-సూర్యాపేటలో నర్సులపై లాఠీచార్జి
-ఖమ్మంలో ఏసీపీ దురుసు ప్రవర్తన

కరోనా నివారణ కోసం వారి ప్రాణాలనే పణంగా పెట్టి అహర్నిశలు శ్రమిస్తూ సేవలందిస్తున్న వైద్యులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. సూర్యాపేట జిల్లాలో డ్యూటీకొస్తున్న నర్సులపై లాఠీచార్జి చేయగా, ఖమ్మంలో సోమవారం రాత్రి డ్యూటీకి వెళుతున్న ఇద్దరు వైద్యులపై ఏసీపీ దురుసుగా ప్రవర్తించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది మంగళవారం డ్యూటీకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని లాఠీలకు పని చెప్పారు. ఈ ఘనటపై వైద్య సిబ్బంది జనరల్‌ ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. సీనియర్‌ నర్సు పద్మ మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రిలో పని చేస్తున్న తనను కోర్టు చౌరస్తాలో ఎస్‌ఐ కొట్టారని ఆరోపించారు. అదే ఆస్పత్రిలో డ్యూటీకి తీసుకొస్తున్న స్టాఫ్‌నర్సు భర్తపైనా పోలీసులు చేయి చేసుకున్నారని చెప్పారు. ఐడీ కార్డు చూపించినా పట్టించుకోలేదన్నారు.

పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సోమవారం రాత్రి ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్‌ రోడ్‌లో ఏసీపీ ఆధ్వర్యంలో పోలీస్‌ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఐసీయూలో సేవలందించే వైద్యుడు శ్యాం విధులకు వెళ్తున్న క్రమంలో ఏసీపీ ఆపి వివరాలు సేకరిస్తున్న క్రమంలో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అదే సమయంలో మమత ఆస్పత్రికి చెందిన ఓ మహిళా వైద్యురాలు విధులు నిర్వహించేందుకు వెళ్తుండగా అదే పోలీస్‌ అధికారి ఆపి ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం.

ఈ క్రమంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకోగా ఆమెను వెంటనే టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ అక్కడికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులు, పోలీసులు సంయమనం పాటించాలని సూచించి పంపారు. మంగళవారం ఉదయం ఆమె స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. పోలీస్‌ అధికారులు వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడంతో ఫిర్యాదును వాపసు తీసుకున్నట్టు సమాచారం.

Courtesy Nava Telangana