• చలో ట్యాంక్‌బండ్‌ రక్తసిక్తం
  • కార్మికులపై పోలీస్‌ జులుం
  • లాఠీచార్జీ, బాష్పవాయువు
  • పలువురికి తీవ్ర గాయాలు
  • రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అరెస్టు.. నేతల గృహ నిర్బంధం
  • భారీ ఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చిన ఆర్టీసీ కార్మికులు
  • ముళ్ల కంచెలు దాటి.. బారికేడ్లు తోసి.. ట్యాంక్‌బండ్‌కు
  • తలలు పగిలి.. కాళ్లు చేతులు విరిగి.. మహిళలకు గాయాలు
  • ఆర్టీసీ ఆందోళనలో మావోయిస్టులు: అంజనీకుమార్‌

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ/కవాడిగూడ: దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. వేలాదిగా తరలి వచ్చిన కార్మికులు, విపక్ష నేతలు, కార్యకర్తలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. రోడ్డుపై తరిమి తరిమి కొట్టారు. మహిళలను కూడా మగ పోలీసులే లాఠీలతో బాదారు. పిడిగుద్దులు కురిపించారు. కాళ్లతో తొక్కారు. వందలాది మందికి గాయాలయ్యాయి. ఓ మహిళ ముక్కు దూలం పగిలి రక్తం ధారకట్టింది. మరికొందరికి మోకాలి చిప్పలు, కాలి మడమలు పగిలాయి. సహనం కోల్పోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దాంతో, పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పోలీసులు సైతం రాళ్లు రువ్వారు. వెరసి, ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాం తాలు రణరంగంగా మారాయి. ట్యాంక్‌బండ్‌ రక్తసిక్తమైం ది. 35 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు శనివారం ‘చలో ట్యాంక్‌బండ్‌’ను చేపట్టి ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు. పోలీసులు ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను ఆర్టీసీ కార్మికులు, విపక్ష నేత లు ఛేదించారు. అరెస్టులు.. నిర్బంధాలు సాగించినా చివరకు ట్యాంక్‌బండ్‌ను ముద్దాడారు. అక్కడ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గుంపులు గుంపులుగా.. వందలు.. వేలు!
ట్యాంక్‌బండ్‌ పరిసరాలను పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇనుప కంచె, బారికేడ్లతో మూడంచెల భద్రత ఏర్పాటుచేశారు. నేతలు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులను పలు ప్రాంతాల్లో అరెస్టులు చేశారు. అయినా మధ్యాహ్నం ఒంటి గంటకు ట్యాంక్‌బండ్‌ చేరాలనే పిలుపులో భాగంగా పుట్టలో నుంచి చీమలు వచ్చినట్లు వేలాది మంది ఆర్టీసీ కార్మికులతోపాటు సీపీఎం, సీపీఐ, బీజేపీ, టీజేఎస్‌, సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నేతలు, కార్యకర్తలు ట్యాంక్‌బండ్‌కు వచ్చారు. లిబర్టీ మార్గంలో ఓ గుంపు, దోమలగూడ ఏవీ కాలేజీ మార్గం నుంచి మరో గుంపు, లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ నుంచి ఓ గుంపు, సచివాలయం నుంచి మరో గుంపు, వైశ్రాయ్‌ హోటల్‌ నుంచి ఓ గుంపు.. ఇలా విడతల వారీగా పెద్దఎత్తున ఇనుప కంచెలను ఛేదించుకుని ట్యాంక్‌బండ్‌కు చేరారు. ఆందోళనకారులు ట్యాంక్‌బండ్‌పైకి పరుగులు తీస్తుండగా అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఏ ఒక్కరిని కదిలించినా లాఠీల దెబ్బలే చూపారు. ఓ మహిళా కండక్టర్‌ డ్యూటీ డ్రెస్‌ వేసుకుని హోం గార్డును అని చెప్పి ట్యాంక్‌బండ్‌పైకి చేరి పెద్దపెట్టున నినాదాలు చేశారు. అవాక్కైన పోలీసులు వెంటనే తేరుకుని ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు.

నేతల అరెస్టులు.. గృహ నిర్బంధాలు
చలో ట్యాంక్‌బండ్‌కు మద్దతిచ్చిన పలు పార్టీల ము ఖ్యులు, ఇతర నేతలను పోలీసులు ముందస్తుగానే అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురిని గృహ నిర్బంధం చేశారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 450, జనగామ జిల్లాలో 300, మహబూబాబాద్‌ జిల్లాలో 245, రంగారెడ్డి జిల్లాలో 174, వికారాబాద్‌జిల్లాలో 311, మేడ్చల్‌ జిల్లాలో 537, గద్వాల జిల్లాలో 147, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 731, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 523 మంది, నిజామాబాద్‌, నల్లగొండ జిల్లాల్లో పలువురిని ముందస్తుగా నిర్బంధించారు. అయినా పలువురు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌ నేతలు పోలీసుల కళ్లగప్పి ప్రైవేటు వాహనాలు, రైళ్లలో హైదరాబాద్‌ చేరుకున్నారు. అలాగే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు కుసుమ్‌కుమార్‌, పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌ ముఖ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌, మాజీ మంత్రులు డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌, టీడీపీ-టీఎస్‌ నేతలు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులను ఉదయం నుంచే గృహ నిర్బంధంలో ఉంచారు. కాంగ్రెస్‌ నేతలు వీహెచ్‌, విక్రమ్‌ గౌడ్‌, మల్లు రవి, సతీశ్‌ మాదిగ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి, జేఏసీ నేతలు రాజిరెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులను పోలీసులు అశోక్‌నగర్‌లో అదుపులోకి తీసుకుని లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 200 మంది కార్యకర్తలతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆర్టీసీ క్రాస్‌రోడ్లలో బారికేడ్లను ఛేదించుకుని అశోక్‌నగర్‌వైపు పరుగులు పెట్టారు. రెండు కిలోమీటర్లు పోలీసులను ఉరుకులు పెట్టించారు. టీజేఎస్‌ నేత కోదండరాంను ఇందిరా పార్కు వద్ద; బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, బీజేపీ నేతలు; ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఆయన అనుచరులను వైశ్రాయ్‌ చౌరస్తా వద్ద అరెస్టు చేశారు. బైక్‌పై వస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ వద్ద అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మఫ్టీలో ఉస్మానియా వర్సిటీని జల్లెడ పట్టారు.

మిలియన్‌ మార్చ్‌ నాటి వ్యూహమే తెలంగాణ ఉద్యమ సమయంలో తలపెట్టిన మిలియ న్‌ మార్చ్‌లో పోలీస్‌ వ్యూహాన్ని ఛేదించుకుని కట్ట మైస మ్మ ఆలయం నుంచి ట్యాంక్‌బండ్‌పైకి చేరుకున్నారు. ఇప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులు సరిగ్గా అదే వ్యూహాన్ని అనుసరించారు. కట్ట మైసమ్మ ఆలయం వైపు నుంచి ఒక్కసారిగా పదుల సంఖ్యలో మహిళా కార్మికులు ట్యాంక్‌బండ్‌పైకి చేరుకున్నారు. ట్యాంక్‌బండ్‌ నుంచి వెనుదిరిగి వెళ్తున్న మహిళా కార్మికులపై పోలీసులు విచక్షణారహితంగా దాడిచేశారు. మహిళా కానిస్టేబుళ్లు ఉన్నా పురుష కానిస్టేబుళ్లు లాఠీలతో దాడి చేశారని, తొడ, కాలిపై తీవ్ర గాయాలు అయ్యాయని కల్వకుర్తి నుంచి వచ్చిన కార్మికురాలు వాపోయింది. ఒక్కొక్కరిపై ఐదుగురు పోలీసులు దాడి చేశారని ప్రజ్ఞాపూర్‌ ఆర్టీసీ డ్రైవర్‌ రవీందర్‌ గౌడ్‌ చెప్పారు. లాఠీలతో కొట్టి, పిడి గుద్దులు గుద్దారన్నారు.

రణరంగంగా మారిందిలా..! ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నా.. ఆ తర్వాత మారిపోయింది. ఉదయానికే హైదరాబాద్‌ను పోలీసులు అష్టదిగ్బం ధం చేశారు. చలో ట్యాంక్‌ బండ్‌కు మద్దతు తెలిపి న ఆయా పార్టీల నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మం దిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయినా.. ముళ్ల కంచెలు దాటుకు ని, బారికేడ్లు తోసుకుని వేలాదిమంది ఆర్టీసీ కార్మికులు, ఆందోళనకారులు రావడంతో మరో మిలియ న్‌ మార్చ్‌ను తలపించింది. పోలీసులు ఎంత కట్టడి చేసినా అన్ని జిల్లాల నుంచి ఆందోళనకారులు తరలివచ్చారు. వారిని నిలువరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో లాఠీలకు పని చెప్పారు. మహిళలపైనా లాఠీలు ఝుళిపిం చారు. ఆందోళనకారులు ఎదురు తిరిగి రాళ్లు రువ్వారు. దాంతో మొదట అంబేడ్కర్‌ విగ్రహం వద్ద, తర్వాత లిబర్టీ వద్ద పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పోలీస్‌ వలయాన్ని దాటుకుని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, మాజీ ఎంపీలు జితేందర్‌ రెడ్డి, వివేక్‌ ట్యాంక్‌బండ్‌ వద్దకు చేరుకున్నారు. పోలీసులు ఆయనను అరెస్టు చేశా రు. సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌ రెడ్డిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. చేతి గాయంతోనే సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ నేత పోటు రంగారావు రాగా పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎం నేత సహదేవ్‌ను చుట్టుముట్టి చితకబాదా రు. సొమ్మసిల్లి పడిపోయిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆందోళనకారులు వందలు నుంచి వేలుగా మారడంతో లాఠీచార్జి చేయాలంటూ అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్‌ కేకలు వేశారు. వారు దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కిందపడినా నలుగురైదుగురు పోలీసులు చుట్టుముట్టి కొట్టారు. కల్వకుర్తి డిపోకు చెందిన శేషమ్మ ముఖంపై సీఐ ఎంఎ్‌సవీ కిషోర్‌ లాఠీతో కొట్టడంతో ఆమె ముక్కు దూలం పగిలి రక్తమంతా ధారలు కట్టింది.

Courtesy Andhra Jyothy..