ప్రఖ్యాత కవి దేవిప్రియ ఇకలేరు

హైదరాబాద్‌ సిటీ, గుంటూరు : తెలుగు పాత్రికేయ రంగంలో ‘కార్టూన్‌ కవిత్వం’తో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన రచయిత, ‘రన్నింగ్‌ కామెంట్రీ’ కవితలతో పాఠకుల మన్ననలు పొందిన ప్రయోగశీల కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత షేక్‌ ఖాజా హుసేన్‌ (72) ఇకలేరు. దేవిప్రియగా పాఠకలోకానికి చిరపరిచితుడైన ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 7:15 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేవిప్రియ స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా, తాడికొండ. తల్లిదండ్రులు షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌, ఇమామ్‌ బీ. గుంటూరు ఏసీ కాలేజీలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. దేవిప్రియ భార్య రాజ్యలక్ష్మి ఆరేళ్ల క్రితం కన్నుమూశారు. ఈ దంపతులకు కుమారుడు ఇవా సూర్య, కూతురు సమత ఉన్నారు. దేవిప్రియ.. ‘ఆంధ్రజ్యోతి,’ ‘ఉదయం’ తదితర పత్రికల్లో ‘‘రన్నింగ్‌ కామెంట్రీ’’ పేరుతో అక్షరవిన్యాసం చేసిన ఘనత దేవిప్రియ సొంతం.  దేవిప్రియ ‘గాలిరంగు’ కవితా సంపుటికి 2017, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది.

‘అమ్మచెట్టు’ కవితా సంకలనానికి ఫ్రీవర్స్‌ఫ్రంట్‌తో పాటు తెలుగు యూనివర్సిటీ సాహిత్య ఉత్తమ సాహిత్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ హంస అవార్డు అందుకున్నారు. సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని విద్యుత్తు దహనవాటికలో శనివారం మధ్యాహ్నం దేవిప్రియ అంత్యక్రియలు ముగిశాయి. దేవిప్రియ మృతిపట్ల తెలంగాణ  సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. కవిగా, రచయితగా, కార్టునిస్టుగా సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు దేవిప్రియ ఎంతగానో కృషిచేశారని అన్నారు. మంత్రి హరీశ్‌, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, సంతాపం వ్యక్తం చేశారు.

Courtesy Andhrajyothi