడు బంగారం కేసులో, ఇప్పుడు ఆటోలో నగదు మాయం కేసులో నువ్వే సూత్రధారివి.. మనుషుల్ని పెట్టి వాటిని మాయం చేయించావు..  కేసులు ఒప్పుకోవాలంటూ అతని భార్య నూర్జహాన్‌ ముందే తీవ్రంగా దూషించారని ప్రత్యక్ష సాక్షి అయిన మాబున్నీసా తెలిపారు. ‘బంగారం కేసులో పోలీసులు దుస్తులిప్పించి, చిత్రహింసలకు  గురిచేశారు. ఆటో కేసులో ఇంకేం చేస్తారోనని నా అల్లుడు బోరుమని విలపించాడు. లాయరు దగ్గరకు వెళదామని 3వ తేదీ ఉదయం డబ్బులు తీసుకుని సలాం ఇంటికి వెళ్లాను. పిల్లలను స్కూల్లో దించి వస్తామంటూ కుటుంబమంతా ఆటోలో వెళ్లారు. ఎంతసేపటికీ తిరిగిరాలేదు. కాసేపటి తర్వాత అంతా శవాలై తేలారు’ అని ఆమె విలపించారు. ఆటోలో వెళ్లిన వారు ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు నిర్లక్ష్యం వహించారు. 3వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటూ ఉచిత సలహాలిచ్చారు. సీసీ కెమెరాల్లో చూసి ఆటో ఎటువైపు వెళ్లిందో చెబితే మేమే వెతుక్కుంటామంటూ బంధువులు కోరినా పోలీసులు ఆ కోణంలోనూ ప్రయత్నించలేదు. ఇలా మూడు గంటలు వృథా కావడంతో రైలు పట్టాలపై మృతదేహాలను చూడాల్సి వచ్చిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలకు నిబంధనలకు విరుద్ధంగా సాయంత్రం దాటిన తర్వాత శవపరీక్షలను పోలీసులే దగ్గరుండి చేయించారు. రాత్రికి రాత్రే కుటుంబసభ్యులతో ఖననం చేయించారు.

సీబీఐ విచారణ జరిపించాలి
భార్య, కుమార్తెలను ప్రస్తావిస్తూ అసభ్యంగా మాట్లాడే పోలీసు అధికారులుంటే ఆత్మహత్యలు కాకుండా ఏం చేసుకుంటారని ఏపీ హైకోర్టు న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ నిలదీశారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిపై 48 గంటల్లోగా సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. సలాం కుటుంబం పోలీసులు, ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేవల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోతే తెల్లవారుజామున ముస్లిం సంప్రదాయానికి వ్యతిరేకంగా ఖననం చేశారంటే సీఎం తీరు అర్థమవుతోందని ముస్లింలీగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్‌ అహ్మద్‌ ఆరోపించారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉంటూ పలుకుబడి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని న్యాయమూర్తి రామకృష్ణ విమర్శించారు. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని తప్పుడు కేసు నమోదు చేసి బెయిల్‌ ఇప్పించారని ధ్వజమెత్తారు.

డబ్బులొద్దు.. న్యాయం కావాలి
నంద్యాల బొమ్మలసత్రం: మాకు డబ్బులొద్దు, న్యాయం కావాలని అబ్దుల్‌ సలాం కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గురువారం కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చెక్కును అందజేసేందుకు నంద్యాలకు రాగా వారు తిరస్కరించారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఇది ప్రభుత్వ సహాయమన్నారు. సలాం ఆత్మ శాంతించేందుకు ఈ ఆర్థిక సహాయాన్ని తీసుకుని ఎవరికైనా ఇవ్వాలని కోరారు. నిందితులకు శిక్షపడే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. దాంతో చెక్కును తీసుకుని, మసీదుకు ఇస్తామని బాధితులు పేర్కొన్నారు.

Courtesy Eenadu