న్యూఢిల్లీ : ఢిల్లీలో రెండు యూనివర్శిటీలపై పోలీసుల జులుంపై దేశవ్యాప్తంగా విద్యార్థిలోకం ఉద్యమిస్తోంది. ఘటన నాటి నుంచీ పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే.. విద్యార్థుల ఆందోళన, మోడీ సర్కారు అనుసరిస్తున్న హింసాత్మక ధోరణి అర్థమవుతుంది. జామియా మిలియా ఇస్లామియా కళాశాల విద్యార్థులపై పోలీసులు విరుచుకుపడిన రెండు రోజుల తరువాత ఈ నెల 17న దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్డెక్కారు. ఘటన జరిగిన జామియా మిలియా ఇస్లామియా గేట్‌ వెలుపలి నుండి క్రమశిక్షణతో విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రతి 12 మీటర్లకు ఒక వాలంటీర్‌ వంతున ప్రదర్శనను క్రమపద్ధతిలో పెడుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చూశారు. మరికొంతమంది మంచినీటి బాటిళ్లను అందజేశారు. ప్రతిచోటా మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది.. ‘మాకు న్యాయం కావాలి… ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ వంటి నినాదాలు హోరెత్తాయి. ‘నో సిఎఎ.. నో ఎన్‌ఆర్‌సి’ నినాదాలు రాసిన ప్లకార్డులు చేపట్టిన విద్యార్థులు… మధ్యలో కొంతమంది విద్యార్థినుల చేతుల్లో ‘షేమ్‌ ఆన్‌ ఢిల్లీ పోలీస్‌’… ‘బ్లైండ్‌ లీడర్‌… బ్లడ్‌ ఫీడర్స్‌’ నినాదాలున్న పోస్టర్లతో నిరసన ప్రదర్శన క్రమశిక్షణగా ముందుకు కదిలింది. వీరు చేస్తోంది రెండు డిమాండ్లే.. ఢిల్లీ పోలీసుల చేతుల్లో చిత్రహింసలకు గురైన జామియా మిలియా ఇస్లామియా, ఆలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఎన్‌ఆర్‌సి, సిఎఎలను ఉపసంహరించుకోవాలని…

ఈ ప్రదర్శనలో పాల్గొన్న జామియా మాజీ విద్యార్థి తాహిర్‌ అక్తర్‌ తనను పలకరించిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను బార్‌క్లేస్‌లో పనిచేస్తున్నానని చెప్పాడు. ‘నేను భారత్‌లోనే పుట్టి పెరిగాను. పాకిస్తాన్‌ నుండో, ఆఫ్ఘనిస్తాన్‌ నుండో రాలేదు. భారతీయుడి నని ఎందుకు రుజువు చేసుకోవాలి?’ అని ప్రశ్నిం చాడు. భారతీయుడిగా నిరూపించుకోలేకపోతే పౌరసత్వాన్ని కోల్పోతా నని ఆందోళన వ్యక్తం చేశాడు. ‘ఇలా మేం ఎన్ని రోజులు నిరసన కొనసాగించాలి.. ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించు కోకపోతే పరిస్థితి ఏమిటి?.. ఈ నిరసనలతో నేనిప్పటికే వారం నుండి విధులకు వెళ్లటం లేదు?’ అని చెప్పాడు. తాను నిరసనల్లో పాల్గొనేందుకు సెలవు తీసుకున్నానని, తన మేనేజర్‌కు సమాచారాన్ని తెలియచేశానన్నాడు. ముస్లిములపై వివక్షతోనే ఈ చట్టం చేశారని, దీనికి వ్యతి రేకంగా తన జీవితం కోసం పోరాడుతున్నానని చెప్పాడు.

ఘటనా స్థలం వద్ద…!
జామియా గేట్లు మూసి వున్నాయి. భద్రతా సిబ్బంది ఎవరినీ లోనికి అనుమతించటం లేదు. క్యాంపస్‌లోకి వెళ్లేందుకు అనుమతి కోసం చీఫ్‌ ప్రొక్టార్‌ కార్యాలయాన్ని సందర్శించాల్సి వచ్చింది. మాజీ రాష్ట్రపతి, జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపకుడు డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ పేరిట ఏర్పడిన జామియా సెంట్రల్‌ లైబ్రరీ వచ్చే ఏడాది శత వార్షికోత్సవాలకు సిద్ధమవుతోంది. అక్కడికి పోలీసులు దూసుకొచ్చిన తరువాత అది ఒక నేర ప్రదేశాన్ని తలపిస్తోంది. లాఠీచార్జి జరిగిన ఆదివారం సాయంత్రం లైబ్రరీ ప్రధాన ద్వారం మూసి వుందని అక్కడి సెక్యూరిటీ గార్డు 25 ఏళ్ల ఇక్బాల్‌ మెహిందీ చెబుతున్నాడు. ఇది చాలు అక్కడ పోలీసులు ఎందుకు హింసకు పాల్పడ్డారో తెలుసుకోవటానికి! ‘మూసి వున్న కిటికీలను పగులకొట్టేందుకు పోలీసులు రాళ్లు రువ్వారు. లైబ్రరీ రూమ్‌లోకి బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అన్ని వైపుల నుండి లోనికి ప్రవేశించి విద్యార్థులను లాఠీలతో చితక బాదారు’ అని మెహిందీ వివరించాడు. లైబ్రరీ రూమ్‌లో తిరగబడిన కుర్చీలు, విరిగిన ఫర్నీచర్‌ ముక్కలు, పాఠ్య పుస్తకాలు, చెల్లాచెదురుగా పడివున్న స్టేషనరీ… వంటివన్నీ హింసాకాండను కళ్లకు కడుతున్నాయి. పోలీసుల నుండి విద్యార్థులకు అక్కడి టేబుల్స్‌ రక్షణ కల్పించలేక పోయాయి. రెండు కెమెరాలు, వాటికి వున్న వైర్లతో వేలాడుతూ కన్పించాయి. అవే ‘సిసి టివీ కెమెరాల’ని మెహిందీ వివరించాడు. పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారని చెప్పాడు. హింసాకాండకు గుర్తుగా ఒక కిటికీ దగ్గర పొగబాంబుకు చుట్టిన గుడ్డ ముక్క పడి వుంది. దానిపై ‘టియర్‌ స్మోక్‌ యూనిట్‌ (టిఎస్‌యు), టెకాన్‌పూర్‌, గ్వాలియర్‌’ అంటూ ఆ బాంబు తయారయిన ప్రదేశం వివరాలున్నాయి. ‘కస్టమర్ల సంతృప్తే మాకు ముఖ్యం’ అని కూడా రాసి వుంది. బహుశా… ఈ నెల 15న జామియా క్యాంపస్‌లో ఈ పొగబాంబుల వినియోగంతో కస్టమర్‌ సంతృప్తి పతాకస్థాయికి చేరి వుంటుంది! అదే ప్రదేశానికి మరికొంత దూరంలో ‘పాఠకులు కూర్చునే ఏర్పాట్లను కదిలించవద్దు’ అని రాసిన ఒక ఫలకం కన్పించింది. బహుశా పొగబాంబు దెబ్బకి దానికి స్థాన చలనం కలిగి వుంటుంది.

20మందికి పైగా తీవ్ర గాయాలు
ఆందోళనల అణచివేతే లక్ష్యంగా సాగిన ఈ హింసాకాండలో 20 మందికి పైగా విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయని జామియా చీఫ్‌ ప్రొక్టార్‌ వసీమ్‌ అహ్మద్‌ ఖాన్‌ చెప్పారు. కొంతమందికి చేతులు, మరికొంత మందికి కాళ్లు విరిగాయని, మరికొంత మందికి తలలు పగిలాయని తెలిపారు. లైబ్రరీలో కూర్చుని పాఠ్య పుస్తకాలు చదువుకుంటున్న ఎంటెక్‌ విద్యార్థి పోలీసుల హింసాకాండలో కన్ను పోగొట్టు కున్నాడని ఆయన వివరించారు. యూనివర్శిటీ కాంపస్‌లోకి పోలీసులు ప్రవేశించటం చట్ట వ్యతిరేకం కానప్పటికీ, ముందుగా వారు విద్యాలయం అధిపతి అనుమతి పొందాలి. పోలీసులు జామియా క్యాంపస్‌లోకి ఎటువంటి అనుమతి లేకుండానే ప్రవేశించారని అహ్మద్‌ ఖాన్‌ స్పష్టం చేస్తున్నారు. వారితో పాటు బయటి వ్యక్తులు కూడా ప్రవేశించి విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, వారెవరో తమకు తెలియదని ఆయన వివరించారు.

జామియా ఒక్కటే కాదు…
పోలీసుల దౌష్ట్యానికి జామియా విద్యార్థులే కాదు.. ఆలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులు కూడా బలిపశువులయ్యారు. పోలీసుల అమానుష వైఖరికి అక్కడ లభించిన వీడియోలు ప్రత్యక్ష సాక్షిగా నిలిచాయి.

దేశవ్యాప్తంగా సంఘీభావం
తీవ్ర హింసకాండకు గురైన జామియా, ఆలీగఢ్‌ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. అఖిల అసోం విద్యార్థి యూనియన్‌ (అసు), ఐఐటి చెన్నరు, ఎఫ్‌టిఐఐ పుణేల విద్యార్థులు పోలీసుల హింసను, సిఎఎను ఖండిస్తూ భారీయెత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్శిటీ విద్యా ర్థులు పోలీసుల పైశాచికత్వాన్ని తీవ్రంగా ఖండించారు. వాక్స్వాతంత్య్రాన్ని, అసమ్మతి గళాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతోందని స్టూడెంట్‌ బార్‌ అసోసియేషన్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బెంగళూరు ఐఐఎస్‌ విద్యార్థులు మౌన ప్రదర్శన నిర్వహించారు. బెంగళూరు ఐఐఎం విద్యార్థులు, ఫ్యాకల్టీ మొత్తం 172 మంది నరేంద్రమోడీకి లేఖ రాశారు. భారీయెత్తున నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు గురువారం యత్నించిన యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జామియా, ఎఎంయు విద్యా ర్థులకు సంఘీభావంగా ముంబయిలో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌కు చెందిన 600మందికి పైగా విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ముంబయి యూనివర్శిటీ కలినా క్యాంపస్‌ వెలుపల దాదాపు 200 మంది, సోషల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, స్టూడెంట్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌ వంటి సంస్థలు కూడా వారితో గొంతు కలిపాయి. చెన్నరు ఐఐటి, చెన్నరు లయోలా కాలేజ్‌ల విద్యార్థులు గొంతెత్తారు. పుదుచ్చేరిలో పుదుచ్చేరి యూనివర్శిటీ విద్యార్థులు, అధ్యాపకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కొచ్చిన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కాసర్‌గోడ్‌లోని సెంట్రల్‌ యూని వర్శిటీ ఆఫ్‌ కేరళ, ఎస్‌ఎఫ్‌ఐ కేరళ రాష్ట్ర కమిటీ, కాలికట్‌ యూనివర్శిటీ విద్యార్థి సంఘం, మహాత్మాగాంధీ యూని వర్శిటీ కొట్టాయం, పట్టణంతిట్ట వంటి కేంద్రాల్లోనూ విద్యా ర్థులు ఉవ్వెత్తున ఉద్యమిస్తూ సంఘీభావం ప్రకటించారు.

Courtesy Prajashakthi