పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్నార్సీ)లకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఆందోళనల్లో పోలీసుల దమనకాండ పెచ్చరిల్లిందని, ముస్లింలే టార్గెట్‌గా కాల్పులు, లాఠీచార్జీ, కేసులు పెట్టారని వంద యూనివర్సిటీలకు చెందిన విద్యార్ధుల నిజనిర్థారణ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ఈ కమిటీ ఉత్తరప్రదేశ్‌లో ఘర్షణలు జరిగిన మీరట్‌, ముజఫరాబాద్‌, అలీఘర్‌, బిజ్నోర్‌, ఫిరోజాబాద్‌, గోరఖ్‌పూర్‌, వారణాసి సహా పలు ప్రాంతాల్లో పర్యటించింది. బాధితులు, వారి కుటుంబసభ్యులతో మాట్లాడింది. అల్లర్లకు సంబంధించిన సాక్షాధారాలను సేకరించింది. వీటిన్నింటిలో పోలీసుల దౌర్జన్యాలకు సంబంధించిన అనేక అంశాలు వెల్లడయ్యాయని కమిటీ సభ్యులు సౌరవ్‌ (హెచ్‌సీయూ), అపర్ణ (టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌) తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారితో పాటు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్‌మూర్‌ వెంకట్‌ కూడా మాట్లాడారు. పోలీసుల దమనకాండలో 24 మంది మరణించారని, వేలాది మంది క్షతగాత్రులు అయ్యారని చెప్పారు. నిజనిర్ధారణకు వెళ్లిన తమ బృందాలను అడ్డుకొనేందుకు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అనేక ఆంక్షలు విధించారన్నారు. పోలీసుల దుశ్చర్యలు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్‌ రెచ్చగొట్టే ప్రకటనలను కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు.

ఈ నివేదికను న్యాయస్థానానికి, యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కేంద్ర హోం మంత్రిత్వశాఖకు ఇస్తామని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న రాజ్యహింసపై ప్రజల్లో చర్చ జరగాలని, అందువల్లే ఆ నివేదకను పబ్లిక్‌ డొమైన్‌లో పెడుతున్నట్టు వివరించారు. యూపీ అల్లర్లపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో స్వచ్ఛంద విచారణ జరిపించాలని, మృతుల పోస్ట్‌మార్టం రిపోర్టుల్ని కుటుంబసభ్యులకు ఇవ్వాలని, అల్లర్లలో గాయపడిన వారికి వైద్యం చేసేందుకు నిరాకరించిన ప్రభుత్వ వైద్యులపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు రద్దు చేయాలని, ఆస్తుల రికవరీ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

Courtesy Nava Telangana