– నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
– యూపీలో మరింత దారుణస్థితి..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక… నిరుద్యోగులు, ఆడపిల్లలు, మహిళలు ఇలా వివిధ కేటగిరిలకు చెందిన వారి కోసం పలు స్కీమ్‌లను ప్రవేశపెట్టారు. పేర్లు మార్చి పథకాలను తెరపైకి తెస్తున్నా..వాటి అమలుతీరు ఎలా ఉన్నది.? కేంద్రంలోనూ,రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నచోట అయినా పథకాల తీరు బాగుందా..? ఇంతకీ ప్రధానమంత్రి మాతృవందన యోజన (పీఎంఎంవీవై) మహిళలకు ఉపయోగపడుతున్నదా..!లేదా..? దీనిపై ప్రత్యేక కథనం..
న్యూఢిల్లీ: గతంలోనూ గర్భిణీలకు పథకాలు ఉన్నాయి. వాటిని అటు ఇటు మార్చి కొత్త పథకమంటూ తెరపైకి తెచ్చారు. అదే ‘ప్రధానమంత్రి మాతృవందన యోజన (పీఎంఎంవీవై)’. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు (తొలి బిడ్డకు మాత్రమే) ఈ పథకం కింద రూ.5,000లను మూడు దశలుగా అందించాలన్నది ఈ పథక లక్ష్యం. తల్లి, బిడ్డ ఆరోగ్య భద్రత లక్ష్యంగా ఈ పథకం అందుబాటులోకి తెచ్చామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసింది. ఇతర పథకాల్లాగే ఈ పథకం కూడా ప్రకటనలకే పరిమితమైందా? గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యంపట్ల కేంద్ర సర్కార్‌ నిర్లక్ష్యం వహిస్తున్నదా? కేంద్రంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్య ధోరణినే అనుసరిస్తున్నాయని తాజా సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. ఇందులో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది.
జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, హిమాచల్‌ప్రదేశ్‌లలో గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ, నర్సింగ్‌ మహిళలపై జరిపిన ఈ తాజా సర్వేలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో చాలా మంది మహిళలకు ఆరోగ్య సంరక్షణ సరిగా లేదనీ, చాలా తక్కువ విశ్రాంతి లభించిందనీ, ఆ సమయంలో వారికి సరైన పోషకాహారం కూడా అందలేదని తేలింది. ఈ ప్రమాణాల ఆధారంగా చూస్తే.. వారిని నిర్లక్ష్యం చేయటంలో ఉత్తరప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంఎంవీవై అమలు కూడా ఈ రాష్ట్రాల్లో పేలవంగా ఉన్నది. ఈ పథకం కింద సగటున 23శాతం మంది మహిళలు మాత్రమే ప్రయోజనం పొందారు.
ఆర్థికవేత్తలు రీతికా ఖేరా, జీన్‌ డ్రేజ్‌, సామాజిక శాస్త్రవేత్త అన్మోల్‌ సోమంచి నేతృత్వంలో విద్యార్థి వాలంటీర్లు ఈ అధ్యయనాన్ని ‘గర్భిణి..బిడ్డ (‘జచ్ఛా-బచ్ఛా) పేరుతో 2019 జూన్‌లో నిర్వహించారు. గ్రామీణ మహిళలు గర్భవ తిగా ఉన్నపుడు… ప్రసవ సమయంలో వారి వైద్య రికార్డుల ను పరిశీలించీ ఈ పరిశోధన చేశారు. ఆరు రాష్ట్రాల్లోని ఒక్కో ప్రధాన జిల్లాను ఎంపిక చేసుకునీ, 60కి పైగా అంగన్‌వాడీ కేంద్రాల్లో 342 మంది గర్భిణీ స్త్రీలను, 364 మంది నర్సింగ్‌ మహిళలను పరిశోధకులు ఇంటర్వ్యూ చేశారు.
పోషకాహారం
గర్భిణీ ఆరోగ్యానికి పోషకాహారం ప్రాథమిక అవసరం.. కానీ, చాలా మంది మహిళలకు పోషకాహారం లభించలేదు. నర్సింగ్‌ మహిళల్లో కేవలం 31శాతం మంది గర్భిణీ సమయంలో కొంచెం ఎక్కువ పోషకాహారం తీసుకున్నట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఖ్య 12శాతానికి పడిపోయింది. 2013 నాటి జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం… అంగన్‌వాడీ కేంద్రాలు, క్రెచ్‌లలో గర్భిణీలు, పాలిచ్చే మహిళలకు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్లెట్లు, ఇతర ఆహార పదార్థాలతోపాటు వంటిన ఆహారాన్ని కూడా వారికి ఇవ్వాలి. అయితే, ఉత్తర ప్రదేశ్‌లోని అంగన్‌వాడీల స్థితి అత్యంత దారుణంగా ఉన్నట్టు పరిశోధనలో తేలింది. పాఠశాలలకు సెలవుల సమయాల్లో అంగన్‌వాడీలను మూసివేస్తున్నారు. గర్భిణీలకు, పిల్లలకు ఆ సమయంలో ఎలాంటి ఆహారం అందటంలేదు.
బరువు పెరగటం, విశ్రాంతి
సరైన పోషకాహారం లేకపోవడంతో గర్భవతులు అవసరమైన బరువు పెరగడంలేదు. ఉత్తర ప్రదేశ్‌లో 60శాతం మంది గర్భిణీలు ఆ సమయంలో బరువు పెరగలేదని అధ్యయనం వెల్లడించింది. గర్భిణీలు డెలివరీ సమయానికి 13 నుంచి 18 కిలోల బరువు పెరగాలి. కానీ, సర్వే నిర్వహించిన మొత్తం మహిళల్లో బరువు పెరుగుదల సగటున కేవలం 7 కిలోలు మాత్రమే కావటం గమనార్హం. అలాగే ఉత్తర ప్రదేశ్‌లో ఇది 4 కిలోల కంటే తక్కువగా ఉంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో సగటు బరువు 11 కిలోలతో కాస్త మెరుగుదల స్థాయిలో వున్నప్పటికీ, వాస్తవానికి ఇదికూడా అవసరమైన బరువు కంటే తక్కువే. గర్భిణీ స్త్రీలకు ‘తగినంత విశ్రాంతి’కి సంబంధించి ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ పేలవ స్థితిలో వున్నాయి. ఈ రాష్ట్రాల్లో సగానికి పైగా మహిళలు తాము తగినంత విశ్రాంతి తీసుకోలేదని తెలిపారు. సర్వే నిర్వహించిన రాష్ట్రాల్లో అన్ని స్థాయిల్లోనూ హిమాచల్‌ ప్రదేశ్‌ కాస్త మెరుగైన స్థాయిలో ఉండటం గమనార్హం.
ఉచితం కాదు….. తడిసిమోపెడు..
వాస్తవానికి గ్రామీణ మహిళలందరికీ ప్రజారోగ్య కేంద్రాల్లో అంబులెన్స్‌ కేటాయింపు సహా.. ప్రసవం ఉచితంగా చేయాలి. జాచా-బచ్చా సర్వేలో తేలిందే మిటంటే.. డెలివరీ సమయంలో కుటుంబాలు సగటున రూ.6,500ల వరకూ ఖర్చుచేశాయి. ఇది వారి కుటుంబ నెలవారీ ఆదాయంతో సమానం. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం.. గర్భిణీ స్త్రీలందరికీ రూ.6 వేల ఆర్థిక సహాయం అందించాలి. 2013లో ఈ చట్టం అమల్లోకి రాగా.. అప్పటి నుంచీ ఇది నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్న ది. కాగా, 2017 మోడీ సర్కార్‌ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది – అదే ప్రధానమంత్రి మాతృ వందన యోజన. కాగా, ఆర్థిక సహాయాన్ని రూ. 5,000లకు పరిమితం చేసింది. ఈ మొత్తం కూడా మొదటి బిడ్డకు మాత్రమే పరిమితం చేసింది. ఈ పథకం అమలులో కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నట్టు జచ్ఛా-బచ్ఛా సర్వేలో తేలింది. సర్వే చేసిన మహిళల్లో అర్హత వున్న అందరికీ రూ.5,000 అందలేదు. 39శాతం మంది మహిళలు మాత్రమే మొదటి విడత మొత్తాన్ని పొందారు. కేవలం 14శాతం మంది మహిళలు మాత్రమే మూడు విడతల సహాయం లభించిం ది. ఛత్తీస్‌గఢ్‌ అత్యల్ప స్థాయిలో ఉండటం గమనార్హం.

Courtesy Navatelangana..