– ప్రధానికి పౌరసత్వ ధ్రువీకరణపై ఆర్టీఐ ప్రశ్నకు పీఎంవో స్పందన
– ‘మరి మాకెందుకు..?’ అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు

న్యూఢిల్లీ : ‘మోడీ భారత ప్రధాని. పుట్టుకతోనే ఆయన ఈ దేశ పౌరుడు. ఆయన కొత్తగా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ ఇదీ.. ఓ ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఇచ్చిన సమాధానం. ఓవైపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమ వుతుంటే మరోవైపు జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌)లపై భయాందోళనలతో పౌరసత్వం నిరూపించు కోవడం కోసం జనాలు ప్రభుత్వ కార్యాలయాల వెంట
నానా తంటాలు పడుతున్నా.. పీఎంవో మాత్రం ప్రధానికి పౌరసత్వ నిరూపణ అవసరం లేదని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాల్లోకెళ్తే… ప్రధాని పౌరసత్వ ధ్రువీకరణ పత్రం కావాలని సమా చార హక్కు కార్యకర్త శుభంకర్‌ సర్కార్‌ సంబంధిత శాఖకు అర్జీ పెట్టుకు న్నారు.

ఈ మేరకు స్పందించిన పీంఎవో… ‘పౌరసత్వ చట్టం 1955, సెక్షన్‌ 3 ప్రకారం ప్రధాని మోడీ పుట్టుకతోనే భారతీయుడు. కావున ఆయన పౌరసత్వాన్ని నిరూపించుకోవాలనే ప్రశ్నే తలెత్తదు’ అని తెలిపిం ది. దీనిపై ప్రముఖ ఉర్దూ పత్రిక సియాసిత్‌ డైలీ స్పందిస్తూ.. పీఎంవో సమాధానం అస్పష్టంగానే గాక సందిగ్ధంగానూ ఉన్నదని ప్రచురించింది. పీఎంవో సమాధానంపై నెటిజన్లూ అదే రీతిలో స్పందిస్తున్నారు. భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులందరికీ సమాన హక్కులను కల్పిస్తున్నదనీ.. అది దేశ ప్రథమ పౌరుడైనా, ప్రధానైనా, సాధారణ ప్రజానీకానికైనా ఒకే విధమైన సమానత వర్తిస్తుందని అంటున్నారు. ప్రధానికి పౌరసత్వ నిరూపణ అవసరం లేనప్పుడు మరి సాధారణ పౌరులకెందుకు…? అని ప్రశ్నిస్తున్నారు. చట్టం అందరికీ సమానమైనప్పుడు కేంద్రం ఇలాంటి వివాదాస్పద చట్టాలను ఎందుకు తీసుకొస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Courtesy Nava Telangana