– పీఎంజీకేఎవై కింద లక్ష్యం 8 కోట్ల మంది…
– 20 లక్షల మంది వలస కూలీలకు అందిన రేషన్‌
– మోడీ సర్కార్‌ ఇచ్చిన లాక్‌డౌన్‌ హామీలు నీటిమూటలే : విశ్లేషకులు

లాక్‌డౌన్‌లో వలసకూలీల బతుకులు ఆగమాగమయ్యాక.. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై)ను తెరపైకి తెచ్చింది మోడీ సర్కార్‌. దేశవ్యాప్తంగా ఎంతమంది వలసలకు వెళ్లారో.. వారికి రేషన్‌ ఏవిధంగా అందజేయాలో ముందస్తుగా ఆలోచన చేయకుండానే లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని ప్రకటించింది. మూడు నెలల తర్వాత ప్రజాసంఘాలు, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టాక కేంద్రం రంగంలోకి దిగింది. రాష్ట్రాలిచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి చివరకు ఎనిమిది కోట్లమంది వలసకూలీలు ఉన్నారని గుర్తించింది. వారికి రేషన్‌ ఇవ్వాలని ప్రణాళిక తయారు చేసింది. కానీ ఆ రేషన్‌ సరుకులు అందుకున్న కూలీలు కేవలం రెండు శాతం మందేననీ గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. లాక్‌డౌన్‌లో మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటిమూటలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి నగరాల నుంచి కాలినడకన ఇంటికి చేరే వలస కార్మికుల కోసం కేంద్రం ఆర్భాటంగా ప్రకటించిన పీఎంజీకేఏవై దారుణంగా విఫల మైంది. గడిచిన నెలలో దేశవ్యాప్తంగా 20.26 లక్షల మంది మాత్రమే ఈ పథకం కింద లబ్ది పొందారు. 8 కోట్ల మంది వలస కూలీలను లబ్దిదారులుగా చేర్చుతూ కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా దాంట్లో 2శాతం మందికే పంపిణీ చేయడం గమనార్హం. ఈ మేరకు మోడీ ప్రభుత్వం ఇటీవలే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. దేశంలో ఎవరినీ అర్థాకలితో ఉంచబోమనీ, అందరి కడుపులు నింపుతా మని చెబుతూ..

రేషన్‌ కార్డు లేని వలస కూలీలకు ఒకరికి 5 కిలోల బియ్యం, కిలో పప్పును రెండు నెలల పాటు ఉచితంగా పంపిణీ చేస్తామని మే 14న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఇటీవలే ఒక ప్రకటనలో.. ‘రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
కలిపి 10,131 టన్నుల ఆహారధాన్యాలను 20.26 లక్షల మంది లబ్దిదారులకు పంపిణీ చేశాయి’ అని తెలిపింది.

రెండు నెలలకు గానూ 7.99 లక్షల టన్నుల ఆహారధాన్యాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా మే నెలకు గానూ 4.42 లక్షల టన్నుల ధాన్యాలను పంచడానికి అనుమతించారు. కానీ అందులో సుమారు 3 శాతం ధాన్యాన్ని కూడా పంచలేదు. ఇక రెండు నెలలకు గానూ 39 వేల టన్నుల పప్పులను పంచాలని లక్ష్యంగా పెట్టుకోగా.. దాంట్లో 631 టన్నులనే పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి గానూ మోడీ సర్కారు మార్చి 24న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఇది మొదలైనప్పట్నుంచీ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా ల వంటి పెద్ద నగరాలే గాక జిల్లా కేంద్రాలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వలస కూలీలు సైతం రవాణా సౌకర్యాలు లేక కాలినడకనే ఇంటి బాట పట్టారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వేలాది కిలోమీటర్లు నడిచే ప్రక్రియలో చాలా మంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. ఎంతో శ్రమకోర్చి ఇండ్లు చేరిన వీరికి పనులు కల్పించడం పక్కనబెడితే కనీసం నిత్యావసరాలను పంపిణీ చేయడంలోనూ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్వయంగా ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి.

Courtesy Nava Telangana