Image result for వెకిలి ప్రశ్నలు.. వేధింపులు"అత్యాచార బాధితులతో పోలీసుల అమానవీయ ప్రవర్తన
సంవత్సరాలుగా కొనసాగుతోన్న విచారణలు
నిందితులకు శిక్షలు అంతంతమాత్రం
‘‘బంజారాహిల్స్‌లోని ఓ మురికి వాడలో తొమ్మిదేళ్ల బాలిక తల్లిదండ్రులతో నివసిస్తోంది.. బాలిక ఇంటికి సమీపంలో ఉంటున్న ఇద్దరు సోదరులు చిన్నారిని పరిచయం చేసుకున్నారు. బాలికకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకున్నారు. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ వేర్వేరుగా అత్యాచారానికి పాల్పడ్డారు…’’
‘‘బంజారాహిల్స్‌లో నివాసముంటున్న 22 ఏళ్ల యువకుడు ఓ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నాడు. బంజారాహిల్స్‌లోనే తాను అద్దెకుంటున్న గదికి సమీపంలో ఉంటున్న 15 ఏళ్లబాలికను పరిచయం చేసుకున్నాడు. ఆమెకు చిన్న, చిన్న బహుమతులు ఇచ్చి తనవైపు ఆకర్షితులయ్యేలా చేసుకున్నాడు… ఒక రోజు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా… శీతలపానీయంలో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు..’’
రాజధాని నగరంలో ఈ ఏడాది జరిగిన దుర్ఘటనల్లో కొన్ని ఇవి. సైబరాబాద్‌లో ‘దిశ’ఘటనకు ముందే ఇవన్నీ జరిగాయి. పైశాచిక సంస్కృతిని వంటబట్టించుకున్న కీచకులు జంకూ, గొంకూలేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్తున్న యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఇంతే కాదు… కొందరు కామాంధులు పసిమెగ్గలని చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా… విచారణ కొనసాగుతూ ఉండడడంతో నిందితులు బెయిల్‌పై బయటకు వస్తున్నారు.
అటకెక్కుతున్న దర్యాప్తు..
మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో నిర్భయ తరహా సామూహిక అత్యాచారాలు, చిన్నారులు, మైనర్లపై అత్యాచారాలు జరిగినా పోలీసులు పూర్తిస్థాయిలో స్పందించడం లేదు. ఒకరో… ఇద్దరో స్వప్రయోజనాలకు దుర్వినియోగం చేశారని పోలీసులు అందరినీ ఒకే గాటన కట్టేస్తున్నారు. కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి పోలీసుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగుతోంది. నిందితుల జాడ కన్పించడం లేదని, సాక్ష్యాలు సక్రమంగా దొరకడం లేదని సాకులు చెబుతున్నారు. మరికొన్ని పోలీస్‌ఠాణాల్లో పోలీస్‌ అధికారులు నిందితులను పట్టుకోవడం వదిలేసి ‘ఏదైనా మాట్లాడుకోండి’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. మరికొందరు అధికారులు బాధితురాలిని వేధిస్తున్నారు. ‘నువ్వు అక్కడికే ఎందుకు వెళ్లావ్‌? అతను నీకు పరిచయమే కదా?’ అంటూ వెకిలిప్రశ్నలు వేస్తున్నారు. దీంతో బాధితులకు పోలీస్‌ వ్యవస్థపైనే ఏహ్యభావం కలుగుతోంది. పోలీసుల అలసత్వం కారణంగా మూడేళ్ల క్రితం కేసులు ఇప్పటికీ విచారణకు రాలేదు.
(Courtesy Eenadu)