• ప్రధానికి పీఎంసీ డిపాజిటర్ల సూటి ప్రశ్న
  • ఆర్‌బీఐ ముందు నిరసన

ముంబై : పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర సహకార (పీఎంసీ) బ్యాంకు డిపాజిటర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. బ్యాంకులో మిగిలిన తమ డిపాజిట్ల చెల్లింపులకు భరోసా కల్పించాలని ముంబై సబర్బన్‌ ప్రాంతంలోని ఆర్‌బీఐ స్థానిక కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన జరిపారు. సతీష్‌ థాపర్‌ అనే డిపాజిటర్‌ అయితే ప్రధాని మోదీ దీనిపై నోరెత్తక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 16,000 మంది డిపాజిటర్ల జీవితాలతో ముడిపడిన ఈ అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడినా మోదీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పరిస్థితి ఇలానే ఉంటే ఉగ్రవాదులం కావడం మినహా మాకు మరో మార్గం లేదు, ఏం చేయమంటారు అని ప్రశ్నించారు.

తర్వాత వారు జీఎం స్థాయి ఆర్‌బీఐ అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. పీఎంసీ బ్యాంకును వేరే ఏదైనా మంచి బ్యాంకులో విలీనం చేయడం లేదా ఆర్‌బీఐ స్వయంగా నిధులు సమకూర్చి పునరుద్ధరించడం ద్వారా తమ డిపాజిట్లకు రక్షణ కల్పించాలని కోరారు. లేదంటే బ్యాంకు ప్రధాన అధికారులు, హెచ్‌డీఐఎల్‌ ప్రమోటర్ల నుంచి స్వాధీనం చేసుకున్న రూ.4,000 కోట్లకుపైగా ఆస్తులను వేలం వేసి తమ డిపాజిట్లు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఎస్‌బీ, కరెంట్‌ ఖాతాలను వెంటనే పునరుద్ధరిస్తే రోజు వారీ ఖర్చులకు అవసరమైన నగదునైనా వెనక్కి తీసుకుంటామని కోరారు.

Courtesy Andhrajyothi…