– మహిళా కార్మికులపై మగ పోలీసుల దౌర్జన్యం
– మంత్రి హరీశ్‌రావు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
– ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట
– రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల ఇండ్ల ముట్టడి
నవతెలంగాణ-యంత్రాంగం
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు, పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇండ్లు, క్యాంపు కార్యాలయాలను సోమవారం ముట్టడించారు. వామపక్షాల ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఇంటి ముట్టడికి వెళ్లగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా కార్మికులపై మగ పోలీసులు దౌర్జన్యం ప్రదర్శించారు. పిడిగుద్దులు గుద్ది..కాళ్లతో తొక్కి మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హన్మకొండలో పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటిని సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకులు ముట్టించగా..

పోలీసులతో తోపులాట జరిగింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి వెళ్లిన మహిళా కార్మికుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు. వారిని ఈడ్చుకుంటూ పోలీస్‌ వాహనంలో పడేశారు. తోపులాటలో శ్రీలత, రజిత, పుష్పలీల, మౌనికలకు గాయాలై, సొమ్మ సిల్లి పడిపోయారు.

చలో ట్యాంక్‌బండ్‌, మిలియన్‌ మార్చ్‌లో పాల్గొన్న కార్మికులు, మహిళల పట్ల పోలీసుల దమనకాండను నిరసిస్తూ జేఏసీ సోమవారం టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల ఇండ్ల ముట్టడికి పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో కార్మికులు టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల ఇండ్లు ముట్టడించారు. సోమవారంతో 38వ రోజుకు చేరిన సమ్మె.. మరింత ఉధృతంగా మారుతోంది.

సిద్దిపేటలో మంత్రి హరీశ్‌ ఇంటి ముట్టడి ఉద్రిక్తంగా మారింది. మహిళల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్‌ చేయాలనీ, నైతిక బాధ్యత వహించి మంత్రి హరీశ్‌రావు వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ(ఎం), సీపీఐ డిమాండ్‌ చేసింది. పలువురికి గాయాలయ్యాయి.

గాయపడిన వారిలో సీపీఐ రాష్ట్ర నాయకులు మచ్చ శ్రీనివాస్‌, మహిళా సంఘం జిల్లా నాయకులు హేమలత, కార్మికులు కళావతిలు ఉన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, ఎంపీ నాగేశ్వరరావు, సత్తుపల్లిలో ఎమ్మెల్యే వెంకటవీరయ్య క్యాంప్‌ కార్యాలయాన్నీ ముట్టడించారు. ఖమ్మం నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌ ఇంటి ఎదుట ఆర్టీసీ జేఏసీ, మహిళా కార్మికులు ధర్నా చేపట్టారు. వనపర్తి జిల్లా కేంద్రంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇంటిని కార్మికులు ముట్టడించారు.

అనంతరం మంత్రి పీఏకు వినతిపత్రం అందజేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఇంటి గేటుకు విన తిపత్రం అందజేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో క్రీడా, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇంటికి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీగా వెళ్లి, మంత్రి లేకపోవడంతో ఆయన పీఏకు వినతిపత్రం అంద జేశారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే జోగురామన్న, నిర్మల్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర జిల్లా కేంద్రాల్లో ప్రజా ప్రతినిధుల ఇండ్లను ముట్టడించారు.

నిజామాబాద్‌ బాన్సువాడలో ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి ఆయన నివాసంలో కలిశారు. సమ్మె పట్ల స్పందించాలని వినతిపత్రం అందజేశారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఇండ్ల ఎదుట ధర్నా చేపట్టి వారి పీఏలకు వినతి పత్రం సమర్పించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, బీసీ పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్‌ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. హైదరాబాద్‌ బండ్లగూడ డిపో ఎదుట వంటావార్పు నిర్వహించారు. మలక్‌పేటలోని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఇండ్లను ముట్టడించారు. రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించిన వామపక్ష, ఇతర పార్టీల నాయకులను అరెస్ట్‌ చేశారు.

Courtesy Navatelangana…