అసలు ఎవరు.. నకిలీ ఎవరో తెలీక ప్రజల సతమతం
వాస్తవాలు వెల్లడిస్తే బలగాల నుంచి వేధింపులు
లోయలో మీడియాపై అపనమ్మకం
శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకాశ్మీర్‌ విభజన నిర్ణయం జరిగి దాదాపు రెండు నెలల గడుస్తున్నా.. లోయలో మాత్రం పరిస్థితులు సాధారణ స్థితికి చేరడంలేదు. సమాచార వ్యవస్థ ఇప్పటికీ పునరుద్ధరణ కాలేదు. టెలిఫోన్‌ లైన్లు కలవడం లేదు. రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. మరీ ముఖ్యంగా అక్కడి సమాచారాన్ని బయటి ప్రపంచానికి చేరవేసే స్థానిక మీడియాపై దీని ప్రభావం మరింతగా పడింది. దీంతో అక్కడి జర్నలిస్టులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇక ఇక్కడి పోలీసు అధికారులు, బీజేపీ నేతలు విలేకరుల వేషంలో వెళ్లి ప్రజల నుంచి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఎవరైనా అక్కడి నిజాలు తెలిపితే ఇక అంతే సంగతులు. అక్కడి భద్రతా బలగాలు వారిని వేధింపులకు, చిత్రహింసలకు గురిచేస్తున్నాయి. ఇటు అసలు మీడియా విలేకరులు ఎవరో తెలీక.. అటు సైనిక బలగాల వేధింపులకు భయపడి సాధారణ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో మీడియాపై వారికి విశ్వాసం సన్నగిల్లింది. ఇక జాతీయ మీడియా ఇక్కడి వాస్తవాలను, దుర్భర పరిస్థితులను తొక్కిపెట్టి ‘అంతా సాధారణంగా’ ఉన్నదని అవాస్తవాలను ప్రసారం చేయడం గమనార్హం.
దిగ్బంధంలో ఉన్న కాశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ కాశ్మీర్‌ ప్రెస్‌ క్లబ్‌ వద్ద దాదాపు 300 మందికి పైగా జర్నలిస్టులు ఇటీవలే నిరసనకు దిగారు. అధికార బలంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి ప్రజల గొంతును నొక్కుతున్నాయని వారు ఆరోపించారు. ”సైనిక బలగాలు మమ్మల్ని భయకంపితుల్ని చేస్తున్నాయి. ఒకవేళ మేము మీడియాతో మాట్లాడినట్టు తెలిస్తే వారు(సైనికులు) మా ఇండ్లకు చేరుకొని కుటుంభసభ్యులందరినీ శిక్షిస్తారు” అని దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌కు చెందిన బాధిత టీనేజర్‌ ఒకరు వాపోయాడు. భద్రతా బలగాల టార్చర్‌కు భయపడి సదరు బాధితుడు గతంలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికీ పాల్పడటం గమనార్హం. ” లోయలోని పరిస్థితుల గురించి మేము వాస్తవాలు తెలిపినప్పటికీ.. జాతీయ మీడియా మాత్రం పూర్తిగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నది. ఇక్కడ(కాశ్మీర్‌) అంతా సవ్యంగానే ఉన్నదని చూపిస్తున్నది” అని మరొక బాధితుడు వివరించారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కాశ్మీర్‌లో జర్నలిజం అంత సులువు కాదనీ, ఆంక్షల కారణంగా జర్నలిస్టులందరూ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానిక విలేకరి ఒకరు వాపోయారు. ”భద్రతా బలగాలు దాడితో ఒక ఇళ్లు ధ్వంసంమైంది. అయితే అక్కడికి తాను వెళ్లినప్పటికీ ప్రజలు నాతో మాట్లాడటానికి తిరస్కరించారు. ఒక వేళ మాట్లాడితే తర్వాతి ఎలాంటి పరిణామాలు ఉంటాయోనన్న భయం వారిలో ఉన్నది” అని మరొక జర్నలిస్టు వివరించారు.
కాగా, అక్కడిపోలీసు అధికారులు, బీజేపీ నేతలు నకిలీ విలేకరుల అవతారం ఎత్తి మారి స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారనీ, అనంతరం మళ్లీ వచ్చి తమను శిక్షిస్తున్నారని బాధితులు వాపోయారు. ఇందుకు తగిన సాక్ష్యాధారాలను సైతం స్థానికులు పొందుపరిచారు. పోలీసులు, బీజేపీ నేతల చర్యలతో స్థానిక మీడియాపై ఉన్న నమ్మకం లోయలో చాలా తగ్గిపోయింది. దీంతో వార్తలు, వాస్తవాల కోసం లోయలోని ప్రజలు అంతర్జాతీయ మీడియాపై ఆధారపడుతుండటం గమనార్హం.

Courtesy Nava telangana…