బాలుడు ప్రాధేయపడినా కనికరించని పోలీసులు
వనపర్తి ఘటనపై మంత్రులు సహా సర్వత్రా ఆగ్రహం
కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసిన జిల్లా ఎస్పీ

వనపర్తి రూరల్‌ : ‘మా డాడీని కొట్టకండి అంకుల్‌.. వద్దు అంకుల్‌.. ప్లీజ్‌ అంకుల్‌.. డాడీ..డాడీ…’ అంటూ ఆ బాలుడు ఎంత ఏడుస్తున్నా పట్టించుకోలేదు. అక్కడున్న వాళ్లందరిని ప్రాధేయ పడినా కనికరించలేదు. ఆ చిన్నారి కండ్ల ముందే తండ్రిని కిందపడేసి రాయలేని బూతులు తిడుతూ దాడి చేశారు. వనపర్తి జిల్లాలో రోడ్డుపైకి వచ్చారనే కారణంతో పోలీసులు దారుణంగా ప్రవర్తించిన ఘటన గురువారం సోషల్‌ మీడియాలో అందర్నీ కదిలించింది. పలువురు మంత్రులు సహా సాధారణ పౌరులు కూడా స్పందించడంతో పోలీసులు ఉన్నతాధికారులు ఒకరిపై వేటువేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం సమయంలో తండ్రీకొడుకులు బైకుపై వెళ్తున్నారు. ఆ సమయంలో పోలీసులు వారిని అడ్డుకుని, నిబంధనలు ఉల్లంఘించారంటూ కర్రలతో చితకబాదారు. పదేండ్ల కుమారుడు ‘మా డాడీని కొట్టకండి’ అంటూ పోలీసులను కోరినా పట్టించుకోకుండా వ్యవహరించారు.

కిందపడేసి రౌడీలను కొట్టినట్టు కొట్టారు. అనంతరం తండ్రీకొడుకులను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. ఈ వీడియా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ కావడంతో మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి స్పందించారు. పోలీసుల తీరు సరికాదనీ, వెంటనే విచారణ జరపాలని ఎస్పీ అపూర్వరావును ఆదేశించారు. విధి నిర్వహణలో పాటించాల్సిన నియమావళిని ఉల్లంఘించినందుకు కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేసినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రులకు ఫోన్‌ ద్వారా విన్నవించారు. అయితే అక్కడ విధుల్లో ఉన్నవారందర్నీ సస్పెండ్‌ చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Courtesy Nava Telangana