JNU– ప్రశ్నించే గొంతుకలపై దాడులు..
– జేఎన్‌యూలో దాడిచేసిన వారిని వదిలేసి.. అయిషీ ఘోష్‌తోపాటు మరో19 మందిపై తప్పుడు కేసులు
– గూండాలు వర్సిటీ లోపలకి ప్రవేశించినప్పుడు ఎక్కడున్నారు? : ఢిల్లీ పోలీసులపై మండిపడ్డ జేఎన్‌యూ పూర్వ విద్యార్థుల బృందం
– ధర్నాలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనె
– గేట్‌వే ఆఫ్‌ ఇండియా వద్ద కొనసాగుతున్న నిరసనలు

మొన్న మూకలు..నేడు పోలీసులు..ఇలా జేఎన్‌యూలో ప్రశ్నించే గొంతుకలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మూకలను వదిలేసిన పోలీసులు…ఇప్పుడు బాధితులపైనే కేసులు పెట్టడం గమనార్హం. ఐదు దశాబ్దాలుగా భావ సంఘర్షణకూ, ప్రజాస్వామ్య విలువలకూ కేంద్రంగా భాసిల్లుతున్న వర్సిటీ వాతావరణాన్ని చెడగొట్టిన అరాచకవాదుల దాడులకు బాధ్యత వహించాల్సిన వైస్‌ ఛాన్స్‌లర్‌ మామిడాల జగదీశ్‌కుమార్‌ ‘నూతన జీవితాలను ప్రారంభిద్దామంటూ’ సుద్దులు చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. కొత్త జీవితం అంటే ప్రశాంతతను వదిలి అల్లర్లు సృష్టించడమేనా? అని విద్యార్థిలోకం ప్రశ్నిస్తున్నది. భావ సంఘర్షణను తట్టుకోలేని పాలకుల స్వభావాన్ని యావత్‌ భారత ప్రజానీకం నిలదీస్తున్నది. ‘జేఎన్‌యూలో వివాదానికి చదువుతో సంబంధం లేని వ్యవహరాలే కారణం’ అంటూ కర్నాటక విద్యాశాఖ మంత్రి సురేష్‌కుమార్‌ ట్వీట్‌ చేయడం.. ప్రశ్నించేతత్వాన్ని చంపేయడమేనంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జేఎన్‌యూ పరిణామాలు నాజీల కాలం పరిస్థితులను పోలి ఉన్నాయని నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు. జేఎన్‌యూ విద్యార్థులకు బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల బాసటగా నిలిచారు. స్వయంగా వెళ్లి బాధితులను పరామర్శించారు.

జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడి చేసిన వారిని ఒక్కరినీ కూడా ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. కానీ, బాధిత విద్యార్థులపైనే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. జేఎన్‌యూఎస్‌ యూ అధ్యక్షురాలు అయిషీఘోష్‌తోపాటు మరో 19 మందిపై ఢిల్లీ పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇది సర్వత్రా విమర్శలకు దారి తీసింది. పోలీసుల తీరును ఖండిస్తూ జేఎన్‌యూఎస్‌యూ ప్రకటన విడుదల చేసింది. ఫీజులు తగ్గించాలని 70 రోజులుగా శాంతి యుత ఆందోళన చేస్తున్న క్రమంలో విద్యార్థులపై పోలీసులు రెండుసార్లు దాడి చేశారనీ, ఒకసారి ఏబీవీపీ గూండాలు దాడి చేశారనీ వెల్లడించింది. అలాంటిది దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా, దాడికి గురై, తీవ్రగాయాలు పాలైన విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారని విమర్శించింది. వర్శిటీలో ఇంత జరుగుతున్నా వైస్‌ చాన్సలర్‌ ఏమీ పట్టనట్టుగా ఉన్నారని, వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. విద్యార్థులపై జరిగిన దాడికి ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోం మంత్రి బాధ్యత వహించాలని పేర్కొంది. వీసీ మామిడాల జగదీశ్‌కుమార్‌ హాఠావో… జేఎన్‌యూ బచావో అని పిలుపు నిచ్చింది.

గూండాలు వర్శిటీలోపలకి చొరబడినప్పుడు ఎక్కడున్నారు?: పూర్వ విద్యార్థుల ర్యాలీ
జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లు, వర్కర్లపై జరిగిన దాడికి నిరసనగా జేఎన్‌యూ పూర్వ విద్యార్థుల సంఘం మంగళవారం ర్యాలీ నిర్వహించింది. ప్రదర్శన ఓల్డ్‌ క్యాంపస్‌ నుంచి జేఎన్‌యూ నార్త్‌ గేట్‌ వరకు సాగింది. ”జేఎన్‌యూకు సంఘీభావం – స్టాండ్‌ విత్‌ జేఎన్‌యూ” అనే ప్లకార్డులు మెడలో వేసుకొని నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో పోలీసులు జేఎన్‌యూ పూర్వ విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, పూర్వ విద్యార్థులకు స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ”వర్సిటీలోకి గూండాలు ప్రవేశించినప్పుడు పోలీసులు ఎక్కుడున్నారు” అని పూర్వ విద్యార్థులు మండిపడ్డారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కరత్‌, పర్యావరణ వేత్త రఘునందన్‌, థియేటర్‌ కార్యకర్త షంసుల్‌ ఇస్లాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ జేఎన్‌యూ లో జరిగిన హింస, విద్యార్థులు, ప్రొఫెసర్లపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని అన్నారు. వీసీని తొలగించాలని, దాడి చేసిన వారిని గుర్తించాలని డిమాండ్‌ చేశారు. పెంచిన ఫీజులను వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే జేఎన్‌యూ పూర్వ విద్యార్థుల సంఘం విడుదల చేసిన ప్రకటనలో ”పాత అడ్మిషన్‌ పాలసీని పునరుద్దరించాలి. ఫీజుల పెంపును వెనక్కి తీసుకోవాలి. యూనివర్సిటీల్లో ప్రజాస్వామ్య హక్కులను, ప్రజాస్వామ్య సంస్థలను పునరుద్దరించాలి. ఎంహెచ్‌ఆర్‌డీ న్యాయ విచారణ జరపాలి. దాడి చేసిన వారిని శిక్షించాలి. యూనివర్సిటీలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వెంటనే ప్రస్తుత వీసీని తొలగించాలి” అని పేర్కొంది.సీపీఐ ఎంపీ బినరు అమిత్‌ షా ప్రివిలేజ్‌ మోషన్‌సీపీఐ రాజ్యసభ సభ్యుడు బినరు విశ్వం కేంద్ర హోం మంత్రిపై ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ సభా హక్కులు ఉల్లంఘించే ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు.

విద్యార్థుల ధర్నాలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనె
జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనె జేఎన్‌యూ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొంది. జేఎన్‌యూ విద్యార్థులు, ప్రొఫెసర్లపై జరిగిన దాడిని ఆమె ఖండించారు. అలాగే జేఎన్‌యూటీఏ, జేఎన్‌యూఎస్‌యూ నేతృత్వంలో వర్సిటీలో భారీ సభ జరిగింది. ఈ సభలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐఎంఎల్‌ పొలిట్‌బ్యూరో సభ్యురాలు కవితా కృష్ణన్‌ తదితరులు హాజరయ్యారు.

జేఎన్‌యూలో క్రైం బ్రాంచ్‌ బృందం సందర్శన
ఢిల్లీ పోలీస్‌ క్రైం బ్రాంచ్‌ బృందం జేఎన్‌యూని సందర్శించింది. ఢిల్లీ పోలీసు జాయింట్‌ కమిషనర్‌ షాలినిసింగ్‌ ”మేము అన్ని ప్రదేశాలను సందర్శించాం. జేఎన్‌యూలోని విద్యార్థులతో మాట్లాడాం. ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభ దశలో ఉంది. విద్యార్థులు మాపై విశ్వాసం ఉంచారు. మాకు కొన్ని వివరాలు ఇచ్చారు” అని తెలిపారు. సాక్ష్యాలను సేకరిం చడానికి ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ బృందాలు జేఎన్‌యూను సందర్శిం చాయి. పోలీసులు జేఎన్‌యూ లోపల ఉంటే సాధారణ పరిస్థితులు వస్తాయని జేఎన్‌యూ ప్రొఫెసర్‌ చింతామణి మహాపాత్ర అన్నారు.

వీసీ శాంతివచనాలు
వర్సిటీలో దాడి జరిగి రెండు రోజుల తరువాత వీసీ ఎం. జగదీశ్‌కుమార్‌ పత్రిక ప్రకటన ఇచ్చారు. అయితే ఈ ప్రకటనలో హాస్టల్‌ నమోదు ప్రక్రియ జరుగుతుందని చెప్పడానికి ప్రకటనలో ఎక్కువ భాగం కేటాయించారు. జేఎన్‌యూ క్యాంపస్‌ సురక్షితమైన ప్రదేశమని, విద్యార్థులంతా తిరిగి క్యాంపస్‌కు రావాలని కోరారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నూతన జీవితాలను ప్రారంభిద్దామంటూ శాంతివచనాలు పలికారు.

దాడికి ప్రేరేపించే వాట్సాప్‌ గ్రూప్‌లో జేఎన్‌యూ చీఫ్‌ ప్రొక్టర్‌
దాడికి ప్రేరేపించే వాట్సాప్‌ గ్రూపులో జేఎన్‌యూ చీఫ్‌ ప్రొక్టర్‌ వివేకానంద సింగ్‌ ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఈయన 2004 జేఎన్‌యూఎస్‌యూ ఎన్నికల్లో ఏబీవీపీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే దీనిపై చీఫ్‌ ప్రొక్టర్‌ సింగ్‌ స్పందిస్తూ ”నేను క్రియాశీల సభ్యుడిని కాదు. ఇప్పుడు ఆ గ్రూపులో లేను. శాంతిని పునరుద్ధరించడం ప్రస్తుతం నాకు చాలా ముఖ్యమైనది. సమూహాలతో సంబంధం లేకుండా వారంతా నా విద్యార్థులు. నేను ఈ విశ్వవిద్యాయలం విద్యార్థిని” అని పేర్కొన్నారు.

(Courtesy Nava Telangana)